Published : 19/12/2021 13:40 IST

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!

సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ఇవన్నీ చేసినా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఎప్పటిలా తాజాగా, హుషారుగా ఉండటానికి వీలవుతుంది.

నీరసించకుండా..

నెలసరి సమయంలో జరిగే అధిక రక్తస్రావం వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో రక్తాన్ని కోల్పోతుంది. అందుకే చాలామంది అమ్మాయిలు నీరసించిపోతారు. ఈ సమస్యను అరికట్టడానికి మామూలు సమయంలో మనం ఎలా పౌష్టికాహారం తీసుకుంటామో అంతకంటే ఎక్కువగానే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి. తాజా పండ్లరసాలు, తక్షణ శక్తినిచ్చే ఆహారపదార్థాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఫలితంగా శరీరం నీరసించిపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే నెలసరి సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. పెరుగు, ఒమేగా-3 అధికంగా ఉండే నట్స్‌, తాజా కూరగాయలు, తాజా పండ్లు... వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి నెలసరితో వచ్చే చికాకులు ఉండవు.

న్యాప్‌కిన్స్ విషయంలో..

నెలసరి శుభ్రత విషయంలో రాజీ పడితే దీర్ఘకాలంలో అలర్జీలు మొదలుకుని క్యాన్సర్ వరకూ ఎన్నో రకాల అనారోగ్య ముప్పుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. రసాయనాల పూతతో ఉన్న వాటిని ఉపయోగించినా, అపరిశుభ్రంగా ఉన్న వస్త్రాలను వాడినా ఇన్‌ఫెక్షన్లు, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

* కొంతమంది మహిళలు తిరిగి వాడుకునే ప్యాడ్‌లు, టాంపూన్లను వాడుతుంటారు. అయితే వాటిని వాడిన ప్రతిసారి బాగా శుభ్రం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అందులో ఉండే హానికారక సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. లేదంటే గర్భాశయానికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.

* అపరిశుభ్రంగా ఉన్న న్యాప్కిన్లు, వస్త్రాలను వాడటం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.

* పీరియడ్స్‌లో రక్తస్రావం తక్కువగా ఉన్నా సరే.. ప్రతి 4 నుంచి 6 గంటల వ్యవధికోసారి న్యాప్‌కిన్ తప్పనిసరిగా మార్చుకోవాలి. అధిక రక్తస్రావం అవుతుంటే కనుక తరచూ న్యాప్‌కిన్స్ మార్చుకోవడం తప్పనిసరి. వాడిన తర్వాత చేతులను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

* మనం పరిశుభ్రంగా ఉండటానికి న్యాప్‌కిన్స్ తరచూ మార్చుకోవడం ఎంత అవసరమో వాటిని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే న్యాప్‌కిన్‌కి పేపర్ చుట్టి చెత్తడబ్బాలో వేసేయాలి. లేదా కొన్ని చోట్ల వాటికి ప్రత్యేకించి డబ్బాలు ఉన్నప్పుడు వాటిలో పడేయాలి.

* బయోడిగ్రేడబుల్‌ రకాల్ని ఎంచుకోవాలి. వీటిలో ప్రస్తుతం ప్యాడ్లు, టాంపూన్లు, పీరియడ్‌ ప్యాంటీలు వంటివి చాలానే దొరుకుతున్నాయి. నచ్చిన రకాలను ఎంచుకోవచ్చు. ఇవి భూమిపై వ్యర్థాలను మిగల్చకుండా పర్యావరణ హితంగా ఉంటాయి.

శుభ్రత పాటించకపోతే ముప్పే...

* నెలసరి సమయంలో జరిగే రక్తస్రావాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే దానివల్ల మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

* ఒక న్యాప్‌కిన్ ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల తొడల మధ్య లేదా ఆ ప్రాంతంలో రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటినే 'ప్యాడ్ రాషెస్' అంటారు. వీటివల్ల అలర్జీ, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటికి చెక్ పెట్టాలంటే తరచూ ప్యాడ్ మార్చుకుంటూ ఆ ప్రాంతమంతా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి.

* అలాగే ఈ సమయంలో జననాంగాన్ని శుభ్రం చేసుకోవడానికి చాలామంది సబ్బుని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సందర్భాల్లో ఆ అవయవాలు వాటంతటవే శుభ్రపడేలా మన శరీర వ్యవస్థ ఆరోగ్యకర బ్యాక్టీరియాలను విడుదల చేస్తుంది. సబ్బు ఉపయోగించడం వల్ల ఈ బ్యాక్టీరియా నశించిపోతుంది. ఫలితంగా హానికారక బ్యాక్టీరియా ఉత్పత్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే గోరువెచ్చని నీటితో పై నుంచి కింది దిశగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సబ్బు వాడాల్సి వస్తే గాఢత తక్కువగా ఉండే సబ్బుని ఎంచుకోవాలి.

* వ్యక్తిగత భాగాల దగ్గర తడిలేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన, శుభ్రమైన లోదుస్తులను మాత్రమే వాడాలి. బిగుతుగా ఉండేవి అస్సలు వాడొద్దు.

* అలాగే టాయిలెట్‌కి వెళ్లిన ప్రతిసారీ సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం అస్సలు మరిచిపోకూడదు.

* సాధారణ సమయంతో పోలిస్తే నెలసరిలోనే ఎక్కువ చిరాకుగా కనిపిస్తాం. అందుకే గోరువెచ్చని నీళ్లతో రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. అప్పుడే తాజాగా, హుషారుగా ఉండచ్చు. లేదంటే ఒంటి మీద పేరుకున్న మురికితో మనం మరింత నీరసంగా కనిపించే అవకాశం ఉంటుంది.

చూశారుగా.. నెలసరి సమయంలో అవసరాలకు అనుగుణమైన శానిటరీ న్యాప్‌కిన్లను ఎంపిక చేసుకుని, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎప్పటిలానే తాజాగా, హుషారుగా కనిపించవచ్చు. ఏమంటారు??


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని