Published : 19/06/2022 12:03 IST

అమ్మే కాదు.. నాన్న కూడా మార్గదర్శే!

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయితే పిల్లలు పుట్టినప్పట్నుంచీ.. పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపే వరకు తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతో, సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వివిధ అంశాలలో తెలివితేటలతో వ్యవహరించడం, భావోద్వేగాల నియంత్రణ, విలువలు ఒంట పట్టించుకోవడం.. మొదలైన విషయాల్లో చిన్నతనం నుంచే పిల్లలు మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర గురించి చర్చిద్దామా..

ప్రవర్తనపరంగా..

పిల్లలు చిన్నతనం నుంచి తండ్రి పర్యవేక్షణలో పెరగడం వల్ల వారి ప్రవర్తనలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు.. రోజూ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఖాళీ సమయాల్లో పిల్లలతో ఆడుకునే క్రమంలో వారికి తండ్రి ప్రేమ, ఆప్యాయత పొందే అవకాశం ఉంటుంది. దీంతో రోజంతా నాన్నను మిస్సయ్యామన్న భావన వారిలో కలగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే తండ్రి పిల్లలతో ఆడుకునేటప్పుడు పిల్లలే గెలవాలనే వారి ఆతృత, భావోద్వేగాల నియంత్రణ.. వంటివన్నీ పిల్లలకు అలవడే అవకాశం ఉంటుంది. ఫలితంగా పెద్దయ్యాక ఇలాంటి అంశాల్లో పిల్లలు కూడా తండ్రిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.

వెంట తీసుకెళితే..

చాలామంది పిల్లలు చిన్నతనంలో తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి తామూ వస్తామంటూ మారాం చేస్తుంటారు. అయితే అలాంటి సందర్భాలలో కొన్ని చోట్లకైనా పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల సమాజంలో తమ తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని పిల్లలు గ్రహించగలుగుతారు. దాన్ని బట్టి నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో వారికి కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత వరకు తమ వెంట తీసుకెళ్లడం మంచిది.

నేర్చుకుంటారు..

వీలైనప్పుడల్లా పిల్లల్ని తండ్రి సంరక్షణలో వదిలేయడం మంచిదే. ఫలితంగా వారి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు.. ఉదయం న్యూస్‌పేపర్ చదివేటప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏ వార్తలొచ్చాయో వారికి చెప్పడం, సాంకేతికతకు సంబంధించిన విషయాలు చర్చించడం, కొత్త కొత్త పదాలు చెబుతూ వారితో పలికించడం.. వంటివి చేయడం వల్ల పిల్లలు నాన్న నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు. అలాగే ఆఫీసు పనుల్లో తండ్రులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, టెన్షన్ల.. గురించి కూడా పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దయ్యాక అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా వారు ముందు నుంచే అలవరచుకొంటారు.

పెరిగే అవగాహన..

సాధారణంగా తండ్రితో కూతురికి అనుబంధం కాస్త ఎక్కువగానే ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే అమ్మాయిలు తండ్రులతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం వల్ల వారు ఎదుర్కొనే భావోద్వేగాలు, ఒత్తిళ్లు.. వంటివి దగ్గర్నుంచి గమనించే అవకాశం ఉంటుంది. దీంతో వారికి ఇలాంటి విషయాలపై అవగాహన పెరుగుతుంది. తద్వారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సులభంగా వాటిని ఎదుర్కొంటారని.. దాంతో మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు.

మార్గదర్శకుడిగా..

తల్లి మాదిరిగానే తండ్రి పెంపకం వల్ల కూడా పిల్లలకు కష్టసుఖాలు, బరువు-బాధ్యతలు, ప్రేమానుబంధాలు.. మొదలైనవన్నీ చిన్నతనం నుంచే అలవడతాయి. ఎదుగుతున్న కొద్దీ వీటన్నింటిపై పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నప్పట్నుంచీ ఇలాంటి ఎన్నో విషయాలను తండ్రులను చూసి నేర్చుకోవడం వల్ల క్రమంగా తండ్రులే వారికి మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా కెరీర్‌లో, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. తద్వారా తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు సంపాదించుకుంటారు. దీనికంతటికీ మూలకారణం ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు ముందు నుంచీ నడిపించిన తండ్రే!

చూశారుగా.. పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఎంత కీలకమైందో. చిన్నతనం నుంచే పిల్లలు తండ్రి ప్రవర్తనను ఒడిసి పట్టుకొని, తననే మార్గదర్శకుడిగా ఎంచుకొని, భవిష్యత్తులో తాము ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం తమ తండ్రే అని గొప్పగా చెప్పుకుంటుంటే.. ఓ తండ్రిగా అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంటుంది చెప్పండి.. అందుకే మీ భర్త కూడా మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకునే విధంగా వారిని ప్రోత్సహించండి. అన్ని రకాలుగా అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని