షుగర్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

పండగ ఏదైనా ఆ పండక్కి సంబంధించిన పూజలు, వ్రతాలతో పాటు ఆ సందర్భంగా చేసుకునే పిండి వంటలూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. అందులోనూ దీపావళి పిండి వంటలనగానే ముందుగా గుర్తొచ్చేవి స్వీట్లు. ఈ పండక్కి మిఠాయిలను ఇంట్లో తయారుచేయడమే కాదు.. బయట నుంచి కొనుగోలు చేయడం, వాటిని నలుగురికీ పంచుతూ ఆనందించడం మన సంప్రదాయం.

Published : 04 Nov 2021 12:30 IST

పండగ ఏదైనా ఆ పండక్కి సంబంధించిన పూజలు, వ్రతాలతో పాటు ఆ సందర్భంగా చేసుకునే పిండి వంటలూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. అందులోనూ దీపావళి పిండి వంటలనగానే ముందుగా గుర్తొచ్చేవి స్వీట్లు. ఈ పండక్కి మిఠాయిలను ఇంట్లో తయారుచేయడమే కాదు.. బయట నుంచి కొనుగోలు చేయడం, వాటిని నలుగురికీ పంచుతూ ఆనందించడం మన సంప్రదాయం. అయితే నోరూరించే ఈ స్వీట్లను చూడగానే మనసును అదుపు చేసుకోవడం కాస్త కష్టమే. ఎప్పుడెప్పుడు వాటిని రుచి చూస్తామా అన్న ఆతృతే మనలో ఎక్కువగా ఉంటుంది.

మరి, మనమే ఇలా ఉంటే నిత్యం స్వీట్లకు ఆమడ దూరంలో ఉండే మధుమేహుల పరిస్థితి ఏంటి..? 'పండగే కదా కాస్త రుచి చూస్తే ఏం కాదులే..' అంటూ వారూ కొద్దికొద్దిగా స్వీట్లను లాగించేస్తుంటారు. కానీ అది వారి ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. కేవలం స్వీట్లే కాదు.. ఈ పండక్కి చేసే ఇతర పిండి వంటలూ అధికంగా తినడం వల్ల వారి ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం, ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం.. వంటివి చేస్తే ఈ దీపావళి వారికీ మరింత తియ్యదనాన్ని పంచుతుంది.

ఇంట్లో తయారుచేసే స్వీట్లయినా, బయట దొరికే మిఠాయిలైనా, ఇతర పిండి వంటకాలైనా సరే.. వాటిలో చక్కెరలు, కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. పండగే కదా నోరు కాస్త తీపి చేసుకుంటే ఏమవుతుందిలే అని మధుమేహులు వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పంచదారకు బదులు..

సకల పోషకాల మిళితమైన డేట్స్, కిస్‌మిస్.. వంటివి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇవి మధుమేహులకూ మంచివని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వారు ఈ దీపావళికి స్వీట్లకు బదులుగా వీటితో నోటిని తీపి చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆ రోజు తయారుచేసే స్వీట్లలో చక్కెరకు బదులుగా వీటిని వేసి మిఠాయిలు తయారుచేసుకోవచ్చు. తద్వారా ఇటు స్వీట్లు తిన్న తృప్తిని పొందడంతో పాటు అటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. అలాగే సాధ్యమైనంతవరకు షుగర్ ఫ్రీ స్వీట్లను ఎంచుకోవాలి. అయితే ఏవైనా సరే మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యుల సలహా మేరకు వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఈ నూనె మంచిది..

పండగంటే కేవలం స్వీట్లు, ఇతర పిండి వంటలే కాదు.. ఈ రోజు ఎన్నో వంటకాలు కూడా చేసుకుంటాం.. ఎక్కువ మొత్తంలో లాగించేస్తాం కూడా..! అలాంటప్పుడు ఈ రోజు చేసుకునే వంటకాల్లో మనం రోజూ వాడే నూనె కాకుండా ఆలివ్ నూనెను వాడితే మంచిది. దీనిలో ఉండే మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. వంటివి రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పండగ రోజుతో పాటు మిగతా రోజుల్లోనూ ఈ నూనెను వాడడం మధుమేహుల ఆరోగ్యానికి చాలా మంచిది.

వ్యాయామం మానద్దు..

పండగ రోజు కూడా వ్యాయామం ఏం చేస్తాం అంటూ ఆ రోజు ఎక్సర్‌సైజ్ వాయిదా వేసే వారూ లేకపోలేరు. కానీ అలా అనుకోకుండా ఉదయాన్నే ఓ గంట పాటు వ్యాయామానికి సమయమివ్వండి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి బరువులెత్తడం వంటి వ్యాయామం ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. మధుమేహాన్ని అదుపు చేయడానికి ఇది బాగా తోడ్పడుతుందట! దీంతో పాటు నడక, జాగింగ్, ధ్యానం.. వంటివీ మధుమేహులు తమ రొటీన్‌లో భాగం చేసుకోవడం చాలా మంచిది.

ఇది మరవకండి..

‘హమ్మయ్య పండగ అయిపోయింది.. ఈ రోజున చేసిన స్వీట్లు, పిండి వంటలు తక్కువ మొత్తంలోనే తీసుకున్నాం కదా.. షుగర్ అదుపులోనే ఉంటుందిలే’ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మీరు తీసుకున్న ఆ కొద్ది ఆహార పదార్థాలతోనూ రక్తంలో చక్కెర స్థాయులు పెరగచ్చు లేదంటే స్థిరంగానూ ఉండచ్చు.. మరి, ఆ విషయం తెలుసుకోవాలంటే పండగ తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే..! తద్వారా సమస్యేదైనా ఉంటే సంబంధిత మందులు వాడుతూ మధుమేహాన్ని అదుపు చేసుకోవచ్చు. అలా కాదని షుగర్ టెస్ట్‌ని వాయిదా వేస్తే లేనిపోని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మాత్రం మరవద్దు.

షుగర్ లేని వాళ్లకు డీటాక్స్ ఇలా..!

అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆ తర్వాత డీటాక్స్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడం చాలామందికి అలవాటు. నిన్న ఎక్కువగా తినేశాం కాబట్టి ఈరోజు డీటాక్స్ చేద్దాం.. లేదా పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేద్దాం అనే ఆలోచన మంచిది కాదు.. ఆహారం తీసుకునేటప్పుడే ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే డీటాక్స్ అవసరం ఉండదు. సంప్రదాయ వంటకాలు తీసుకుంటే డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు వేరే తరహా ఆహారం తీసుకొని మీ కడుపు పాడైతే ఉదయాన్నే లేచి గుల్‌కంద్ (గులాబీ రేకులతో చేసే స్వీట్) ఒక స్పూన్ తీసుకొని కాసేపాగి ఓ అరటిపండు తినాలి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనంలో కంద జాతికి చెందిన చిలగడదుంప, కంద వంటి కూరగాయలను తీసుకోవాలి. నెయ్యి వాడకాన్ని ఎక్కువ చేయాలి. వీలుంటే భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలుపుకొని తింటే చాలా మంచిది. ప్రపంచమంతా డీటాక్స్ కోసం మన సంప్రదాయ ఫార్ములా అయిన చెరుకురసాన్ని వాడుతోంది. మనం వెస్ట్రన్ మోజులో పడి దాన్ని పట్టించుకోవట్లేదు. చెరుకు రసం చక్కటి డీటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందుకే దాన్ని తాగడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్