Updated : 15/06/2021 18:26 IST

కరోనా నుంచి కోలుకున్నాక సౌందర్య సంరక్షణ ఇలా!

కొవిడ్‌ను ఎదుర్కోవడం కంటే.. వైరస్‌ నుంచి బయటపడ్డాక రికవర్‌ అవడమే ఓ పెద్ద యుద్ధంలా అనిపిస్తోంది కొంతమందికి! ఈ క్రమంలో ఆరోగ్యపరంగానే కాదు.. అందం విషయంలోనూ కొంతమందిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే వైరస్‌ కలిగించిన దుష్ప్రభావాలకు తోడు కరోనా బారిన పడ్డాక ఎదురైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఈ సమస్యలకు కారణాలంటున్నారు నిపుణులు. అందుకే కొవిడ్‌ రికవరీ సమయంలో మానసికంగా దృఢంగా మారడంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే పూర్వపు అందాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వల్ల సౌందర్యపరంగా తలెత్తిన సమస్యలేంటి? వాటిని దూరం చేసుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..
రెండో దశలో కరోనా మహమ్మారి ఊపిరితిత్తుల పైనే కాదు.. ఇతర శరీర భాగాల పైనా ప్రభావం చూపిందని చెబుతున్నారు నిపుణులు. అతివలు ఎంతో అపురూపంగా చూసుకునే అందం విషయంలోనూ దీని ప్రభావం పడిందంటున్నారు. ఈ క్రమంలో కొంతమందిలో వైరస్‌ శరీరంలో ఉన్నప్పుడు పలు సమస్యలు ఎదురైతే.. కోలుకునే క్రమంలో మరిన్ని సమస్యలొస్తున్నాయని చెబుతున్నారు. అయితే దీనికి మానసిక సమస్యలు ఓ కారణమైతే.. అసలు కారణమేంటో కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారట శాస్త్రవేత్తలు!


ఎలాంటి సమస్యలొచ్చాయంటే..!
* వైరస్‌ శరీరంలోని శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతున్న కొద్దీ ఆక్సిజన్‌ స్థాయులు క్రమంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని ప్రభావం కారణంగా చర్మంపై అక్కడక్కడా వాపు, ఎర్రటి దద్దుర్లు, గోళ్లు రంగు మారడం.. వంటి లక్షణాలు కనిపించాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేని కొంతమందిలో సైతం ఇలాంటి చర్మ సమస్యలు కనిపించడం గమనించదగ్గ విషయం.
* కరోనా బాధితులకు అందించిన కొన్ని రకాల మందుల వల్ల కొంతమందిలో చర్మంపై ర్యాషెస్‌ (Urticaria) వచ్చాయని చెబుతున్నారు నిపుణులు. ఎర్రగా, దురదతో కూడిన ఈ దద్దుర్లు కొవిడ్‌ నుంచి కోలుకున్నా కొందరిలో దీర్ఘకాలం పాటు కొనసాగుతున్నాయని కొన్ని కేసుల్లో రుజువైందట!


* ఇక కరోనా నుంచి కోలుకున్న కొన్ని వారాల తర్వాత కొంతమంది బాధితుల్లో ‘కొవిడ్‌ టోస్‌ (Covid Toes)’ అనే కొత్త సమస్య తలెత్తు తోందట. కాలి మునివేళ్ల వద్ద ఎర్రటి వాపుతో కూడిన ఈ దద్దుర్లు నొప్పిని, అసౌకర్యాన్ని కలుగజేస్తాయట! 
* కరోనా నుంచి కోలుకునే క్రమంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్‌ కారణంగా చర్మం పొడిబారిపోవడం, పెదాలు పగలడం.. వంటి సమస్యలు కొంతమందిని వేధించాయట! ఇక ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయిన వారిలో చర్మం, పెదాలు నీలం రంగులోకి మారుతూ వైరస్‌ ప్రభావానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.
* కొవిడ్‌ నుంచి బయటపడ్డా రికవర్‌ అయ్యే క్రమంలో కొంతమందిలో జుట్టు బాగా రాలిపోతుండడం పెద్ద సమస్యగా మారిందంటున్నారు నిపుణులు. అయితే చక్కటి ఆహార నియమాలు, మానసిక ఆరోగ్యంతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు.

ఇలా దూరం చేసుకోవచ్చట!

అయితే కొవిడ్‌ కారణంగా ఎదురవుతోన్న ఈ సమస్యలు అందం విషయంలో అమ్మాయిలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నప్పటికీ.. వీటి విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిపుణుల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకుంటూ, కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. అవేంటంటే..!
* ఉదయం లేవగానే కాఫీ/టీలకు బదులుగా హెర్బల్‌ టీలను తాగడం వల్ల కొవిడ్‌ కారణంగా తలెత్తిన చర్మ సమస్యల్ని త్వరగా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో చామొమైల్‌, పెప్పర్‌మింట్‌, అల్లం టీలకు ప్రాధాన్యమివ్వమంటున్నారు.
* సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు మెండుగా ఉన్న పదార్థాల్ని రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఈ క్రమంలో చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఆకుకూరలు, టొమాటో, నట్స్‌, పప్పుధాన్యాలు, చేపలు, బీన్స్‌, బెర్రీస్‌, ఇతర సీజనల్‌ పండ్లు.. వంటివి ముఖ్యమైనవి.
* చర్మ సమస్యల్ని దూరం చేసి అందాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే ఫిజియోథెరపీ వ్యాయామాలు కూడా చేయచ్చు. అయితే అది కూడా మీ ఆరోగ్య స్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకున్నాకే చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.
* కరోనా బాధితుల్లో చాలామంది నిద్రలేమి సమస్యను సైతం ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా చర్మ ఆరోగ్యం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది.. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీంతో పాటు సుఖనిద్రకు ప్రేరేపించే చామొమైల్‌, లావెండర్‌, క్లారీ సేజ్‌, గంధపుచెక్క.. వంటి నూనెల్ని శరీరంపై అక్కడక్కడా పూసుకోవాలి.. అలాగే మీరు పెట్టుకునే తలగడపై కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే శరీరంపై పూసుకోవడానికి ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకుంటే ఏవైనా దుష్ప్రభావాలు ఎదురవుతాయో లేదో తెలిసిపోతుంది.
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభించే పసుపు పాలను రోజూ తాగడం చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తద్వారా చర్మంపై వచ్చిన వాపు, దద్దుర్లు తగ్గుముఖం పడతాయంటున్నారు నిపుణులు.
* ఇక పొడిబారిన చర్మాన్ని తిరిగి తేమగా, తాజాగా మార్చుకోవాలంటే హయల్యురోనిక్ ఆమ్లం కలిగిన మాయిశ్చరైజర్‌ని రోజూ రాసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.
* చర్మ ఆరోగ్యానికి ఇంటి చిట్కాలను సైతం పాటించచ్చు. అయితే మీ చర్మతత్వాన్ని బట్టి నిపుణుల సలహా తీసుకున్నాకే ఆయా ఫేస్‌ప్యాక్స్‌ని ఉపయోగించడం మంచిది.
* చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు జింక్‌, విటమిన్‌ ‘సి’.. వంటి సప్లిమెంట్స్‌ తీసుకోవడం తప్పనిసరి. అది కూడా నిపుణుల సలహా మేరకు ఎంత మోతాదులో తీసుకోవాలో అడిగి వాడడం అన్ని విధాలుగా శ్రేయస్కరం!

కొవిడ్‌ చికిత్స తీసుకునే క్రమంలో లేదంటే వైరస్‌ నుంచి కోలుకున్నాక.. వచ్చిన ఎలాంటి చర్మ సమస్యనైనా నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లడం మంచిదని గుర్తు పెట్టుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని