మొదటి త్రీడీ ప్రింట్‌ రాకెట్‌ మాదే!

అగ్నిబాణ్‌... తాజాగా శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి.. ప్రపంచంలోనే త్రీడీ ప్రింట్‌ పద్ధతిలో తయారైన మొట్టమొదటి రాకెట్‌ ఇది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చునీ, సమయాన్నీ గణనీయంగా తగ్గించేందుకు నాంది పలికిన ఈ ప్రయోగంలో ఇద్దరు అమ్మాయిలు కీలకంగా ఉన్నారు.

Published : 13 Jun 2024 02:56 IST

అగ్నిబాణ్‌... తాజాగా శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి.. ప్రపంచంలోనే త్రీడీ ప్రింట్‌ పద్ధతిలో తయారైన మొట్టమొదటి రాకెట్‌ ఇది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చునీ, సమయాన్నీ గణనీయంగా తగ్గించేందుకు నాంది పలికిన ఈ ప్రయోగంలో ఇద్దరు అమ్మాయిలు కీలకంగా ఉన్నారు. వారే ఉమామహేశ్వరి, శరణీయ పెరియస్వామి...

త్రీడీ ప్రింటింగ్‌తో... వైద్యం, నిర్మాణం, ఫ్యాషన్‌ ఇలా అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఈ టెక్నాలజీని వాడి అంతరిక్ష ప్రయోగాల్లోనూ అద్భుతాలు చేయాలనుకుంది తమిళనాడుకు చెందిన అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ. ఐఐటీ మద్రాస్‌ మార్గదర్శకంలో అభివృద్ధి చెందిన ఈ సంస్థ తాజాగా త్రీడీ పద్ధతిలో అగ్నిబాణ్‌ రాకెట్‌ను తయారుచేసి, శ్రీహరికోట నుంచి గతనెల 30న విజయవంతంగా ప్రయోగించింది. చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘సంప్రదాయ రాకెట్లతో పోల్చితే ఈ 3డీ-ముద్రిత రాకెట్లతో అనేక ప్రయోజనాలున్నాయి.

మామూలు పద్ధతుల్లో ఒక రాకెట్‌ని తయారుచేయడానికి పన్నెండు వారాలు పడితే, ఈ విధానంలో 75 గంటల్లో పూర్తిచేయొచ్చు. మొత్తం మీద 60శాతం తయారీ సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది. ఇందులో సెమీక్రయోజెనిక్‌ ఇంజిన్‌ని ఉపయోగించాం. ఈ విధానంలో బరువైన హైడ్రోజన్‌ స్థానంలో... ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌ని వాడాం. అలాగే విడిభాగాల సంఖ్యా తగ్గింది. ఇలా రాకెట్‌లో ఆదా అయిన స్థలంలో పేలోడ్‌ పరిమాణం పెంచుకోవచ్చు. మా రాకెట్‌ 30 నుంచి 300 కిలోల వరకూ పేలోడ్‌ని మోసుకెళ్లగలదు’ అని వివరించారు ఉమామహేశ్వరి. ప్రపంచంలోనే మొదటి త్రీడీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ రాకెట్‌ ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఎన్నో అవాంతరాలని ఎదుర్కొన్నారీమె. ఉమామహేశ్వరి మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోనాటిక్స్‌లో బీటెక్‌ చదివారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌)తోపాటు మరికొన్ని సంస్థల్లో శిక్షణ పొందారు. ‘ఫలితం గురించి ఆలోచించకుండా సర్వశక్తులూ ఒడ్డి చేయాల్సివచ్చింది. పనిలో 100 శాతం కచ్చితత్వం ఉంటే తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయలేం. అలాగే టీమ్‌వర్క్‌లో ఏచిన్న లోపం ఉన్నా ప్రయోగం విజయవంతం కాదు. ఇంతచేసినా వాతావరణం అనుకూలించక రాకెట్‌ ప్రయోగాన్ని నాలుగుసార్లు వాయిదా వేశాం. ఎట్టకేలకు ఐదోసారి విజయం సాధించాం. 700 కి.మీ. ప్రయాణించి నిర్ణీత లక్ష్యానికి చేరుకుందని తెలియగానే చాలా సంతోషించా. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో ప్రయోగమూ చేయాలనుకుంటున్నాం’ అన్నారు ఉమామహేశ్వరి.

అక్కడ ఫోన్‌ సదుపాయం కూడా లేదు...

పోర్ట్‌బ్లెయిర్‌కు చెందిన శరణీయ ఈ ప్రాజెక్ట్‌కి వెహికల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన శరణీయ ఆ తర్వాత చెన్నై వెళ్లారు. ఐఐటీ-మద్రాసులో ఓషన్‌ టెక్నాలజీలో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ఆమెకి అంతరిక్ష రంగంలో అంతవరకూ అనుభవం లేకున్నా, తన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలతో అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థలో సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా కెరియర్‌ని మొదలుపెట్టారు.

‘పరిమిత వనరులు, బడ్జెట్‌. సమయమూ తక్కువే ఉండేది. ఇదో సవాలే మాకు. రాకెట్‌ ఆలోచన నుంచి దాని విడిభాగాల తయారీ, రూపకల్పన ఒకెత్తయితే దీన్ని శ్రీహరికోట వరకూ జాగ్రత్తగా తరలించడమూ సవాలే. అక్కడ ఫోన్లు ఉండవు. కొన్ని లాప్‌టాప్‌ల సాయంతో మాత్రమే పనిచేయాలి. అప్పటికే అనేకసార్లు వాయిదాలు వేయటంతో ఆరోజు బాగా టెన్షన్‌ పడ్డాం. మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రాకెట్‌ లక్ష్యాన్ని చేరుకుందని తెలిసిన తర్వాతే సక్సెస్‌ని ఎంజాయ్‌ చేశా’ అంటారు శరణీయ. ఇస్రోలో మహిళలు సాధించిన విజయాల స్ఫూర్తితో నవతరం అమ్మాయిలు ఇలా అంతరిక్ష ప్రయోగాల వైపు ఆసక్తి చూపించడం, ప్రయోగాలు చేయడం సంతోషించదగ్గ విషయమే కదూ!

 దేవేంద్రరెడ్డి కల్లిపూడి, శ్రీహరికోట

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్