తినాలంటే... ఈ తప్పులు చేయొద్దు!
ఉరుకులు పరుగుల జీవితంలో ఇంట్లో వండుకోవడానికి అవకాశమే ఉండటం లేదంటున్నారు నేటి యువత. దీంతో చాలావరకు పార్శిల్స్, ప్లాస్టిక్ డబ్బాల్లో స్టాక్ పెట్టుకోవడానికి అలవాటుపడ్డారు. ఇది ఆరోగ్యాన్ని ఇబ్బందిపెట్టేదే అంటున్నారు నిపుణులు.
ఇద్దరికీ ఉద్యోగాలు... ఉదయాన్నే పరుగులు తీస్తేనే కానీ గడవని జీవితాలు (Busy Life). మరి ఇంట్లో రకరకాలు వంటలు వండుకునే తీరికెక్కడది? అందుకే, హోటళ్ల పార్సిళ్లూ (Packaged Food) లేదా ఓసారి వండిన ఆహారాన్నే మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడాలూ. ఇవేకాదు, పసిపిల్లాడికి పట్టించే పాల సీసా నుంచి నిల్వ పచ్చళ్ల వరకూ... ప్రతిదానికీ ప్లాస్టిక్ కవర్లూ... డబ్బాలే (Plastic Covers and Boxes)! ఇవన్నీ వాడితే సౌకర్యం సరే! మరి ఆరోగ్యమో? అల్సర్ (Ulcer) నుంచి క్యాన్సర్ (Cancer) వరకూ అన్నింటికీ ఈ అలవాట్లే కారణమంటున్నారు వైద్యులు. వీటి గురించి మరింత లోతుగా తెలుసుకుంటే...
అల్యూమినియం ఫాయిల్‌తో...
మధ్యాహ్నం చపాతీనో, పరాఠానో తినాలనిపిస్తుంది... అందుకోసం కాస్త ఖాళీ దొరికినప్పుడే వాటిని చేసి... అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి పెట్టేస్తాం. ఇలా అయితే ఎక్కువ సేపు తేమగా, మృదువుగా ఉంటాయి. కానీ ఈ కాగితంలో చుట్టిన వేడి వేడి పదార్థాలను తిన్నా, దాంతోనే వేడి చేసి తీసుకున్నా మూత్రపిండాల వ్యాధులు, ఎముక సంబంధిత సమస్యలూ ముంచుకొస్తాయట. అలానే, వీటిల్లో ఆమ్ల స్వభావం ఉన్నవి అంటే... వెనిగర్, టొమాటో, చింతపండూ వంటివాటితో చేసిన వంటకాలను అస్సలు ప్యాక్ చేయకూడదు. చేస్తే అల్యూమినియం కరిగి ఆ పదార్థాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి? ఆహారాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయొచ్చు. చెక్కబాక్సుల్లో మస్లిన్ వస్త్రం పరిచి భద్రపరచుకోవడం వల్ల చపాతీలు తేమను కోల్పోకుండా ఉంటాయి.
మరిగే నూనెల్లో...
కరకరలాడే ఫ్రైలూ, వేడివేడి మిర్చిబజ్జీల వంటివి నచ్చనిది ఎవరికి? వీటి తయారీకి నూనె అవసరం కాస్త ఎక్కువే. ఇలా మిగిలిన నూనెని పడేయలేక తిరిగి కూరల్లో వాడేస్తుంటారు చాలా మంది. కానీ, వంటనూనెని ఓ సారి ఉపయోగిస్తే... అందులోని పోషకాలన్నీ మనం వాడుకున్నట్లే. దాన్ని తిరిగి వేడిచేస్తే చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు... ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లకూ కారణమవుతుంది.
ఏం చేయాలి: కోల్డ్‌ప్రెస్డ్ నూనెల్ని వాడుకోవాలి. మరీ ఎక్కువగా మరగబెట్టడం, వాడిన నూనెల్ని మళ్లీ మళ్లీ వాడటం మానేయాలి.
ప్లాస్టిక్ భూతాన్ని వదిలేద్దాం...
రకరకాల రంగులూ, ఆకృతులూ, గాలి చొరని మూతలూ, తేలిగ్గా శుభ్రం చేసుకోగలిగే వీలు... వంటివన్నీ వంటింట్లో ప్లాస్టిక్ డబ్బాల వాడకాన్ని పెంచేశాయి. దాంతో ఇల్లంతా ప్లాస్టిక్ మయమైపోయింది. ఇక, ప్యాకేజింగ్, ప్లాస్టిక్ ర్యాప్‌ల్లోని థాలేట్‌లు వ్యాధి కారకాలుగా మారుతున్నాయి. అలానే మైక్రోవేవ్, డిష్‌వాషర్ సేఫ్ ప్లాస్టిక్.... అని ఎంత గొప్పగా చెప్పినా ఆ వస్తువుల నుంచీ పెద్ద ఎత్తున రసాయనాలు వెలువడు తాయన్నది నమ్మితీరాల్సిన నిజం. ముఖ్యంగా వీటిల్లో అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు పాలిథిలీన్, పాలీ ప్రొఫైలిన్ వంటివి రసాయనిక చర్య పొందుతాయి. మైక్రో ప్లాస్టిక్‌ని ఆహారం, పానీయాల్లోకి పంపుతాయి అంతే కాదు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గిన్నెలు కాలం గడిచేకొద్దీ సూక్ష్మ పరిమాణంలో ప్లాస్టిక్ అణువులను విడిచిపెడుతూ ఉంటాయి. కంటికి కూడా కనిపించని వాటిని మనం తెలియకుండానే తినేస్తున్నాం. ఇందుకు తాజా ఉదాహరణ అమ్మపాలల్లో ప్లాస్టిక్ జాడ కనిపించడమే. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీల అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్‌లోని బైస్ఫినోల్ ఎ(బీపీఏ)ని గర్భిణులు మోతాదుకి మించి తీసుకుంటే గర్భస్థ శిశువు ఎదుగుదల దెబ్బతింటుంది.
ఏం చేయాలి.. బయట ఆహారం ప్యాక్ చేసిన డబ్బాలు పునర్వినియోగానికి పనికిరావు. గీతలూ, రంగు మారిన వాటి జోలికి పోవొద్దు. అలానే ప్లాస్టిక్ డబ్బాల్లో నూనె, కొవ్వు పదార్థాలను నిల్వ ఉంచొద్దు. ఇక, సింగిల్ యూజ్ వాటర్ బాటిళ్లే కాదు... ప్లాస్టిక్ నీళ్లసీసాల వినియోగానికి దూరంగా ఉండండి. స్టీల్, గాజు, పింగాణీ చెక్క సామగ్రిని వాడుకోవచ్చు.
వేడి చేసి తింటున్నారా?
ఆహారాన్ని వృథా చేయకూడదని కొందరు పదే పదే వేడి చేసి తింటుంటారు. ఈ అలవాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆకుకూరల్ని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. చేస్తే... వీటిల్లోని ఖనిజాలు ఆక్సిడైజ్ అవుతాయి. ఐరన్ ఆక్సీకరణ చాలా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్యారెట్‌ని మళ్లీ మళ్లీ ఉడికిస్తే... కార్సినోజెనిక్ ప్రాపర్టీలు విడుదలవుతాయి. అలానే మిగిలిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినడం వల్ల పోషకాలు నశించడమే కాదు... ఇందులోని బ్యాక్టీరియా దాన్ని విషతుల్యంగా మారుస్తుంది. ఉడికించిన గుడ్లను రీహీట్ చేస్తే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్ విడుదల అవుతాయి. చికెన్‌ను పదే పదే వేడి చేయడం వల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. అందువల్ల మళ్లీ మళ్లీ వేడిచేయడాన్ని మానేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.