Published : 30/12/2021 20:22 IST

Breaking Stereotypes: వాళ్లు కాదు.. మీ ఆలోచనలు మారాలి!

(Photos: Instagram, Screengrab)

ఏళ్లు గడుస్తోన్నా, దశాబ్దాలు దాటుతోన్నా.. ఈ సమాజం మహిళల్ని చూసే దృష్టి కోణంలో మాత్రం మార్పు రావట్లేదు. కారణం.. మహిళలంటే ఇలానే ఉండాలి.. ఈ పనులే చేయాలి.. అంటూ లేనిపోని మూఢనమ్మకాలు వాళ్లపై రుద్దుతూ వారి కాళ్లకు బంధనాలు వేయడమే! అలాంటి కొన్ని సమస్యల్ని, మహిళలపై నేటికీ ఉన్న అసమానతల్ని ఎత్తి చూపుతూ.. ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసేలా ఈ ఏడాది కొన్ని ప్రకటనలు రూపొందాయి. ఆడవారిని చూసే దృష్టి కోణంలో మార్పు వస్తేనే ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగుతాయంటూ చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. అలాంటి మంచి సందేశంతో రూపొంది ఈ ఏడాది పాపులర్‌ అయిన కొన్ని యాడ్స్‌పై ఓ లుక్కేద్దాం రండి..

అందానికి ప్రమాణాలెందుకు?!

అమ్మాయంటే తెల్లగా ఉండాలి.. నాజూగ్గా ఉండాలి.. అలా ఉన్న వారే అందంగా ఉన్నట్లు లెక్క! మిడిమిడి జ్ఞానంతో ఎవరో, ఏళ్ల క్రితం నిర్దేశించిన ఇలాంటి ప్రమాణాల్ని ఇంకా పాటిస్తున్నారు కొంతమంది. ఈ కొలతల్ని అందుకోకపోతే వాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇదిగో ఇలాంటి అనవసర ఆలోచనలకే కళ్లెం వేయమని చెప్పకనే చెబుతున్నారు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ. అందమంటే చూసే దృష్టి కోణంలోనే ఉంటుందని నమ్మే ఆయన.. అందుకు అనుగుణంగానే మోడల్స్‌ని ఎంపిక చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఆయన డిజైన్‌ చేసే పెళ్లి దుస్తుల ప్రకటనల కోసం లావుగా, చర్మ ఛాయ తక్కువగా ఉన్న అమ్మాయిల్ని ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. నిజానికి తన దుస్తుల్లో వాళ్లను మరింత అందంగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ.. అందానికి ప్రమాణాల్లేవన్న విషయం పదే పదే నిరూపిస్తుంటారాయన.

వైజాగ్‌ అమ్మాయి వర్షిత తటవర్తి, ఫరీదాబాద్‌కు చెందిన అపూర్వ రాంపాల్‌.. వంటి ప్లస్‌ సైజ్‌, డస్కీ మోడల్స్‌ ఈ ఏడాది సవ్యసాచి కలెక్షన్‌తో పాపులర్‌ అయిన వారే! అంతేకాదు.. మరో ఫ్యాషనర్‌ మసాబా గుప్తా కూడా సవ్యసాచి బ్రైడల్‌ కలెక్షన్‌లో మెరిసిపోయి చర్మ ఛాయపై ఈ సమాజంలో ఉన్న మూసధోరణుల్ని బద్దలుకొట్టే ప్రయత్నం చేసింది. ఇలా ఎందరో మోడల్స్ నిండైన ఆత్మవిశ్వాసంతో ఫొటోలకు పోజులిస్తూ ఆకట్టుకున్నారు.


అమ్మ కాకపోతే అసంపూర్ణమేనా?!

అమ్మతనమనేది మహిళల జీవితంలో ఓ భాగమే తప్ప.. అమ్మైతేనే జీవితం సంపూర్ణమవుతుందనడంలో అర్థం లేదంటోంది మరో ప్రకటన. ఎందుకంటే వివిధ కారణాలు/సమస్యల రీత్యా అమ్మతనానికి నోచుకోలేకపోతున్న మహిళలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ల సమస్యేంటో తెలుసుకోకుండా వారిని మాటలతో హింసించడం, విమర్శించడం తగదంటూ ఓ అర్థవంతమైన యాడ్‌తో ‘ప్రెగా న్యూస్‌’ ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ముందుకొచ్చింది. #SheIsCompleteInHerself హ్యాష్‌ట్యాగ్‌తో రూపొందించిన ఈ ప్రకటనలో భాగంగా..

‘లతిక అనే మహిళ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అన్నింట్లోనూ సక్సెసవుతుంది.. మరోవైపు పెద్ద కోడలిగా అత్తింటి వారి ఆదరణనూ చూరగొంటుంది. అయితే తనకున్నదల్లా ఒక్కటే లోటు.. ఎంత ప్రయత్నించినా గర్భం ధరించకపోవడం. తన కళ్ల ముందే తన తోటి కోడళ్లు, ఆడపడుచులు నెల తప్పడం, వారి సీమంతం జరగడం.. ఈ సంబరాలకు తాను నోచుకోలేకపోతున్నాననే బాధను దిగమింగుతూ ఆ వేడుకల్ని తనే దగ్గరుండి జరిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆమె బాధను గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు అండగా నిలుస్తారు.. వివిధ కారణాల రీత్యా సంతానానికి నోచుకోలేని వారిని మాటలతో, చేతలతో చిన్నబుచ్చకుండా ఉండాలనే సందేశంతో యాడ్‌ ముగుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ ప్రకటన ఇప్పటి వరకు కోటిన్నర వ్యూస్‌ సంపాదించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.


నెలసరి గురించి.. నాన్న చెప్తే..!

ఎదిగే అమ్మాయిలకు నెలసరి గురించి చెప్పడం అమ్మ పని అనుకుంటాం.. ఈ విషయం గురించి ఇంట్లో నాన్న, అన్నదమ్ములకు తెలియకుండా రహస్యంగా ఉంచుతాం.. కానీ యుక్తవయసులోకి ప్రవేశించే అమ్మాయిలు నెలసరి విశేషాలను నాన్న నుంచి తెలుసుకుంటే..? ఈ సరికొత్త ప్రయత్నమే చేసింది ‘స్టే ఫ్రీ’ శ్యానిటరీ న్యాప్‌కిన్ల సంస్థ. ‘Its Just a Period’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఏడాది డాటర్స్‌ డే (సెప్టెంబర్‌ 25) సందర్భంగా ఓ క్రియేటివ్‌ యాడ్‌ని రూపొందించింది. ఇందులో భాగంగా..
కొంతమంది బాలికలు, తమ తండ్రులతో కలిసి ఓ ఆడిషన్‌కి వస్తారు. అక్కడ వాళ్లకు ఓ స్క్రిప్ట్‌ ఇస్తారు. అందరి పేపర్లలో పిరియడ్స్‌కు సంబంధించిన అంశాలే ఉంటాయి. వాటిని చూడగానే తండ్రులు అవాక్కవుతారు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. అయితే అసలు నెలసరి అంటేనే తెలియని ఓ అమ్మాయి.. తన తండ్రిని చూసి ‘పిరియడ్స్‌.. అంటే ఏంటి?’ అని అడుగుతుంది. అందుకు ఆయన తడబడుతూనే సమాధానమిస్తాడు. అలా పోను పోను తండ్రులంతా తమ కూతుళ్లు అడిగే ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానమిస్తారు. నెలసరి గురించి బోలెడన్ని విషయాలు చెప్తూ వారిలో అవగాహన నింపుతారు. నిజానికి తండ్రులకు కూడా పిరియడ్స్‌ గురించి చాలా విషయాలు తెలిసుంటాయని, వాటిని తమ కూతుళ్లతో పంచుకోవడానికి మొహమాటపడకూడదని.. అప్పుడే నెలసరిపై ఈ సమాజంలో ఉన్న అపోహలు, మూసధోరణులు అంతం అవుతాయని చెప్పడమే ఈ ప్రకటన ముఖ్యోద్దేశం. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ ప్రకటనను ఇప్పటివరకు 72 లక్షల మందికి పైగా వీక్షించారు.


అవి లోపాలు కాదు.. ప్రత్యేకతలు!

ప్రేమ వివాహం మాటెలా ఉన్నా.. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లలో అమ్మాయిని ఇష్టపడాలంటే వారిని అణువణువూ పరిశీలిస్తుంటారు వరుడి తరఫు వారు. ఉదాహరణకు కర్లీ హెయిర్‌ ఉన్నా కష్టమే.. సిల్కీ హెయిర్‌ లేకపోయినా సమస్యే..! అందం, చర్మ ఛాయ, శరీరాకృతి, అబ్బాయికి సరిపడా ఎత్తుందా? లేదా?, ఇలా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అయితే లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సహజమేనని.. వాటిని ప్రతికూలతలుగా కాకుండా ప్రత్యేకతలుగా పరిగణించాలని చెబుతుంది ‘Dove’ ప్రకటన. #stopthebeautytest పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఈ యాడ్‌లో..

కొంతమంది అమ్మాయిలకు విడివిడిగా పెళ్లి చూపులు జరుగుతాయి. ఈ క్రమంలో వరుడి తరఫు వారు ఆ అమ్మాయి ఫెయిర్‌గా లేదని, అబ్బాయి కంటే తక్కువ ఎత్తు ఉందని, మా అన్నయ్యకు కర్లీ హెయిర్‌ ఉంటే నచ్చదని, ఇంత లావుగా ఉంటే ఎలా అని.. ఇలా వీటిని లోపాలుగా ఎత్తి చూపుతూ అమ్మాయిల్ని నిరాశకు గురి చేస్తుంటారు. అయితే ఎవరో అన్న మాటలకు బాధపడడం వృథా అని, నిజానికి ఈ లోపాలే మన ప్రత్యేకతలనే సందేశంతో ప్రకటన ముగుస్తుంది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ యాడ్‌ను మూడు కోట్ల మందికి పైగా వీక్షించారంటేనే ఇది ఈ తరం అమ్మాయిల్ని ఎంతలా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.


లెస్బియన్‌.. అయితే తప్పేంటి?!

స్వలింగ వివాహాల్ని ఇప్పటికే చాలా దేశాలు చట్టబద్ధం చేశాయి. మన దగ్గర కూడా ఇది నేరం కాదని సుప్రీం కోర్టు గతంలో తీర్పు వెలువరించినా.. ఇప్పటికీ సమాజంలో లెస్బియన్‌ జంటలపై వివక్ష అలాగే కొనసాగుతోంది. ఇలాంటి ప్రతికూల భావనను దూరం చేసేలా ఓ సరికొత్త ప్రకటనను రూపొందించింది డాబర్‌ సంస్థ. ఈ ఏడాది అక్టోబర్‌లో కర్వా చౌత్ పండగ నేపథ్యంలో తమ బ్యూటీ ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేస్తూనే.. తమ ప్రకటనతో అందరిలోనూ ఆలోచన రేకెత్తించింది.. ఇంతకీ యాడ్‌లో ఏముందంటే..!

ఓ లెస్బియన్‌ అమ్మాయిల జంట తమ తొలి కర్వా చౌత్‌ వేడుకలకు సిద్ధమవుతుంటుంది. ఇంతలోనే ఓ మహిళ వచ్చి వారికి కొత్త బట్టలు అందిస్తుంది. ఆ తర్వాత వాళ్లు వాటిని ధరించి.. డాబాపై వెన్నెల వెలుగుల్లో ఎదురెదురుగా నిలబడతారు. అందంగా అలంకరించిన జల్లెడలో ముందు చంద్రుడిని చూసి.. ఆ తర్వాత అదే జల్లెడలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఆహారం తినిపించుకుంటూ ఉపవాస దీక్ష విరమిస్తారు. నిజానికి ఈ ప్రకటన అటు లింగ సమానత్వాన్ని చాటుతూనే.. ఇటు స్వలింగ జంటల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు అద్దం పడుతోంది.

నిజానికి లెస్బియన్‌ జంటలపై ప్రకటనను రూపొందించడం మన దేశంలో ఇదే తొలిసారి! అయితే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ యాడ్‌ చక్కటి సామాజిక సందేశాన్ని చాటుతోందని కొంతమంది ప్రశంసిస్తే.. మరికొంతమందేమో హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు గుప్పించారు.

నిజానికి ఇలా ఎన్ని ప్రకటనలు రూపొందించినా, ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతున్నా.. ఇప్పటికీ కొన్ని అంశాల్లో మహిళల పట్ల మూసధోరణులు కొనసాగుతున్నాయనే చెప్పాలి. మరి, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలో మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు Contactus@vasundhara.net ద్వారా పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని