అందుకే తను మా ‘జైపూర్ మహారాణి’!

‘అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు... సాధించాలన్న తపన ఉంటే చాలు...ఎన్ని అడ్డంకులైనా అధిగమించి విజయతీరాలకు చేరుకోవచ్చు..’ ఈ మాటలను అక్షర సత్యం చేస్తున్నారు మన భారతీయ క్రీడాకారిణులు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాల పంట పండిస్తూ మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేస్తున్నారు.

Updated : 27 Feb 2024 15:57 IST

‘అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు... సాధించాలన్న తపన ఉంటే చాలు... ఎన్ని అడ్డంకులైనా అధిగమించి విజయతీరాలకు చేరుకోవచ్చు..’ ఈ మాటలను అక్షర సత్యం చేస్తున్నారు మన భారతీయ క్రీడాకారిణులు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాల పంట పండిస్తూ మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేస్తున్నారు. మొదట భవీనా రజతంతో మెరవగా... తాజాగా మహిళా షూటర్‌ అవని లేఖరా బంగారు పతకాన్ని ముద్దాడి యావత్‌ భారతావనిని పులకింపజేసింది.

బంగారు పతకంతో పాటు ప్రపంచ రికార్డు!

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 19 ఏళ్ల అవని పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. విశ్వక్రీడల్లో మొదటిసారి పాల్గొంటున్న ఈ అమ్మాయి మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో ఏకంగా స్వర్ణం గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. అంతేకాదు.. పోటీలో భాగంగా మొత్తం 249.6 స్కోర్‌ సాధించి ప్రపంచ రికార్డును సమం చేసిందీ టీనేజ్‌ షూటర్.

రోడ్డు ప్రమాదంలో..

‘యాక్సిడెంట్‌ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు...ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం’ అని ఓ సినిమాలో చెప్పినట్లు 2012లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అవనికి తీరని విషాదం మిగిల్చింది. అప్పుడు జైపూర్‌లోని రెవెన్యూ అప్పిలేట్‌ అథారిటీలో పనిచేస్తున్న ఆమె తండ్రి ప్రవీణ్‌కి ధోలాపూర్‌కి బదిలీ అయ్యింది. దీంతో భార్య శ్వేత, కుమారుడు అర్ణవ్‌, అవనిని తీసుకుని కారులో ధోలాపూర్‌ బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో వారి కారు ప్రమాదానికి గురైంది. అవనితో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రధానంగా అవని వెన్నుపూస బాగా దెబ్బతినడంతో నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. దీంతో ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. అప్పుడు అవని వయసు కేవలం పదేళ్లు మాత్రమే. మూడేళ్ల పాటు సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లంటూ ఆగ్రా, అహ్మదాబాద్, జైపూర్‌, దిల్లీ, ముంబాయి నగరాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇక విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పాఠశాలకు వెళితే చేర్చుకోలేమని ఆమెను వెనక్కు పంపేశారు. వేరే మార్గం లేకపోవడంతో ఇంట్లోనే తండ్రి సహాయంతో చదువుకుంది. ఆ తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకుని చదువును కొనసాగించింది!

అభినవ్‌ను ఆదర్శంగా తీసుకుని!

తన వయసులోని వారందరూ సరదాగా ఆడలాడుకుంటుంటే...అవని మాత్రం చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఇది తనను మానసిక క్షోభకు గురి చేయకుండా ఉండడానికి తండ్రి ఆమెను ఆర్చరీ, షూటింగ్‌ పోటీలకు తీసుకెళ్లేవాడు. తనలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కొన్ని స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా చదవమనేవాడు. అలా అవని జీవితానికో గమ్యాన్ని చూపించిన పుస్తకమే ఒలింపియన్‌ అభినవ్‌ బింద్రా ఆత్మకథ ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ’.

అభినవ్‌ పుస్తకం చదివాక క్రమంగా షూటింగ్‌పై ఆసక్తి పెంచుకుంది అవని. అతడిలా ఆమె కూడా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని ముద్దాడాలనుకుంది. అందుకు తగ్గట్లే తండ్రి తనకు జైపూర్‌లోని జగత్‌పురా షూటింగ్‌ రేంజ్‌లో సభ్యత్వం ఇప్పించాడు. అలా 2015 నుంచి అరువు తెచ్చుకున్న రైఫిల్‌తో కోచ్‌ చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో 50 మీటర్లు, 10 మీటర్ల రైఫిల్‌ విభాగాల్లో శిక్షణ ప్రారంభించిందీ టీనేజ్‌ షూటర్‌. మొదట జాతీయ స్థాయి పారా షూటింగ్‌ పోటీల్లో సత్తా చాటింది. 2017 లో యూఏఈలో జరిగిన పారా షూటింగ్‌ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన మరో టోర్నీలోనూ వెండి పతకం గెల్చుకుంది. 2018లో మాజీ షూటర్‌ సుమా శిరూర్‌ దగ్గర చేరి మరింత రాటుదేలింది. 2019లో క్రొయేషియా వేదికగా జరిగిన పారా షూటింగ్‌ ప్రపంచకప్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. కరోనా కారణంగా గతేడాది నుంచి పెద్దగా పోటీల్లో పాల్గొనలేకపోయింది అవని. దీనికి తోడు ఆమె తీసుకోవాల్సిన కొన్ని ఫిజియోథెరపీ చికిత్సలు ఆలస్యమయ్యాయి. అయినా ఆటపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇంటి నుంచే సాధన చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో నేషనల్‌ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని ముద్దాడింది. తాజాగా పారాలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించి కోట్లాదిమంది క్రీడాభిమానుల కళ్లల్లో సంతోషాన్ని నింపింది.

ఆమె మా ‘జైపూర్‌ మహారాణి’!

అవని విజయంతో ఆమె కోచ్‌ సుమ తెగ సంబరపడిపోతోంది. ‘ముంబయిలో నా షూటింగ్‌ అకాడమీ మొదటి అంతస్తులో ఉండేది. నిధుల కొరతతో లిఫ్ట్‌ కూడా ఉండేది కాదు. దీంతో అకాడమీకి వచ్చిన మొదట్లో అవని చాలా ఇబ్బంది పడింది. అయితే ఆటలో ఆమె పట్టుదల, నిబద్ధత నాకే కాదు.. అక్కడ శిక్షణ తీసుకున్న మిగతా షూటర్లకు కూడా నచ్చేశాయి. అందుకే వీల్‌చైర్‌తో సహా ఆమెను అందరూ చేతులపై మోస్తూ అకాడమీలోకి తీసుకెళ్లేవారు. మేమందరం ఆమెను ‘జైపూర్‌ మహారాణి’ అని పిలుస్తుంటాం. అవని సాధించిన విజయాల్లో ఇది (పారాలింపిక్స్‌) మొదటి స్థానంలో ఉంటుంది. ఒత్తిడిని తట్టుకుంటూ ఆమె ఎంతో ఆత్మవిశ్వాసం కనబర్చింది. అందుకే బంగారు పతకంతో పాటు ప్రపంచ రికార్డును అందుకుంది’ అని చెప్పుకొచ్చింది.

వీటి పైనా ఆసక్తి!

షూటింగ్‌ సంగతి పక్కన పెడితే...అవనికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, మ్యూజిక్‌ అంటే ఎంతో ఆసక్తి. అందుకే కేంద్రీయ విద్యాలయలో చదువుకుంటున్నప్పుడు పలు సాంస్కృతిక ప్రదర్శన పోటీల్లో పాల్గొంది. వీటితో పాటు సినిమాలు చూడడం, బేకింగ్‌, పుస్తకాలు చదవడం, వీలున్నప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడపడం చేస్తుంటుందీ టీనేజ్‌ షూటర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్