చిన్నారి బాధ్యత ఎవరిది?

అందాకా చదువూ ఉద్యోగం తప్ప ఇంటి పనులు తెలీని అమ్మాయికి మూడు ముళ్లూ పడ్డాయంటే చెంగు దోపి గరిట పట్టక తప్పదు! హమ్మయ్య.. ఎలాగోలా వంట నేర్చుకున్నాను అనుకునే లోపు తల్లయిపోతుంది.

Published : 20 Jan 2023 00:59 IST

అందాకా చదువూ ఉద్యోగం తప్ప ఇంటి పనులు తెలీని అమ్మాయికి మూడు ముళ్లూ పడ్డాయంటే చెంగు దోపి గరిట పట్టక తప్పదు! హమ్మయ్య.. ఎలాగోలా వంట నేర్చుకున్నాను అనుకునే లోపు తల్లయిపోతుంది. పండంటి బిడ్డను చూసి మురిసిపోయే మాట నిజమే అయినా అనుక్షణం సంరక్షణ, డైపర్లు మార్చడం లాంటి పనులతో సతమతమైపోతుంది. సాయం చేయని భాగస్వామిని చూస్తే మరింత అసహనం కలిగి ‘అన్నీ నేనే చూడాలా, నీకేం బాధ్యత లేదా?’ అంటూ చిరాకుపడుతుంది. ఈ నేపథ్యంలో నిపుణులేమంటున్నారంటే..

* ఈ తరం అబ్బాయిలు పిల్లల పెంపకంలో భార్యకు సాయం చేస్తున్న మాట నిజమే. కానీ బోస్టన్‌ కాలేజ్‌ సెంటర్‌ ఫర్‌ వర్క్‌ అండ్‌ ఫ్యామిలీ పరిశోధనలో 30 శాతం భర్తలు మాత్రమే ఇలా భార్యకు చేయూతనిస్తున్నట్టుగా తేలింది.

* చంటిపిల్లలంటే.. పాలు పట్టడం, తడిపిన వస్త్రాలు మార్చడమే కాదు. అర్ధరాత్రి గుక్క పడితే సంబాళించుకోవాలి. రాత్రి నిద్ర కరవైనా ఆఫీసులో అప్రమత్తంగా ఉండాలి. తరచూ వచ్చే జలుబూ, జ్వరం, అజీర్తి లాంటి అనారోగ్యాలకు కంగారుపడకుండా పరిష్కారమేంటో తెలుసుకోవాలి. అప్పుడప్పుడే తల్లి పాత్రలో అడుగుపెట్టిన యువతికి ఇవన్నీ మోయలేని బాధ్యతలౌతాయి. ఆధునిక సాంకేతికతను, సాధనాలను ఉపయోగించుకుంటే పెంపకం సులువవుతుంది.

* చిన్నారి పెంపకం అనేది గురుతర బాధ్యత. కలిగే అసౌకర్యాల గురించి ఇద్దరూ చర్చించుకుంటే ఏం చేయాలో బోధ పడుతుంది, ఆందోళన ఉండదు.

* ఒకరు స్నానం చేయిస్తే రెండోవారు దుస్తులు తొడగటం తరహాలో పనులు పంచుకుంటే ఒకరికే ఒత్తిడి ఉండదు, అనుబంధమూ బలపడుతుంది.

* నిర్దేశించుకున్న పనులు వారే చేయాలనే పంతాలూ పట్టింపులూ వద్దు. ఆఫీసు పని ఒత్తిడి, అనారోగ్యం లాంటి మినహాయింపులు తప్పవు కదా!

* క్రమశిక్షణ అవసరమే కానీ ప్రేమ అంతకంటే ముఖ్యమని మర్చిపోవద్దు. పిల్లలకు నేర్పించే అంశాల గురించి భాగస్వామితో గొడవకు దిగొద్దు. ఇద్దరి ఆలోచనలూ వేరుగా ఉన్నప్పుడు శాంతంగా చర్చించి ఒక నిర్ణయానికి రండి.

పరస్పర గౌరవం ఉన్నప్పుడు పనులు సాఫీగా సాగిపోతాయి. భాగస్వామి అచ్చం మీలాగే చేయాలని ఘర్షణ వద్దు. నష్టం కలిగిస్తుంది అనుకుంటే తప్ప ఎవరి పద్ధతి వారికుంటుందని అర్థం చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్