Jewellery: ఆభరణాలు అద్దెకు తీసుకుంటున్నారా?
ఆభరణాలను అద్దెకు ఎక్కడ తీసుకోవాలి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలను తెలుసుకుందాం రండి...
మహిళలు మహాలక్ష్మిలా మెరిసిపోవాలనుకోవడం సహజం. ఇక ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు మరింత ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం. అయితే దీనికి చక్కటి దుస్తులు ఎంత ప్రధానమో దానికి తగ్గ ఆభరణాలు ధరించడం కూడా అంతే ముఖ్యం. కానీ, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొంతమంది అంత ఖర్చును భరించలేరు. ఇలాంటి వారి కోసమే ఆభరణాలు అద్దెకు ఇచ్చే సంస్కృతి వచ్చింది. దీంతో తక్కువ ఖర్చుతో నచ్చిన ఆభరణాలు ధరించి ఆ ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ క్రమంలో ఆభరణాలను అద్దెకు ఎక్కడ తీసుకోవాలి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివరాలను తెలుసుకుందాం రండి...
ఎక్కడ లభిస్తాయి?
ఆభరణాలు అద్దెకు ఇచ్చే పద్ధతి ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉంటుంది. కొన్ని రకాల బ్రైడల్ బ్యూటీ సెలూన్ల వారు ఇలా ఆభరణాలను అద్దెకు ఇస్తుంటారు. అయితే వీరి దగ్గర ఎక్కువ మోడళ్లు ఉండే అవకాశం ఉండదు. ఇలాంటప్పుడు ఆన్‌లైన్‌లోనూ అద్దెకు తీసుకోవచ్చు. వీరి దగ్గర వివిధ రకాల మోడళ్లు ఉండే అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు...
⚛ చాలామంది ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా తయారవ్వాలని ఆశిస్తారు. ఇలాంటివారికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.
⚛ ఆభరణాలు కొనాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా అద్దెకు తీసుకోవడం వల్ల డబ్బును ఆదా చేసుకోవచ్చు. దానికి వెచ్చించాలనుకున్న మొత్తాన్ని ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
⚛ మార్కెట్లోకి ఎప్పుడూ రకరకాల కొత్త మోడళ్లు వస్తుంటాయి. ఈ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
నాణ్యత ఎలా ఉంది?
ఆభరణాలు అద్దెకు తీసుకునేటప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. కొన్ని సందర్భాల్లో ఆభరణాల్లో ఉండే పూసలు, రాళ్లు బయటకు వచ్చి ఉంటాయి. మరికొన్ని ఆభరణాల నాణ్యత సరిగా ఉండదు. ఇలాంటివి ధరించడం వల్ల సరైన లుక్ ఇవ్వకపోవడమే కాకుండా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వెళ్లిన ఫంక్షన్‌లో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇలాంటి వాటిని అద్దెకు తీసుకోకపోవడమే మంచిది.
రిటర్న్ పాలసీని చెక్ చేసుకోవాలి..
ఆభరణాలు ఆన్‌లైన్‌లో తీసుకున్నా.. ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా.. రిటర్న్ పాలసీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆద్దెకు ఇచ్చేవారు ఫలానా సమయానికల్లా తిరిగి ఇవ్వాలని చెబుతుంటారు. కానీ, కొంతమంది అనివార్య కారణాల వల్ల చెప్పిన సమయం కంటే ఎక్కువ రోజులు తమ దగ్గరే ఉంచుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదనపు పన్ను వేస్తుంటారు. కాబట్టి, అద్దెకు తీసుకునే ముందు రిటర్న్ పాలసీని జాగ్రత్తగా తెలుసుకోవడం మంచిది.
శుభ్రం చేయాలి..
ఆభరణాలు అద్దెకు ఇచ్చే సంస్థలు వాటిని ప్యాక్ చేసే ముందు శానిటైజ్ చేస్తుంటాయి. కానీ, మీరు కూడా ఆభరణాలు తీసుకున్న వెంటనే శుభ్రం చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాటిని అంతకుముందు వేరొకరు ఉపయోగించి ఉంటారు. అలాగే సున్నిత చర్మం ఉన్నవారికి ఇతరులు ధరించిన ఆభరణాలు ఉపయోగించడం వల్ల చర్మం పైన అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆ ఆభరణాలను ఉపయోగించే ముందు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
ఇవి గమనించండి..
ఆభరణాలు ఇచ్చే పద్ధతి అన్ని సంస్థలకు ఒకేవిధంగా ఉండదు. కొన్ని సంస్థలు సాధారణ (బంగారం, వజ్రాలు లేని) ఆభరణాలు అద్దెకు ఇస్తే.. మరికొన్ని సంస్థలు విలువైన ఆభరణాలను కూడా అద్దెకు ఇస్తుంటాయి. అయితే సాధారణ ఆభరణాలను ఎటువంటి కాగితాలు లేకుండానే కొద్ది మొత్తంలో డిపాజిట్ చెల్లించి తీసుకోవచ్చు. కానీ, విలువైన ఆభరణాలు తీసుకోవాలంటే రుణాల మాదిరి సంబంధిత డాక్యుమెంటేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆయా సంస్థలు ఆభరణాలు తిరిగి ఇచ్చేసిన తర్వాత మన ఖాతాలో జమ చేస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.