close
Published : 01/11/2021 21:30 IST

బంగారం కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి...

ధనత్రయోదశి.. అనగానే బంగారం ఎంతో కొంత కొనాలి అనుకుంటాం. ఇప్పుడే కాదు... పసిడి ఎప్పుడు కొన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే...

బంగారు ఆభరణాలు కొంటున్నప్పుడు వాటి స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్ గుర్తు వాటి మీద ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి.

వీలైనంతవరకూ అచ్చంగా బంగారంతో చేసిన నగలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎప్పుడు మార్చుకున్నా పూర్తిస్థాయిలో నష్టం ఉండదు. రాళ్ల నగలు కొంటుంటే... రాళ్లు, బంగారం విలువను వేర్వేరుగా చూపిస్తున్నారో లేదో గమనించుకోండి. సాధారణ రాళ్లకు అసలు విలువ ఉండదు. కానీ కొన్ని దుకాణాలు వీటికీ ధర ఎక్కువగా వేస్తుంటాయి. అందుకే బిల్లు వేసేటప్పుడే దానికి విలువ కట్టకుండా మాట్లాడుకోవాలి. పగడాలు, కెంపులు, అన్‌కట్స్‌కి కాస్త రీసేల్ వాల్యూ ఉంటుంది.

నగలు తీసుకున్నప్పుడు తెల్ల కాగితం మీద రాసి ఇచ్చిన బిల్లును తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే.. దుకాణం వివరాలు, రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్‌వాయిస్ కాగితం మీదే బిల్లు వేయించాలి. కంప్యూటర్ బిల్లు అయితే ఇబ్బంది ఉండదు. బంగారం నాణ్యత విషయంలో మోసపోతే వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే అరగ్రాము బంగారం కొన్నా సరే దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా దాచుకోవాలి.

ఒకేసారి బంగారం కొనుగోలు చేయలేం అనుకునేవారు.. స్కీముల్లో డబ్బులు కడుతుంటారు. నమ్మకమైన సంస్థల్లో కట్టినప్పుడు మాత్రమే మీ డబ్బులకు, బంగారానికి భద్రత ఉంటుంది. బంగారం అప్పటికప్పుడు కొనుక్కోవలసిన అవసరం లేకపోతే కడ్డీలు, నాణేల రూపంలో కొనుక్కోవచ్చు. బ్యాంకులూ బంగారం అమ్ముతాయి.. కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యత విషయంలో పూర్తి హామీ ఉంటుంది.

పెద్ద పెద్ద దుకాణాల్లో తరుగు, మజూరీ కలిపి వాల్యూ యాడెడ్ ఛార్జీగా బిల్లు వేస్తుంటారు. ఇది ఆరు శాతం నుంచి మొదలై నగను బట్టి ముప్పై శాతం పైనే ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఇవన్నీ లెక్కేస్తే.. కొన్నిసార్లు తీసుకున్న నగ కంటే రెండు మూడు గ్రాముల పసిడికి అదనంగా బిల్లు చెల్లించాల్సి వస్తుంది. కొనే ముందు ఇవన్నీ పక్కాగా అర్థం చేసుకోగలిగితే మీ డబ్బు వృథా కాదు.


Advertisement

మరిన్ని