నాన్న నుంచీ నేర్చుకుంటున్నారా?

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఈతరం దంపతుల్లో ఆడ, మగ అన్న తేడా లేకుండా ఇద్దరూ పిల్లల పెంపకంలో సమాన పాత్ర పోషిస్తున్నారు.

Published : 15 Jun 2024 21:17 IST

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఈతరం దంపతుల్లో ఆడ, మగ అన్న తేడా లేకుండా ఇద్దరూ పిల్లల పెంపకంలో సమాన పాత్ర పోషిస్తున్నారు. తండ్రులు చేసే పనులు తల్లులూ.. తల్లులు చేసే పనులు తండ్రులూ అలవోకగా చేసేస్తున్నారు. ఈ రకంగా- పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతో, సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

ఈ విధంగా తండ్రులూ పిల్లల పెంపకంలో చురుగ్గా పాలుపంచుకోవడం వల్ల- వివిధ అంశాలలో తెలివితేటలతో వ్యవహరించడం, భావోద్వేగాల నియంత్రణ, విలువలు ఒంట పట్టించుకోవడం.. మొదలైన విషయాల్లో చిన్నతనం నుంచే పిల్లలు మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రవర్తనపరంగా..

పిల్లలు చిన్నతనం నుంచి తండ్రితో సన్నిహితంగా పెరగడం వల్ల వారి ప్రవర్తనలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు.. రోజూ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఖాళీ సమయాల్లో పిల్లలతో ఆడుకునే క్రమంలో వారికి తండ్రి ప్రేమ, ఆప్యాయత పొందే అవకాశం ఉంటుంది. దీంతో రోజంతా నాన్నను మిస్సయ్యామన్న భావన వారిలో కలగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే తండ్రి పిల్లలతో ఆడుకునేటప్పుడు గెలవాలన్న స్ఫూర్తి, భావోద్వేగాల నియంత్రణ.. వంటివన్నీ పిల్లలకు అలవడే అవకాశం ఉంటుంది. ఫలితంగా పెద్దయ్యాక ఇలాంటి అంశాల్లో పిల్లలు కూడా తండ్రిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.

వెంట తీసుకెళితే..

చాలామంది పిల్లలు చిన్నతనంలో తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి తామూ వస్తామంటూ మారాం చేస్తుంటారు. అయితే అలాంటి సందర్భాలలో కొన్ని చోట్లకైనా పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల సమాజంలో తమ తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని పిల్లలు గ్రహించగలుగుతారు. దాన్నిబట్టి నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో వారికి కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత వరకు తమ వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే వీలైనప్పుడల్లా పిల్లల్ని తండ్రి సంరక్షణలో వదిలేయడం మంచిదే. ఫలితంగా వారి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది.

పెరిగే అవగాహన..

సాధారణంగా తండ్రితో కూతురికి అనుబంధం కాస్త ఎక్కువగానే ఉంటుంది! అయితే అమ్మాయిలు తండ్రులతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం వల్ల వారు ఎదుర్కొనే భావోద్వేగాలు, ఒత్తిళ్లు.. వంటివి దగ్గర్నుంచి గమనించే అవకాశం ఉంటుంది. దీంతో వారికి ఇలాంటి విషయాలపై అవగాహన పెరుగుతుంది. తద్వారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సులభంగా వాటిని అధిగమించగలుగుతారని.. దాంతో మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు.

మార్గదర్శకుడిగా..

తల్లి మాదిరిగానే తండ్రి పెంపకం వల్ల కూడా పిల్లలకు కష్టసుఖాలు, బరువు-బాధ్యతలు, ప్రేమానుబంధాలు.. మొదలైనవన్నీ చిన్నతనం నుంచే అలవడతాయి. ఎదుగుతున్న కొద్దీ వీటన్నింటిపై పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నప్పట్నుంచీ ఇలాంటి ఎన్నో విషయాలను తండ్రులను చూసి నేర్చుకోవడం వల్ల క్రమంగా తండ్రులే వారికి మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా కెరీర్‌లో, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. తద్వారా తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు సంపాదించుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్