బాడీ లోషన్‌ రాసుకునే ముందు..!

ఎప్పటికప్పుడు మారే వాతావరణం చర్మంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే చర్మంలో తేమని నిలిపి ఉంచడానికి ఏదో ఒక క్రీమ్/బాడీ లోషన్ రాసుకుంటే....

Published : 03 Jul 2023 21:01 IST

ఎప్పటికప్పుడు మారే వాతావరణం చర్మంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే చర్మంలో తేమని నిలిపి ఉంచడానికి ఏదో ఒక క్రీమ్/బాడీ లోషన్ రాసుకుంటే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ వీటిలో కూడా చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే ఫలితం ఉంటుందంటున్నారు.

కాస్త తడిగా ఉన్నప్పుడే..

ముఖానికి లేదా చర్మానికి క్రీమ్‌లు, లోషన్లు.. మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అలాగే చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే వాటిని రాసుకోవాలి. అప్పుడే అది చర్మ గ్రంథుల్లోకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.

స్నానం చేసిన వెంటనే..

క్రీమ్ లేదా బాడీలోషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా.. స్నానం చేసిన వెంటనే రాసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో చర్మ కణాలు తెరుచుకొని ఉంటాయి.. కాబట్టి ఆ సమయంలో క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చేరి సులభంగా ఇంకుతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత కూడా తప్పకుండా క్రీమ్ లేదా బాడీలోషన్ రాసుకోవాలి. లేదంటే నీటిలో ఉండే క్లోరిన్ వల్ల చర్మం మరింత పొడిగా మారే ప్రమాదం ఉంటుంది.

చర్మం ఉష్ణోగ్రతను బట్టి..

చర్మం కాస్త వేడిగా ఉన్నప్పుడే క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అవి చర్మంలోకి సులభంగా ఇంకుతాయంటున్నారు నిపుణులు. అందుకే క్రీమ్ లేదా లోషన్ రాసుకునే ముందు చర్మం చల్లగా అనిపిస్తే.. గోరువెచ్చని నీళ్లలో ముంచిన టవల్‌తో తుడుచుకొని ఆపై లోషన్‌ను చర్మానికి అప్త్లె చేసుకోవాలంటున్నారు.

ఎన్నో ప్రయోజనాలు..

పొడిబారి నిర్జీవంగా మారిపోయిన చర్మానికి క్రీమ్ లేదా లోషన్ రాసుకోవడం వల్ల అది తేమను సంతరించుకోవడంతో పాటు పునరుత్తేజితం అవుతుంది.

బాడీ లోషన్‌ చర్మంపై ఉన్న మచ్చల్ని క్రమంగా తగ్గించడానికీ ఉపయోగపడుతుంది.

అలాగే బాడీ లోషన్‌ వెదజల్లే పరిమళాలు మానసిక ప్రశాంతతనూ అందిస్తాయి.

గరుకుగా ఉండే చర్మ భాగాలపై తరచుగా క్రీమ్ లేదా లోషన్స్ అప్త్లె చేయడం వల్ల కొన్నాళ్లకు అవి మృదువుగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని