Pranitha: బుజ్జి బాపూ బొమ్మ వచ్చేసింది!

‘మాతృత్వంలోని మాధుర్యమేంటో అనుభవిస్తే గానీ అర్థం కాదు..’ అంటోంది బాపూ బొమ్మ ప్రణీత సుభాష్‌. ఈ ముద్దుగుమ్మ తాజాగా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన పాపను ఎత్తుకొని మురిసిపోతోన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.....

Published : 11 Jun 2022 16:50 IST

(Photos: Instagram)

‘మాతృత్వంలోని మాధుర్యమేంటో అనుభవిస్తే గానీ అర్థం కాదు..’ అంటోంది బాపూ బొమ్మ ప్రణీత సుభాష్‌. ఈ ముద్దుగుమ్మ తాజాగా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన పాపను ఎత్తుకొని మురిసిపోతోన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తాను తల్లినయ్యానన్న విషయం చెప్పిందీ చక్కనమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇదో ఎమోషనల్‌ జర్నీ!

కొత్తగా తల్లైన ప్రణీత.. తన పాపను చూస్తూ మైమరచిపోతోంది. ఇందుకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం. ‘గత కొన్ని రోజుల నుంచి నా పాప నా చేతుల్లోకి వచ్చేవరకు.. ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా, ఎమోషనల్‌గా గడిచింది. మా అమ్మ (డాక్టర్‌ జయంతి) గైనకాలజిస్ట్‌ కావడం నా అదృష్టం.. తనకెంతో అనుభవం ఉన్నా నా ప్రసవ సమయంలో భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో సహకరించిన వైద్య బృందానికి నా కృతజ్ఞతలు. త్వరలోనే నా బర్త్‌ స్టోరీని మీ అందరితో పంచుకుంటా..’ అందీ న్యూమామ్‌. ఇక ఈ ఫొటోలు చూసిన ప్రముఖులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఫొటోషూట్‌లో మెరిసిపోయింది!

తాను గర్భం ధరించినప్పట్నుంచి ప్రతి విషయాన్నీ, తన ప్రతి అనుభవాన్నీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది ప్రణీత. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న సమయంలో తన ఆహారపు కోరికలు, ఇటీవలే నిర్వహించిన తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలతో పాటు.. బేబీమూన్‌, మెటర్నిటీ ఫొటోషూట్స్‌.. వంటివన్నీ పంచుకుంటూ మురిసిపోయింది. కాబోయే అమ్మగా పాపాయి కోసం తానెంత ఆతృతగా ఎదురుచూసిందో ఈ ఫొటోల్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

నటిగా తనదైన ముద్ర వేసి, వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిన ప్రణీత వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సేవానిరతిని కూడా చాటుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని