ఈమె పోరు ప్లాస్టిక్‌పై...

ప్లాస్టిక్‌ భూతం ప్రపంచం మొత్తాన్నీ భయపెడుతోంది. పాలిథిన్‌ కవర్లతో భూమి, గాలి, జలం కలుషితమవుతుందని పర్యావరణ వేత్తలు ...

Updated : 14 Dec 2022 11:24 IST

ప్లాస్టిక్‌ భూతం ప్రపంచం మొత్తాన్నీ భయపెడుతోంది. పాలిథిన్‌ కవర్లతో భూమి, గాలి, జలం కలుషితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించాలంటే ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని నిషేధించాలంటే ముందు దాంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నారు శ్వేత. ప్రతి గ్రామంలో వారం రోజుల పాటు ‘కళాజాతర’ కార్యక్రమాలతో చైతన్య సదస్సులు నిర్వహించారు. సాంస్కృతిక సారథి కళా బృందాల ద్వారా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలతో పాటు, ప్రతి పాఠశాలలో ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించే తీరుతెన్నులను తెలియజేశారు. ఈ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేశారు. వారు నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులు, బంధువులకు వివరించేలా మార్గదర్శకం చేశారు. ఇంతటితో ఆగిపోకుండా జిల్లాలోని 120 పాఠశాలల్లో విద్యార్థులతో కాగితపు సంచులను తయారు చేసే బృహత్తర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. వనపర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో లక్ష వరకు సంచులను పంపిణీ చేయించారు. పాలిథిఫఫన్‌ కవర్లకు బదులుగా వీటిని వాడాలని విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాలోని స్వయం సహాయక మహిళా బృందాలతో వస్త్రాలతో సంచులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. రూపాయి నుంచి రూ.50 విలువ చేసేలా వివిధ ఆకృతుల్లో వీటిని తయారు చేయిస్తూ, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిస్తున్నారు.

ప్రతి బుధవారం పర్యవేక్షణ: గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ వినియోగం తీరు తెన్నులను తెలుసుకునేందుకు ఐదు గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రతి బుధవారం సదరు అధికారి గ్రామాల్లో పర్యటించి ప్లాస్టిక్‌ వినియోగంపై ఆరా తీస్తారు. ఇళ్లు, దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ కోసం స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తారు. ఇలా ఇప్పటి వరకు 12,500 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌కు చెందిన ‘హలో డస్ట్‌బిన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు.

ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం

-శ్వేతామహంతి, జిల్లా కలెక్టర్‌, వనపర్తి

నపర్తిని ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయి నుంచి చర్యలు చేపట్టాం. ప్రజల భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించాం. ప్లాస్టిక్‌ నిషేధం గురించి వ్యాపారులకు వివరిస్తే ఉపయోగం ఉండదు. కవర్లు కొనుగోలు చేసేవారికే దీనిపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని భావించి ముందుగా ప్రజలకు, విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. విద్యార్ధులతో కాగితం సంచులు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయించాం. ప్రజలంతా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులకు అలవాటు పడాలనే సంకల్పంతో ఈ ప్రయత్నం చేశాం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కడ పడేసినా ఏదో ఒక విధంగా కాలుష్యం ముప్పు ఉంటుంది. అందుకే వాటిని రీసైక్లింగ్‌కు పంపిస్తున్నాం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించే వరకు కార్యక్రమాలు కొనసాగిస్తాం.

- వెంకటేష్‌ గడ్డాల. ఈనాడు డిజిటల్‌, నాగర్‌కర్నూల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్