ఆ పిల్లల కోసం అదిరిపోయే ఐడియా.. పూజ ఏం చేసిందో చూడండి!

పాడైపోయిన వస్తువులు, తుక్కు సామాన్లు.. వీటితో ఇంట్లో చెత్త తప్ప మరే ప్రయోజనం లేదని మనమైతే బయటపడేస్తామేమో గానీ.. ఈ సృష్టిలో పుట్టిన ఏ వస్తువూ వృథా కాదంటోంది బెంగళూరుకు చెందిన పూజా రాయ్‌. పాతవి, పాడైన టైర్లు, కేబుల్‌ డ్రమ్స్‌.. వంటివేవైనా సరే.. బయటపడేసి పర్యావరణానికి హాని చేయకుండా తనకివ్వమంటోంది. వాటితో పిల్లలకు ఉపయోగపడేలా అందమైన, ఆకర్షణీయమైన ఆట వస్తువులు రూపొందిస్తూ తనలోని సృజనను చాటుకుంటోంది.

Published : 23 Jun 2021 15:36 IST

Photo: Instagram

పాడైపోయిన వస్తువులు, తుక్కు సామాన్లు.. వీటితో ఇంట్లో చెత్త తప్ప మరే ప్రయోజనం లేదని మనమైతే బయటపడేస్తామేమో గానీ.. ఈ సృష్టిలో పుట్టిన ఏ వస్తువూ వృథా కాదంటోంది బెంగళూరుకు చెందిన పూజా రాయ్‌. పాతవి, పాడైన టైర్లు, కేబుల్‌ డ్రమ్స్‌.. వంటివేవైనా సరే.. బయటపడేసి పర్యావరణానికి హాని చేయకుండా తనకివ్వమంటోంది. వాటితో పిల్లలకు ఉపయోగపడేలా అందమైన, ఆకర్షణీయమైన ఆట వస్తువులు రూపొందిస్తూ తనలోని సృజనను చాటుకుంటోంది. అంతేనా.. ఎంతోమంది పేద విద్యార్థులకు సురక్షితమైన, పర్యావరణహితమైన ఆటస్థలాలను చేరువ చేస్తోంది. ఇందుకోసం ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే ప్రారంభించిన ఆమె.. తన దృష్టిని ఇటువైపుగా ఎందుకు మళ్లించిందో తెలుసుకుందాం రండి..

తరగతి గదిలో నేర్చుకునే దానికంటే తోటి పిల్లలతో ఆడుకునే క్రమంలోనే చిన్నారులు ఎక్కువగా నేర్చుకుంటారనే సిద్ధాంతాన్ని తాను బలంగా నమ్ముతానంటోంది పూజా రాయ్‌. ఈ క్రమంలోనే వారిలో ఏకాగ్రత, విషయాన్ని గ్రహించే సామర్థ్యం పెరుగుతాయని చెబుతోంది. 2014లో తాను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో అక్కడి ఓ స్థానిక పాఠశాలలో వలంటీర్‌గా పనిచేసిన పూజ.. ఆ సమయంలో ఆ స్కూల్‌ విద్యార్థులు అనారోగ్యకరమైన వాతావరణంలో ఆడుకోవడం చూసి చలించిపోయింది. పైగా చాలా వరకు పాఠశాలల్లో సరైన ఆటస్థలాలు కూడా లేవన్న విషయం గ్రహించింది. ఈ పరిస్థితులే తనను ఆలోచనలో పడేశాయని, వాటి ప్రతిరూపమే ఈ ‘యాంథిల్‌ క్రియేషన్స్‌’ అని చెబుతోందామె. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిందామె.

ఆ స్కూల్‌తోనే మొదలు..!

తాను ఏ పాఠశాలలోనైతే వలంటీర్‌గా సేవలందించిందో తన ప్లేగ్రౌండ్‌ ఐడియాను అక్కడ్నుంచే మొదలుపెట్టానంటోంది పూజ. ‘నేను వలంటీర్‌గా పనిచేసిన పాఠశాలలోని విద్యార్థులు ఆడుకునే స్థలం అస్సలు పరిశుభ్రంగా లేదు.. ఇక వాళ్లు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఏళ్ల క్రితం నాటివి.. నాణ్యత లేనివి! ఎదిగే పిల్లలు ఇలాంటి వాతావరణంలో ఆడుకోవడం అస్సలు మంచిది కాదనిపించింది. అందుకే వాళ్ల కోసం ఓ చక్కటి ఆటస్థలాన్ని నిర్మించాలనుకున్నా. ఇందుకోసం మా ఫ్యాకల్టీ, ఫ్రెండ్స్ సహాయం తీసుకున్నా.. ఇక ఆ తర్వాత్తర్వాత పాడైపోయిన టైర్లు, కేబుల్‌ డ్రమ్స్‌.. వంటి తుక్కు సామగ్రితో తక్కువ ఖర్చుతోనే అందమైన, ఆకర్షణీయమైన ఆటస్థలాల్ని రూపొందించచ్చన్న ఆలోచన వచ్చింది. అయితే మేము రూపొందించిన మొదటి ప్లేగ్రౌండ్‌ చూశాక.. మాకూ ఇలాంటి ఆటస్థలమే కావాలంటూ దేశవ్యాప్తంగా పలు స్కూళ్లు, కమ్యూనిటీల దగ్గర్నుంచి చాలా వినతులు వచ్చాయి. నిజానికి పట్టణీకరణ కారణంగా పిల్లలకు పచ్చదనం, వాటి మధ్య ఆడుకునే వీల్లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని మార్చడమే ‘యాంథిల్ క్రియేషన్స్ ముఖ్యో్ద్దేశం’ అంటోంది పూజ.

నాలుగు రోజుల్లోనే..!

వినతులను బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే పిల్లల కోసం ఆటస్థలాల్ని నిర్మించి అందిస్తోంది పూజ. ఈ క్రమంలో తన టీమ్‌తో పాటు అక్కడి స్థానికుల సహాయం తీసుకుంటోంది. అలాగే స్థానికంగా లభించే తుక్కు టైర్లు, వ్యాపార సముదాయాల నుంచి సేకరించిన కేబుల్‌ డ్రమ్స్‌ వంటి వ్యర్థాలను ఉపయోగించి.. వాటికి విభిన్న రంగులద్ది.. వాటితో ఉయ్యాలలు, క్యాటర్పిల్లర్ టన్నెల్స్‌, జంగిల్‌ జిమ్స్‌, స్టెప్పర్స్‌, క్యూబ్‌ క్లైంబర్స్‌, జంతువుల డిజైన్లు, కార్లు.. వంటివి రూపొందిస్తోంది. ఇందుకోసం ముందుగా అక్కడి పిల్లల మనసుల్ని చదివి.. వారికేం కావాలో తెలుసుకుంటానంటోందీ యువ ఆంత్రప్రెన్యూర్.

‘ఓ ఆర్కిటెక్చర్‌ విద్యార్థినిగా తుక్కుతో, తక్కువ ఖర్చుతో ఆటస్థలాలను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది.. కానీ అందుకు ఎంతో మేధోమథనం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పిల్లల మానసిక నిపుణులు, డిజైన్‌ ప్రొఫెసర్స్‌ని కలిశాను.. ఎంతో అధ్యయనం చేశా. స్థానికంగా ఉండే చిన్నారుల అభిప్రాయాలను, వారి మనసులోని ఆలోచనల్ని కూడా తెలుసుకుంటున్నా. ఇలా వీటన్నింటినీ ఒకే చోట చేర్చి.. నాలోని సృజనాత్మకతను జోడించి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా ఆటస్థలాల్ని రూపొందిస్తున్నా. ఇలా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాల్లో సుమారు 300 ప్లేగ్రౌండ్స్‌ని నిర్మించా. ఇందుకోసం నేను ఉపయోగించే పాత టైర్లతో రెండు రకాలుగా మేలు జరుగుతుంది. ఒకటి- ఇవి పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు.. రెండోది- ఇవి సులువుగా వంగుతాయి కాబట్టి వీటితో పిల్లలకు నచ్చేలా విభిన్న డిజైన్లు రూపొందించి ఆటస్థలంలో అమర్చచ్చు.. అలాగే 11 వేలకు పైగా ‘ప్లే ఇన్‌ బాక్స్‌ కిట్స్‌’ని చిన్నారులకు పంపిణీ చేశా..’ అంటోందీ యువ ఆర్కిటెక్ట్.

ఇలా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరో చిన్నారులకు పర్యావరణహితమైన ప్లేగ్రౌండ్స్‌ని చేరువ చేసిన పూజ.. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ అవసరార్థుల కోసం తన స్వచ్ఛంద సంస్థ వేదికగా నిధులు సమీకరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్