Working Women: ఖాతా ఖాళీ అయిపోతోంటే..
చదువు పూర్తికాకముందే ప్రాంగణ నియామకాల్లో కార్పొరేట్ కొలువులు కొట్టేస్తున్న వారెందరో. జీరో అనుభవంతో మంచి జీతాలూ అందుకుంటున్నారు. తీరా నెలాఖరికి వచ్చేసరికి ‘అకౌంట్‌లో డబ్బులే మిగలట్లేద’ని వాపోయే అమ్మాయిలే ఎక్కువ.
చదువు పూర్తికాకముందే ప్రాంగణ నియామకాల్లో కార్పొరేట్ కొలువులు కొట్టేస్తున్న వారెందరో. జీరో అనుభవంతో మంచి జీతాలూ అందుకుంటున్నారు. తీరా నెలాఖరికి వచ్చేసరికి ‘అకౌంట్‌లో డబ్బులే మిగలట్లేద’ని వాపోయే అమ్మాయిలే ఎక్కువ. అలా జరగొద్దంటే ఈ సూచనలు పాటించమంటున్నారు నిపుణులు..
* ‘ఎందులో డిస్కౌంట్లు తక్కువ?’ కొనుగోళ్లు ఏవైనా అమ్మాయిలు వెదికే అంశమిది. ఒక్కోసారి యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్లూ మనసునటు మళ్లిస్తుంటాయి. అందుకే ఎక్కువగా వాడే యాప్‌లు తప్ప మిగతావన్నీ తీసేయండి. నోటిఫికేషన్లనూ ఆఫ్ చేస్తే అనవసర కొనుగోళ్లు తగ్గుతాయి.
* ఖర్చులన్నీ పోయాక దాయడం చాలా మందికి అలవాటు. ఈసారి నుంచి పొదుపు తర్వాతే ఖర్చులకు కేటాయించుకోండి. అలాగని నామమాత్రం పక్కన పెట్టేరు! కనీసం పాతిక, ముప్పై శాతం దాయండి. మిగిలిన దాన్ని సొంత వినియోగానికి కేటాయించుకోండి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయీ లెక్క రాసుకోండి. దీంతో ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ రెండూ అలవడతాయి.
* ఒకటి కొనాలనుకుంటాం! ఆన్‌లైన్ అయినా.. షాపులోకి అడుగుపెట్టినా మిగతా వాటివైపు ఆకర్షితులమై కొంటూ వెళ్లిపోతాం. ఇక ఖాతా ఖాళీకాక ఏమవుతుంది? కొనాలనుకున్నవి ముందే పేపరు మీద రాసుకోండి. సమయం తీసుకున్నా పర్లేదు కానీ ఆ జాబితా దాటి కొనొద్దు. ఏదైనా కొనాలనిపించినా తక్కువకు వస్తోందని కాక నిజంగా అవసరమేనా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటే ఖర్చు పెరగదు.
* ఒత్తిడితో ఎక్కువ తినేస్తున్నారని వినుంటాం కదా! బోర్ కొట్టినా, బాధనిపించినా కూడా మన అమ్మాయిలు షాపింగ్ వైపే చూస్తున్నారంటున్నాయి అధ్యయనాలు. దీనిపైనా ఓ కన్నేసి ఉంచండి. బయటికి వెళ్లాల్సొస్తే డబ్బు రూపేణా తీసుకెళ్లండి. కార్డులు ఇంట్లోనే ఉంచేయండి. పేమెంట్ యాప్‌లనూ ఉపయోగించొద్దు. స్నేహితులు, బంధువులకు తోడుగా షాపింగ్‌కి వెళ్లినా ఇదే సూత్రం పాటించాలి. ఏదైనా నచ్చితే కొన్ని సార్లు కొనుక్కోండి, పర్లేదు. అయితే ఆ నెలలో ఇంకేం అనవసర ఖర్చులూ లేవని రూఢీ చేసుకున్నాకే ఆ పని చేయాలి. కొనే ప్రతిదానికీ అవసరం, సందర్భం.. ఈ రెంటినీ గమనించుకుంటే డబ్బులు మిగలడం మీరే చూస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.