Published : 04/02/2022 17:22 IST

ఈ ‘ప్యాడ్ ఉమన్‌’ కథ విన్నారా?

(Photo: Twitter)

తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్‌కిన్లను తయారుచేసే మెషీన్‌ని రూపొందించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ అరుణాచలం మురుగనాథమ్‌ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన స్ఫూర్తితోనే గ్రామీణ మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కంకణం కట్టుకుంది మధ్యప్రదేశ్‌కు చెందిన మాయా విశ్వకర్మ. అమెరికాలో అద్భుతమైన కెరీర్‌ని కాదని.. స్వదేశానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో మాతృభూమిపై అడుగుపెట్టిన ఆమె.. తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్‌కిన్లను తయారుచేసి పేద మహిళలకు అందిస్తోంది. ఇందుకోసం ఓ ఫ్యాక్టరీనే నెలకొల్పి మరెంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. నాటి తన స్వీయానుభవమే నేడు తనను ప్యాడ్‌ ఉమన్‌గా ఎదిగేలా చేసిందంటోన్న మాయ సక్సెస్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

మధ్యప్రదేశ్‌లోని మెహ్రగావ్‌ అనే గ్రామంలో పుట్టిపెరిగింది మాయా విశ్వకర్మ. ఆమె తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రమే అయినా.. ఇవి తన కూతురు ఆశయాలకు అడ్డుపడకూడదని నిర్ణయించుకున్నారు వారు. ఆమె ఇష్ట ప్రకారమే బడికి పంపించారు. మాయ కూడా వాళ్ల కష్టాన్ని వమ్ము చేయకుండా చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా రాణించేది.

సేవ కోసం తిరిగొచ్చింది!

స్థానికంగా పాఠశాల విద్యను పూర్తి చేసిన మాయ.. పైచదువుల కోసం జబల్‌పూర్‌ వెళ్లింది. అక్కడి ఓ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో మాస్టర్స్‌ పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు దిల్లీ ఎయిమ్స్‌లో పరిశోధనలు కొనసాగించిన ఆమె.. లుకేమియా అధ్యయనంలో భాగంగా అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ‘రసాయన, జీవ ఇంజినీరింగ్‌’లో పీహెచ్‌డీ చేసింది. అయితే మాయకు చిన్నవయసు నుంచే ఓ కోరిక ఉంది. అదేంటంటే.. తన వంతుగా ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలని! ఈ ఆలోచనతోనే అమెరికాలో తన ముందున్న బంగారు భవిష్యత్తును కాదని.. భారత్‌కు తిరిగొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్ని పరిగణనలోకి తీసుకొని.. అక్కడి పరిస్థితులు, కనీస అవసరాలపై అధ్యయనం సాగించింది. అక్కడి ప్రజలకు చదువు ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలోనే తన అనుభవాలను రంగరించి డాక్యుమెంటరీలు, పుస్తకాలు సైతం రాసింది. ఇలా తన కృషికి గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు అవార్డులు, రివార్డులు అందుకుంది మాయ.

గుడ్డ వాడమంది!

అయితే ఇలా ఆయా గ్రామాలపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే అక్కడి మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, శ్యానిటరీ న్యాప్‌కిన్ల వినియోగం గురించి బొత్తిగా అవగాహన లేదని గ్రహించింది మాయ. మరీ ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, అమ్మాయిలు నెలసరి సమయంలో పాతకాలపు పద్ధతుల్ని అనుసరించడం వల్ల పలు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని గ్రహించిందామె. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే 2017లో తన స్వగ్రామం మెహ్రగావ్‌లో సుకర్మ ఫౌండేషన్‌ని స్థాపించింది మాయ.

‘సుకర్మ ఫౌండేషన్‌కు బీజం పడడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి - చిన్నతనంలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవం. రెండోది - ప్యాడ్‌మ్యాన్‌ అరుణాచలం మురుగనాథం స్ఫూర్తి. నేను పుష్పవతి అయినప్పుడు మా బంధువు ఒకామె.. గుడ్డ వాడమని నాకు సలహా ఇచ్చింది. అయితే దాంతో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. అంతెందుకు ఆ తర్వాత చాలా ఏళ్ల దాకా నాకు శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఉంటాయన్న సంగతి కూడా తెలియదు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఉండే ఎంతోమంది మహిళలు ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నెలసరిని కళంకంగా భావిస్తూ లేనిపోని మూఢనమ్మకాల్ని అనుసరిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్ని మార్చాలనే ఈ సంస్థను స్థాపించా. ఈ క్రమంలో తమిళనాడు ప్యాడ్‌మ్యాన్‌ అరుణాచలం మురుగనాథమ్‌ను కూడా కలిశా. తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేసే స్టార్టప్‌ల గురించీ అధ్యయనం చేశా..’ అంటూ చెప్పుకొచ్చింది మాయ.

ప్యాడ్లతో పాటు అవగాహన కూడా!

అప్పటిదాకా తాను దాచుకున్న డబ్బుతో పాటు మరికొన్ని నిధులు సమీకరించి శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేసే మెషినరీని కొనుగోలు చేసిందామె. ‘నో టెన్షన్‌’ అనే బ్రాండ్‌ పేరుతో తక్కువ ధరకే ప్యాడ్లను రూపొందించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్కడి స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు.. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోతే ఎలాంటి అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా అక్కడి మహిళలు, అమ్మాయిల్లో అవగాహన పెంచుతోంది మాయ.

‘నాలుగేళ్ల క్రితం చిన్న ఫ్యాక్టరీగా ప్రారంభమైన మా సంస్థ ఇప్పుడు ఎంతోమంది మహిళల ఆరోగ్యానికి బాటలు వేస్తోంది.. అక్కడితో ఆగిపోకుండా గిరిజన మహిళలు, గ్రామాల్లో నివసించే ఆడవాళ్లు, బాలికల్లో నెలసరి పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, మూత్రవ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, సర్వైకల్‌ క్యాన్సర్‌, నెలసరి సమయంలో పాటించాల్సిన ఆరోగ్య ప్రమాణాలు.. వంటి వాటి గురించి వాళ్లకు అర్థమయ్యేలా చెబుతున్నాం. సరైన ఆరోగ్య సదుపాయాలు లేని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, టెలీమెడిసిన్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం.. ఇందులో భాగంగా అక్కడి మహిళలకు మమోగ్రఫీ, రొమ్ము పరీక్షలు.. వంటివి ఉచితంగా నిర్వహిస్తున్నాం..’ అంటూ తన సంస్థ అందిస్తోన్న సేవల గురించి చెప్పుకొచ్చారు మాయ.

ఇలా నెలసరి అపోహల్ని తొలగిస్తూ ఎంతోమంది మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచుతోన్న మాయను అక్కడి మహిళలు ‘ప్యాడ్‌ ఉమన్‌’, ‘ప్యాడ్‌ జీజీ’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

నెలసరిని శాపంగా భావించకుండా దీని గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడే పరిస్థితుల్లో, సమాజంలో మార్పు తీసుకురాగలం అంటోన్న ఈ ప్యాడ్‌ ఉమన్‌ కథ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అనడంలో సందేహం లేదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని