Published : 26/12/2022 20:29 IST

కెరీర్ విషయంలో ఇలా సహాయపడండి..!

పాఠశాల దశలో విద్యార్థులను ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్‌?’ అని అడిగితే డాక్టర్, ఇంజినీర్, లాయర్‌, టీచర్.. ఇలా ఏదో ఒకటి చెబుతారు. కానీ, వారి వయసు పెరిగే కొద్దీ వారి అభిరుచులు కూడా మారుతుంటాయి. కానీ, చాలామంది విద్యార్థులు వారి ముందున్న ఆప్షన్స్‌లో ఏది ఎంచుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా పిల్లల కెరీర్‌లో ఎలా సహాయపడాలో తెలుసుకుందాం రండి...

ఆసక్తిని గమనించండి...

వివిధ కారణాల వల్ల కొంతమంది తమ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. వాటిని తమ పిల్లలు సాధించాలని తపన పడుతుంటారు. దాంతో, అనుకోకుండానే పిల్లలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి, పిల్లలు తమ లక్ష్యాలను ఎంచుకునే క్రమంలో మీ వ్యక్తిగత ఆసక్తులు, ఒత్తిడి వారిపై పడకుండా సూచనలివ్వండి. స్కూల్‌ దశ నుండే వారు ఏయే అంశాలపై మక్కువ చూపుతున్నారో గమనించండి. ప్రముఖుల పుస్తకాలను చదివేలా ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కెరీర్‌పై ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దానిని బట్టి కెరీర్ విషయంలో నిర్ణయం తీసుకోవడం వారికి సులభమవుతుంది.

అవగాహన పెంచుకోవడం కోసం..

నేటి యువతలో చాలామంది ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుని కొన్ని రోజుల తర్వాత మరో రంగంలోకి మారుతుంటారు. దీనికి కారణం మొదట వాళ్లు ఎంచుకున్న రంగంపై ప్రాక్టికల్‌గా అవగాహన లేకపోవడమే. కాబట్టి, వారు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఏమైనా పార్ట్‌ టైం ఉద్యోగాలు ఉన్నాయేమో శోధించమని పిల్లలకు చెప్పండి. అలాగే కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌టైం జాబ్‌ ఏది చేసినా చదువుకుంటూనే ఎంచుకున్న కెరీర్‌పై పట్టు సాధించవచ్చు. వీటికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి. అందుకే ఈ దిశగా కూడా ప్రయత్నించమని పిల్లలకు సూచించాలి.

అభిరుచే ముఖ్యం...

మనం ఏదైనా కెరీర్‌ ఎంచుకున్నామంటే అందులో జీతం, సంతృప్తి, ఉద్యోగ భద్రత.. ఇలాంటివి ఎన్నో పరిశీలిస్తాం. అయితే ఈ పద్ధతి అన్ని రంగాల్లో సాధ్యపడదు. కొన్ని సందర్భాల్లో ఎంచుకున్న కెరీర్‌ మంచిదైనా ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి, కెరీర్‌ విషయంలో పిల్లల అభిరుచిని మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. అలాగే కెరీర్‌ ఎంచుకోవడానికి వారికి వీలైనంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో వారు నేర్చుకునే ప్రతీ అంశం ఒక అనుభవంగా ఉంటుంది. ఏది ఏమైనా అంతిమ నిర్ణయాన్ని పిల్లలకే వదిలేయండి. ఒకవేళ మీకు నచ్చని కెరీర్‌ని వారు ఎంచుకున్నా.. మీరు అందించే ప్రోత్సాహాన్ని మాత్రం తక్కువ చేయకండి.

ఆ ప్రోగ్రామ్స్‌కి పంపించండి..

ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు తరచుగా కెరీర్‌ ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకు ఎంతో సమాచారం ఒక వేదిక పైనే తెలుస్తుంది. కెరీర్‌కు సంబంధించి వివిధ రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి రంగాలు ముందంజలో ఉంటాయి? అనే విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడికి మీ పిల్లలను తీసుకెళ్లండి. కొంతమంది ఆన్‌లైన్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా కూడా మీకు కావాల్సిన సలహాలు తీసుకోవచ్చు.

ఈ క్రమంలో- ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పిల్లలు కెరీర్ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతుంటే మాత్రం- నిపుణుల సలహా తీసుకోండి. వివిధ రకాల పరీక్షల ద్వారా పిల్లలకు ఎలాంటి అంశాల పట్ల అభిరుచి, ప్రావీణ్యం ఉన్నాయో వారు శాస్త్రీయంగా కనుక్కునే ప్రయత్నం చేస్తారు. తద్వారా నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని