చిన్నారుల సంరక్షణలో...

వర్షాకాలం వచ్చిందంటే చాలు. రమణి కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఆసుపత్రి, చికిత్సతో స్కూల్‌కు ఎక్కువ సెలవులు పెట్టి, చదువులో వెనకబడతాడు. పక్కింటి సుమ కూతురిపై మాత్రం సీజన్‌ ప్రభావం పడదు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.

Published : 10 Jul 2024 01:49 IST

వర్షాకాలం వచ్చిందంటే చాలు. రమణి కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఆసుపత్రి, చికిత్సతో స్కూల్‌కు ఎక్కువ సెలవులు పెట్టి, చదువులో వెనకబడతాడు. పక్కింటి సుమ కూతురిపై మాత్రం సీజన్‌ ప్రభావం పడదు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది. ఆయా సీజన్లకు తగినట్లు పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను దాటొచ్చు అంటున్నారు నిపుణులు.

ఈ సీజన్‌లో వాతావరణం చెమ్మగా ఉండటంవల్ల బ్యాక్టీరియా ఎక్కువగా ప్రబలుతుంది. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉండటంవల్ల తరచూ జలుబూ, జ్వరాల బారిన పడుతుంటారు. స్కూల్, బయటనుంచి ఇంటికి వచ్చినప్పుడు లేదా ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోమని చెప్పాలి. పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి పిల్లల్లో అవగాహన కలిగిస్తే చాలు. ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా నిరోధించవచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లో ఉండటానికి బోర్‌ కొడుతోందనకుండా ఇండోర్‌ గేమ్స్‌ ఆడించాలి. చిన్నచిన్న పజిల్స్‌ పూర్తిచేయడం నేర్పాలి. అందరూ కలిసి కూర్చుని పుస్తకపఠనం చేస్తే, పెద్దవాళ్లతో పిల్లలకు అనుబంధం పెరుగుతుంది. ఇది వారిని మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొడిగా... చిన్నారుల దుస్తులు చెమ్మగా లేకుండా జాగ్రత్తపడాలి. బయటికెళ్లేటప్పుడు వాటర్‌ప్రూఫ్‌ జాకెట్స్, గొడుగు లేదా రెయిన్‌కోట్‌ వంటివి ఉపయోగించడం నేర్పాలి. ఇంటికొచ్చిన వెంటనే పొడి దుస్తులు ధరించమని చెప్పాలి. పిల్లల బూట్లు కూడా వాటర్‌ప్రూఫ్‌గా ఉంటే మంచిది. తడిసిన సాక్సులతో ఎక్కువసేపు ఉండనివ్వొద్దు. చెమ్మతో పాదాలకు అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు పాదాలు పొడిగా ఉండేలా చూడాలి.

పోషకాలతో... తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటివి పిల్లలకు అందించాలి. నిల్వ పదార్థాలు, చల్లనివి కాకుండా తాజాగా వండి వేడివేడిగా తినిపించాలి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కూరగాయలతో చేసే సూప్స్, ఓట్స్‌ వంటకాలు వంటివీ పిల్లల్లో జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

తగినంత నీరు... ఈ సీజన్‌లో నీటిద్వారా ఎక్కువ అనారోగ్యాలు పిల్లలను పలకరిస్తుంటాయి. ఈ కాలం కాచి చల్లార్చిన నీటిని తాగించడం మంచిది. అలాగే దోమలబెడద ఎక్కువగా ఉండే కాలమిది. వీటి ద్వారా మలేరియా వంటి అనారోగ్యాలు దరిచేరతాయి. ఇంటి కిటికీలకు మెష్‌ల ఏర్పాటు మంచిది. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి. గదుల్లో తడి దుస్తులు ఉంచకూడదు. పిల్లల గది పొడిగా ఉండేలా జాగ్రత్తపడితే చాలు. వర్షాకాలంలోనూ చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్