Published : 23/02/2022 20:53 IST

బొప్పాయితో ఫేషియల్ ఇలా..!

కళ్లు చెదిరే అందం సొంతం కావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి?? అందుకేగా తరచూ పార్లర్స్‌కు వెళ్లి ఫేషియల్స్ అవీ చేయించుకునేది అంటారా! నిజమే కానీ అవేవీ అవసరం లేకుండా బొప్పాయితో ఇంట్లోనే స్వయంగా మిమ్మల్ని మీరే అందంగా మెరిసిపోయేలా చేసుకోవచ్చంటే నమ్ముతారా? అదెలా అనేగా మీ సందేహం.. అది మేం చెబుతాం రండి..

'ఆహా..!' అనిపించే అందం సొంతం కావాలంటే పార్లర్‌కి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే పదార్థాలు లేదా పండ్లను ఉపయోగించి కూడా అందంగా మెరిసిపోవచ్చు. ఇందుకు చక్కటి ఉదాహరణే బొప్పాయితో చేసుకునే ఫేషియల్.
దీనికి కావాల్సినవి: బాగా ముగ్గిన/ పండిన బొప్పాయి.

తయారీ:

సహజంగానే బాగా పండిన బొప్పాయిని ఎంపిక చేసుకోవాలి. అంటే ప్రత్యేకంగా మిక్సీలో వేసి మెత్తగా చేయాల్సిన అవసరం లేకుండా పట్టుకుంటే మెత్తని ముద్దలా అయిపోయేంతగా ముగ్గాలి. అలాంటి బొప్పాయిని తీసుకుని తొక్క తీసేసి, మెత్తని ముద్దలా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

ఫేషియల్ చేసుకునే విధానం:

మనం పాత్రలో తీసుకున్న మెత్తని గుజ్జుతో గుండ్రంగా మర్దన చేస్తూ ముఖమంతా రాసుకోవాలి. ఇలా దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫలితం:

ఇలా చేయడం వల్ల గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ప్రకాశవంతమైన చర్మం మన సొంతమవుతుంది.

జాగ్రత్త:

ఇప్పుడు బయట లభ్యమవుతున్న బొప్పాయిల్లో చాలా వరకు కృత్రిమంగా పండినవే ఎక్కువ ఉంటున్నాయి. ఫేషియల్ కోసం ఎంచుకునే బొప్పాయి సహజంగా పండినదై ఉండాలి. సహజసిద్ధంగా పండినదైతే బొప్పాయిపై తొక్క కాస్త ఎరుపు రంగుకు దగ్గరగా ఉంటుంది. అలా కాకుండా ఆరెంజ్ కలర్‌లో ఉంటే అది కృత్రిమంగా పండిందని అర్థం. ఇలా కృత్రిమంగా పండిన పండుతో ఫేషియల్ చేసుకోవాలనుకుంటే పైన తొక్క తీసేసి లోపల ఎర్రగా ఉండే గుజ్జుతో మసాజ్ చేసుకోవాలి.

బొప్పాయితో ఇంట్లోనే సులువుగా ఎలా ఫేషియల్ చేసుకోవచ్చో తెలుసుకున్నారుగా.. ఈసారి మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.. చక్కటి ఫలితాలు పొందండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని