Published : 01/04/2023 12:28 IST

పిల్లలు ఆయన దగ్గరకు వెళ్లాలంటే వణికిపోతున్నారు..!

నా భర్త వ్యాపారం చేస్తుంటారు. తనకు కోపం చాలా ఎక్కువ. మాకు 6, 4 ఏళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఆయన చిన్న విషయానికి కూడా నా పైన,  నా తమ్ముళ్ల పైన అరుస్తుంటారు. అది చూసిన పిల్లలు తండ్రంటే చాలా భయపడుతున్నారు. తన దగ్గరకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అందుకు కూడా ఆయన నన్నే తిడుతున్నారు. నాన్నకు మీరంటే ఇష్టమని చెప్పినా పిల్లలకు అర్థం కావడం లేదు. వాళ్లలో తండ్రి పట్ల ఉన్న భయం పోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ భర్తకు కోపం చాలా ఎక్కువని చెబుతున్నారు. కోపం రాగానే అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికి తెలియడం లేదు. ఈ క్రమంలో అతని కోపానికి అదుపు లేకుండా పోతుందని మీరు చెప్పిన దానిని బట్టి అర్థమవుతోంది. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు ఉండాలి. ఇందుకోసం ఇద్దరి మధ్య సానుకూల వాతావరణం ఉండాలి. మీరు మీ పిల్లల కోసం ఎలా సమయం కేటాయిస్తున్నారో అతను కూడా అలాగే పిల్లలతో గడిపేలా చేయాలి. ఇందుకోసం ప్రశాంత వాతావరణంలో అతను వారితో హోంవర్క్‌ చేయించడం, ఆడుకోవడం చేస్తుండాలి. అలాగే వారు చేసే చిన్న చిన్న పనులను ప్రశంసించాలి. ఇలా చేయడం వల్ల మీ భర్త కోపంలో ఉన్న సమయాన్ని కూడా వారు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మిగతా సమయాల్లో అతనంటే భయపడకుండా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇది కాకుండా అసలు మీ భర్తకు కోపం ఎందుకు వస్తోందో తెలుసుకోవడం కూడా  ఎంతో అవసరం. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కోపం వస్తోందా? లేదంటే స్వతహాగానే అతనిలో కోపం ఎక్కువ? అన్న విషయాలను తెలుసుకోండి. మీ భర్త వ్యాపారం చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది చేసే పనిలో ప్రతిరోజూ ఏదో ఒక టెన్షన్‌ ఉంటుంది. అందువల్ల అలా ప్రవర్తిస్తున్నాడా? అనేది గమనించండి. అలాకాకుండా ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కోపం వస్తుంటే తగిన చికిత్సను అందించడం ద్వారా అతని కోపాన్ని నియంత్రించవచ్చు. ఒకవేళ స్వతహాగా లేదా పని ఒత్తిళ్ల వల్ల కోపం వస్తుందనుకుంటే సైకాలజిస్ట్‌/సైకియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్లడం మంచిది. వారు పరీక్షించి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ వంటి పద్ధతుల ద్వారా కోపాన్ని అదుపులో పెట్టుకునే (Anger Management) సలహాలు/చికిత్స అందిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని