Mangoes: అతిగా తింటే ఈ సమస్యలు తప్పవట!

మామిడి పండ్లు.. ఎన్ని తిన్నా తనివి తీరదు. ఎంతో రుచిగా ఉన్నాయనో, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయనో.. ఇలా కారణమేదైనా కొంతమంది మరీ ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే వీటిని మితిమీరి తిన్నా.. పలు రకాల అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. సౌందర్యపరంగానూ.....

Published : 26 May 2022 18:37 IST

మామిడి పండ్లు.. ఎన్ని తిన్నా తనివి తీరదు. ఎంతో రుచిగా ఉన్నాయనో, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయనో.. ఇలా కారణమేదైనా కొంతమంది మరీ ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే వీటిని మితిమీరి తిన్నా.. పలు రకాల అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. సౌందర్యపరంగానూ నష్టమేనంటున్నారు. మరి, ఇంతకీ రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలి? ఎక్కువగా తింటే ఏమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!

రెండుకు మించి వద్దు!

అతి ఏదైనా అనర్థదాయకమే! అంటుంటారు. మామిడి పండ్ల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అటు రుచికి రుచి, ఇటు లెక్కలేనన్ని పోషకాలు కలగలిసిన ఈ పండ్లను తినడం మొదలుపెట్టామంటే ఇక చాలనే దాకా వదిలిపెట్టం. అయితే రోజుకు రెండు మామిడి పండ్లను మించకుండా తినడం మంచిదంటున్నారు నిపుణులు. సాధారణ సైజులో ఉన్నవైతే 2-3 తినచ్చంటున్నారు. ఇక ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్న వారు రెండు మూడు ముక్కలకు మించి తినకపోవడమే మంచిది. తద్వారా సమస్య అదుపులో ఉంటుంది.. పండు తిన్నామన్న సంతృప్తీ దక్కుతుంది.

ఎక్కువ తింటే ఏమవుతుంది?

రోజుకు రెండు లేదా మూడు మామిడి పండ్లకు మించి తినడం వల్ల ఆరోగ్యపరంగా పలు సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

* మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయి. తద్వారా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

* ఈ పండ్లలో ఉండే చక్కెరలు సహజసిద్ధమైనవే అయినా.. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రిఫైన్డ్‌ షుగర్‌ మాదిరిగా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా భవిష్యత్తులో మధుమేహం సమస్య బారిన పడే ప్రమాదం ఎక్కువని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.

* కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. అందుకు కారణం.. వాటిలోని కొన్ని రకాల ప్రొటీన్లే. మామిడి పండ్లలో ఉండే ప్రొటీన్లూ ఇలాంటి ప్రతికూల ప్రభావమే చూపుతాయట! కాబట్టి ఫుడ్‌ అలర్జీ ఉన్న వారు ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై అలర్జీ, దద్దుర్లు.. వంటి సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్యను కోరి కొని తెచ్చుకోవడం కంటే మోతాదులో పండ్లను తీసుకోవడం.. ముందు ఒకటి లేదా రెండు ముక్కలు ప్రయత్నించి చూడడం మంచిది.

* మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు అవుతాయంటున్నారు నిపుణులు. ఇందుకు వాటిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థమే కారణమని చెబుతున్నారు.

* మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. ఇది చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, వేడి కురుపులు.. వంటి సమస్యలు తలెత్తుతాయి.

* చాలామంది ఈ పండ్లను రాత్రుళ్లు భోజనం చేశాక తీసుకుంటుంటారు. అయితే దీనివల్ల ఇందులోని పీచు పదార్థం త్వరగా జీర్ణం కాదు. తద్వారా అజీర్తి, గ్యాస్ట్రిక్‌.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి అల్పాహారం, లంచ్‌ తర్వాత, సాయంత్రం స్నాక్‌గా.. తీసుకుంటే ప్రతికూల ప్రభావం ఉండదు.

అందుకే ఈ సమస్యలన్నీ రాకుండా.. మామిడిపండ్ల సీజన్‌ను ఎంజాయ్‌ చేయాలంటే నిపుణులు చెప్పినట్లుగా మోతాదులోనే వీటిని తినడం ఉత్తమం. అలాగే వీటివల్ల ఇతర ప్రతికూల ప్రభావాలేవైనా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్