పిస్టల్ ఎక్కుపెట్టిన చేతులే చిప్స్‌ అమ్ముతున్నాయి!

దిల్‌రాజ్‌ కౌర్‌... ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె ఒకప్పుడు పేరుమోసిన పారా షూటర్‌. ప్రపంచ టోర్నీల్లో ఎయిర్ పిస్టల్ ఎక్కుపెట్టి పదుల సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. అద్భుత విజయాలతో అంతర్జాతీయ వేదికలపై మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఇలా తన ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం కటిక పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్లు అమ్ముతోంది.

Updated : 27 Jun 2021 13:42 IST

దిల్‌రాజ్‌ కౌర్‌... ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె ఒకప్పుడు పేరుమోసిన పారా షూటర్‌. ప్రపంచ టోర్నీల్లో ఎయిర్ పిస్టల్ ఎక్కుపెట్టి పదుల సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. అద్భుత విజయాలతో అంతర్జాతీయ వేదికలపై మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఇలా తన ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం కటిక పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్లు అమ్ముతోంది.

కడుపు నింపని పతకాలు!

28 పసిడి, 8 రజత, 3 కాంస్య పతకాలు.. భారతదేశం నుంచి ప్రపంచ టోర్నీల్లో పోటీపడ్డ అతి కొద్దిమంది పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్‌రాజ్‌ కౌర్‌ సాధించిన పతకాల జాబితా ఇది. దేశ ఘనతకు గుర్తింపుగా నిలుస్తోన్న ఈ పతకాలు ఆమెకు కనీసం కడుపు నింపుకోవడానికి కూడా ఉపయోగపడడం లేదు. 2004లో పారా షూటింగ్‌ గేమ్స్‌లోకి అడుగుపెట్టిన దిల్‌రాజ్‌.. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఓ దశలో దేశంలోని అత్యుత్తమ ఎయిర్ పిస్టల్ షూటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.

రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ..!

ఎయిర్ పిస్టల్‌తో పతకాల కోసం పోటీ పడిన దిల్‌రాజ్‌.. ప్రస్తుతం పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. 2015లో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్‌ గేమ్స్‌లో చివరిసారిగా భారత్‌ తరఫున పాల్గొన్న ఆమె ఆర్థిక ఇబ్బందులను డజన్ల కొద్దీ సాధించిన పతకాలు ఏ మాత్రం తీర్చలేకపోయాయి. ఉద్యోగం...ఆర్థిక సాయం అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా మిన్నకుండిపోయాయి. ఫలితంగా పిస్టల్ పట్టుకున్న చేతితోనే చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్లు అమ్మాల్సిన దీన స్థితి వచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని గాంధీ పార్కు సమీపంలో రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ దిల్‌రాజ్‌ జీవనం సాగిస్తోంది.

అమ్మ పెన్షన్‌తో లోన్లు తీరుస్తున్నాం!

‘కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ రెండేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. నా సోదరుడు కూడా ఇటీవల కన్ను మూశాడు. వారిద్దరినీ బతికించుకునేందుకు మేం ఎంతో ఖర్చుపెట్టాం. బ్యాంకు నుంచి లోన్లు కూడా తీసుకున్నాం. ప్రస్తుతం అమ్మకు వస్తున్న పెన్షన్‌ డబ్బులతో ఈ లోన్లు తీరుస్తున్నాం. దేశానికి పతకాలు తెచ్చిపెట్టినందుకు మా ఇంట్లో వెలుగు వస్తుందనుకున్నాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. దేశానికి అవసరమున్నప్పుడు నేను ముందుకు వచ్చాను. విజయాలు సాధించినప్పుడు చప్పట్లు కొట్టి మరీ అభినందించారు. కానీ నాకు కష్టమొచ్చినప్పుడు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం నేను, మా అమ్మతో కలిసి ఓ అద్దె గదిలో ఉంటున్నాను. ప్రతినెలా 20వ తేదీ తర్వాత చేతిలో చిల్లి గవ్వ ఉండడం లేదు. షూటింగ్‌లో నేను సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకుని నా అర్హతకు తగ్గ ఉద్యోగమివ్వాలని ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇలా రోడ్డు పక్కన చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్లు అమ్ముకుంటున్నాం. దేశంలో చాలామంది క్రీడాకారుల పరిస్థితి ఇలాగే ఉంది. వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’ అని కన్నీళ్లతో వేడుకుంటోందీ మాజీ షూటర్.

చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్లు విక్రయిస్తోన్న దిల్‌రాజ్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది నెటిజన్లు ఆమెను ఆదుకోవాలంటూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రధాని నరేంద్రమోదీ, సోనూసూద్‌, ఆనంద్‌ మహీంద్రా.. లాంటి ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్