Sibling Rivalry: పిల్లల మధ్య సయోధ్య కుదర్చాలంటే..!

తోబుట్టువులు ప్రతి విషయంలో పోటీపడడం, తగువులాడుకోవడం, ఆపై కలిసిపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే! అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలే తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు....

Published : 21 May 2023 10:15 IST

తోబుట్టువులు ప్రతి విషయంలో పోటీపడడం, తగువులాడుకోవడం, ఆపై కలిసిపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే! అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలే తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే ఈ క్రమంలో తల్లిదండ్రులు కలుగజేసుకొని వాళ్ల మధ్య సయోధ్య కుదిర్చితే తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేయచ్చని చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

పోల్చొద్దు!

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చదువు, వారి ఆహారపుటలవాట్లు.. ఇలా ప్రతి విషయంలో ఒకరితో ఒకరిని పోల్చడం చాలామంది తల్లిదండ్రులకు అలవాటు. అయితే నిజానికి ఈ పోలిక వారి మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒకరిని ప్రశంసించడం, మరొకరిని విమర్శించడం వల్ల వారి చిన్ని మనసులపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ఒకరంటే మరొకరికి అసూయాద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి తోబుట్టువులిద్దరినీ ప్రతి విషయంలో ఒకేలా మార్గనిర్దేశనం చేయడం, ఒకవేళ ఒకరు ఏ విషయంలోనైనా వెనకబడిపోయినా వారిని చిన్నబుచ్చకుండా వెన్నుతట్టడం, వారిలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రోత్సహించడం.. వంటివి చేస్తే ఇద్దరి మనసూ నొచ్చుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంట్లో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణమే తోబుట్టువుల మధ్య అన్యోన్యతను మరింతగా పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.

సాయపడితే తప్పేంటి?!

తోబుట్టువులు అప్పుడప్పుడూ గొడవపడ్డా.. కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు సహాయపడడం, హోమ్‌వర్క్‌/ఏదైనా సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తి చేసే విషయంలో కలగజేసుకోవడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చూసి కొంతమంది పేరెంట్స్‌.. ‘నీ హోమ్‌వర్క్‌ పక్కన పెట్టి తమ్ముడికి సహాయం చేస్తున్నావా? నువ్వే వాడిని చెడగొడుతున్నావ్‌?’ అంటూ కేకలేస్తుంటారు. దీనివల్ల ‘నాకెందుకులే’ అనే ధోరణి ఇద్దరి మనసుల్లో నాటుకుపోతుంది. ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయపడేతత్వం క్రమంగా సన్నగిల్లుతుంది. రాన్రానూ ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి అది చదువు విషయంలోనైనా లేదంటే ఇతర పనుల్లో అయినా ఒకరికొకరు సహాయపడేలా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారి మధ్య ఉన్న దూరం తరిగి అనుబంధం దృఢమవుతుందంటున్నారు.

కాస్త ఫన్‌ జోడిస్తే!

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢమవ్వాలంటే అందరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో.. తోబుట్టువుల మధ్య చెలిమి పెరగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీతో పాటే పిల్లల్నీ భాగం చేయడం, వీలు చిక్కినప్పుడల్లా అందరూ కలిసి బయటికి వెళ్లడం, కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి వారి మనసులోని ఆలోచనల్ని పంచుకునే అవకాశమివ్వడం.. ఇలాంటివి చేయడం వల్ల ఒకరినొకరు మిస్సవుతున్నామన్న భావన ఏ ఒక్కరి మనసులోనూ కలగదు. అలాగే ఈ క్రమంలో తోబుట్టువులు జట్టుగా కలిసి ఆడే ఆటల (ఉదాహరణకు.. క్యారమ్స్‌, బ్యాడ్మింటన్‌ వంటి ఆటల్లో వాళ్లిద్దరూ ఒక జట్టుగా ఉండి తల్లిదండ్రులు మరో జట్టుగా ఉండచ్చు) వల్ల కూడా వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని, చక్కటి అన్యోన్యతను పెంపొందించచ్చంటున్నారు నిపుణులు.

వారి ముందు శిక్షించద్దు!

పిల్లలన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేయడం సహజం. అలాగే చదువు విషయంలోనూ తోబుట్టువులిద్దరూ ఒకేలా రాణించాలని లేదు. అలాంటప్పుడు ఆయా విషయాల్లో వెనకబడడం, తెలిసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు చేసే పిల్లల్ని తల్లిదండ్రులు మందలించడం సహజమే! అయితే అది కూడా తన తోబుట్టువుల ముందు కాకుండా చాటుగా చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే తమ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల ముందు వారిని చిన్నబుచ్చితే వారు బాధపడడంతో పాటు అవతలి వారికి వీళ్లను విమర్శించే అవకాశం మీకు మీరే కల్పించినట్లవుతుంది. ఇదీ తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసేదే! కాబట్టి వారిలోని లోపాలైనా, పొరపాట్లైనా చాటుగా, ఓపిగ్గా సరిదిద్దడం.. ఏదైనా మంచి పని చేసినా, చదువులో రాణించినా.. తమ తోబుట్టువుల ముందు ప్రశంసిస్తూ.. వీళ్లను మార్గదర్శకంగా తీసుకోవాలని వారికి సున్నితంగా చెప్పడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ల మధ్య అనవసర పోటీని దూరం చేసి అన్యోన్యతను పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్