Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
ఈ రోజుల్లో దేశానికి సేవ చేయడం కోసం చాలామంది యువతులు సైతం ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల్లో చేరి తమ కలను సాకారం చేసుకుంటున్నారు.
(Photos: Twitter)
ఈ రోజుల్లో దేశానికి సేవ చేయడం కోసం చాలామంది యువతులు సైతం ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల్లో చేరి తమ కలను సాకారం చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు త్రివిధ దళాల్లో ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా దేశానికి సేవ చేస్తున్నారు. ఇందులో హరియాణాకు చెందిన డాక్టర్ పాయల్ ఛబ్రా మొదటి వరుసలో ఉంటుంది. డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె త్వరలో పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళాల్లో చేరబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె.. ప్రత్యేక భద్రతా దళాల్లో చేరనున్న మొదటి మహిళా ఆర్మీ సర్జన్‌గా ఘనత సాధించింది.
దేశానికి సేవ చేయాలని..!
పాయల్ ఛబ్రా స్వస్థలం హరియాణాలోని జింద్ జిల్లా. ఆమె ఎంబీబీఎస్‌తో పాటు మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్) పట్టా కూడా అందుకుంది. చదువు పూర్తైన తర్వాత హరియాణాలోని కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసింది. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలనే ఆశయం ఉంది. ఈ మక్కువతోనే 2021లో అంబాలా కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో కెప్టెన్‌గా చేరింది. ఆ తర్వాత లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేసింది. ప్రస్తుతం అదే ఆస్పత్రిలో స్పెషలిస్ట్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తోందామె. ఈ క్రమంలోనే ఆమె మేజర్‌గా ప్రమోషన్ కూడా పొందింది. అయితే పాయల్ పారా మిలిటరీ బృందంతో కలిసి పనిచేయాలనుకుంది. ఇందుకోసం ఒకవైపు సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. తాజాగా విజయవంతంగా ఈ శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె మెరూన్ బెరెట్ (ప్రత్యేక దళాలు అధికారిక శిరస్త్రాణంగా ధరించే మెరూన్ రంగు క్యాప్)నూ సంపాదించింది. తద్వారా పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళాల్లో చేరనున్న మొదటి మహిళా ఆర్మీ సర్జన్‌గా ఘనత సాధించింది.
తన కోరిక తీరింది!
పాయల్‌కు దేశానికి సేవ చేయాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందని ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశం కోసం పని చేయాలనే కోరిక పాయల్‌లో బలంగా ఉంది. ఇందుకోసం దేశ విదేశాల నుంచి ఎన్నో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఉద్యోగావకాశాలు సైతం తిరస్కరించింది. ఇప్పుడు ఆమె కోరక నెరవేరింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
కఠిన శిక్షణ తీసుకొని..
పారా మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్‌లో చేరాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దీని గురించి పాయల్ మాట్లాడుతూ.. ‘పారా మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్‌లో చేరాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇందుకు కఠిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేదాన్ని. కమాండో ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 40 కిలోమీటర్లు పరిగెత్తేదాన్ని. ఇవన్నీ చేయడంతో పాటు 20 నుంచి 65 కేజీల బరువులు కూడా ఎత్తాను..’ అంటూ తన శిక్షణ గురించి చెబుతోంది పాయల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.