Micro Wedding: పెళ్లి ఖర్చు తక్కువ.. ప్రత్యేకతలు ఎక్కువ!

కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరతరాలు గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారు ఈ కాలపు జంటలు. ఈ ఆలోచనతోనే తమ పెళ్లి వేడుకలు ఎంత వైభవంగా ఉండాలో అన్న ఆలోచనను పక్కన పెట్టి.. ఎంత ప్రత్యేకంగా ఉండాలో అన్న దానికే ప్రాధాన్యమిస్తున్నారు.

Published : 26 Aug 2023 12:29 IST

కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరతరాలు గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారు ఈ కాలపు జంటలు. ఈ ఆలోచనతోనే తమ పెళ్లి వేడుకలు ఎంత వైభవంగా ఉండాలో అన్న ఆలోచనను పక్కన పెట్టి.. ఎంత ప్రత్యేకంగా ఉండాలో అన్న దానికే ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి తోడు ఖర్చూ తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి వారికి మైక్రో వెడ్డింగ్‌ ట్రెండ్‌ సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో, అందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా జరుపుకొనే వివాహ వేడుక ఇది! పెళ్లి వేదిక దగ్గర్నుంచి, విందు భోజనాలు ముగిసే దాకా.. తమ పెళ్లి తమకు మధురానుభూతులు పంచుతూనే.. అతిథులకూ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలంటే.. మైక్రో వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేసుకునే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

థీమ్‌ డిసైడయ్యారా?

కొన్ని జంటలు సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. తమ వివాహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనతోనే తమ వివాహం కోసం ఏదో ఒక థీమ్‌ను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఒకరు వింటేజ్‌ థీమ్‌ను ఎంచుకుంటే.. మరొకరు బీచ్‌ స్టైల్‌ కోరుకుంటున్నారు.. ఇంకొందరు కలర్‌ కోడ్‌ ఫాలో అవుతున్నారు. ఉదాహరణకు.. వింటేజ్‌ థీమ్‌ను తీసుకుంటే.. పెళ్లి వేదిక అలంకరణ దగ్గర్నుంచి వధూవరులు, అతిథుల డ్రస్సింగ్‌; విందు కోసం ఎంచుకునే వంటకాలు.. ఇలా ప్రతిదీ పాత కాలపు పద్ధతుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక కలర్‌ కోడ్‌ను ఇష్టపడే వారు.. వేదిక అలంకరణ, డ్రస్సింగ్‌.. తదితర విషయాల్లో అందరూ ఒకేలా కనిపించేలా జాగ్రత్తపడాలి. నిజానికి మీ పెళ్లి సింపుల్‌గా జరిగినా.. ఇలాంటి థీమ్‌ ఒకటి జత చేశారంటే.. మీ పెళ్లి అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా అతిథుల మనసుల్లో గుర్తుండిపోతుంది.

50కి మించకుండా..!

పెళ్లి ఎంత వైభవంగా జరిగిందన్న విషయం పక్కన పెడితే.. ఆ పెళ్లికి ఎంత మంది అతిథులొచ్చారన్న విషయాన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే వారు లేకపోలేదు. అయితే మైక్రో వెడ్డింగ్‌ ఇందుకు పూర్తి భిన్నం! ఎందుకంటే సింపుల్‌గా ఉండే ఈ తరహా పెళ్లిళ్లలో అతిథుల సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోమంటున్నారు నిపుణులు. వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఇరువురి స్నేహితులు.. ఇలా మొత్తంగా 50 లేదా గరిష్టంగా 75 మందికి మించకుండా ఉండేలా ప్లాన్‌ చేసుకోమంటున్నారు. ఈ మధ్య పలువురు సెలబ్రిటీలూ అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఒక్కటవడం చూస్తున్నాం. అలాగని వాళ్లు డబ్బు ఖర్చు పెట్టలేక కాదు.. తమ వివాహ వేడుక అనుభూతులు.. తమ మధ్య, తమ సన్నిహితుల మధ్య ఉంటే చాలన్న ఆలోచనతోనే ఇలాంటి సింపుల్‌ వెడ్డింగ్స్‌ ఎంచుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. ఇక ఇలాంటి వివాహాలతో ఇటు ఖర్చూ కలిసొస్తుంది.. అటు మీ పెళ్లికి సంబంధించిన మధురానుభూతులు మీ మధ్యే ఉండిపోతాయి.

దుస్తుల ట్రెండూ మారుతోంది!

పెళ్లంటే పట్టు చీరలు, నగలు.. ఇలా భారీగా ముస్తాబైన వధూవరులను చూడ్డానికి రెండూ కళ్లూ చాలవనుకోండి. అయితే మోడ్రన్‌ జంటలు కాస్త కొత్తగా ఆలోచిస్తున్నాయి. పట్టు కంటే ఫ్యాన్సీ దుస్తులు, పేస్టల్‌ కలర్స్‌, సింపుల్‌ నగలు ధరించడానికే ఆసక్తి చూపుతున్నారు. మైక్రో వెడ్డింగ్‌ను ఎంచుకునే జంటలకు ఈ సింప్లిసిటీ చక్కగా నప్పుతుందంటున్నారు నిపుణులు. ఈ మధ్య కొందరు సెలబ్రిటీ జంటలు కూడా భారీగా ఉండే దుస్తులు, నగలు కాకుండా.. తేలికపాటి అటైర్‌, ఓ నెక్‌ పీస్‌ ధరించి ఆకట్టుకోవడం మనం చూశాం. ఇలా వాళ్ల పెళ్లి దుస్తుల్ని ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడుకోవడమూ మనకు గుర్తే! మరి, మీ పెళ్లి అలంకరణ కూడా ఇలా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలవాలంటే మీరూ వాళ్లలా సింప్లిసిటీని ఫాలో అయిపోవడమే!

రిటర్న్‌ గిఫ్ట్‌లిస్తున్నారా?

పెళ్లిలో అతిథులు వధూవరులకు బహుమతులివ్వడం సహజం. అయితే కొందరు తమ పెళ్లికొచ్చిన అతిథులకూ రిటర్న్‌ గిఫ్ట్‌లివ్వాలనుకుంటారు. అతి కొద్ది మంది అతిథుల్ని ఆహ్వానించి పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు ఈ రిటర్న్‌ గిఫ్టింగ్‌ పద్ధతిని పాటిస్తే.. మీ కోరికా నెరవేరుతుంది.. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పనీ ఉండదు. ఇక ఈ బహుమతుల్లోనూ పూల మొక్కలు/ఇండోర్‌ ప్లాంట్స్‌; డ్రైఫ్రూట్‌ గిఫ్ట్‌ హ్యాంపర్స్‌; ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్స్‌; వెదురుతో ప్రత్యేకంగా తయారుచేయించిన కస్టమైజ్‌డ్‌ ల్యాంప్స్‌.. ఇలా మీకు నచ్చిన బహుమతులతో అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని