Published : 01/02/2022 20:56 IST

బాడీలోషన్ రాసుకుంటున్నారా??

ఎప్పటికప్పుడు వాతావరణంలో కలిగే మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలనే కదా.. మనం అవనీ.. ఇవనీ.. రకరకాల క్రీమ్‌లు రాసుకునేది అంటారా? నిజమే.. కానీ వాటిని రాసుకోవడానికి కూడా సమయం, సందర్భం ఉంటాయి. సరైన సమయంలో, క్రమ పద్ధతిలో రాసుకుంటేనే వాటి వల్ల ఎక్కువ ఫలితాలు చేకూరతాయి. ఈ క్రమంలో- బాడీలోషన్ ఎప్పుడు, ఎలా రాసుకోవాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం రండి..

చర్మంలో తేమని నిలిపి ఉంచడానికి ఏదో ఒక క్రీమ్/ లోషన్ రాసుకుంటే సరిపోతుందనుకుంటే పొరపాటు. వీటిలో కూడా మీకు నప్పే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. అలాగే వాటిని ఉపయోగించే విధానాన్ని కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం.

కాస్త తడిగా ఉన్నప్పుడే..

ముఖానికి లేదా చర్మానికి క్రీమ్‌లు, లోషన్లు.. మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అప్పుడు అది చర్మ గ్రంథులకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం ఎంతో కొంత తడిగా ఉన్నప్పుడే వాటిని రాసుకోవాలి. అలా చేయడం వల్ల క్రీమ్ లేదా లోషన్ ఆ తడి ద్వారా చర్మగ్రంథులకు అందుతుంది. ఆశించిన ఫలితం లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు క్రీమ్ లేదా లోషన్స్ రాయడం వల్ల అవి చర్మంలోకి సరిగా ఇంకవు. ఫలితంగా డబ్బు, క్రీమ్.. రెండూ వృథానే.

స్నానం చేసిన వెంటనే..

క్రీమ్ లేదా బాడీలోషన్స్ రాసుకోవడానికి సరైన సమయం స్నానం చేసిన వెంటనే. ఎందుకంటే అప్పుడే చర్మం తాజాగా, శుభ్రంగా ఉంటుంది. చర్మకణాలన్నీ తెరుచుకుని ఉంటాయి కాబట్టి ఆ సమయంలో క్రీమ్ లేదా లోషన్స్ రాయడం వల్ల అవి చర్మ గ్రంథుల్లోకి సులభంగా ఇంకుతాయి. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత కూడా తప్పకుండా క్రీమ్ లేదా బాడీలోషన్ రాసుకోవాలి. లేదంటే నీటిలో ఉండే క్లోరిన్ వల్ల చర్మం మరింత పొడిగా మారిపోయి కళ తప్పిపోతుంది.

మృదువుగా రాసుకోవాలి..

చర్మానికి క్రీమ్ లేదా బాడీలోషన్ రాసుకోవడానికి కూడా ఒక పద్ధతుంది. ముందుగా కొద్దిగా క్రీమ్‌ని చేతిలోకి తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే రాసుకోవాలనుకుంటున్నామో అక్కడ చిన్న చిన్న డాట్స్‌లా పెట్టాలి. సర్క్యులర్‌గా రుద్దుతూ డాట్స్‌ని కలుపుకుంటూ మొత్తం ఆ ప్రాంతమంతా మృదువుగా రాసుకోవాలి. అప్పుడే చర్మం మరింత నిగారింపుని సొంతం చేసుకుంటుంది. గట్టిగా అదుముతూ, చర్మం మీద ఒత్తిడి కలిగించి రాసే క్రీమ్స్ లేదా లోషన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. పైగా చర్మం కమిలిపోవడం, వదులుగా అయిపోవడానికి అవకాశాలెక్కువ ఉంటాయి.

చర్మం కాస్త వేడిగా..

చర్మం మరీ చల్లగా ఉన్నప్పుడు క్రీమ్స్ రాసుకోకూడదు. ఒకవేళ రాసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. చర్మం ఎంతో కొంత వేడిగా ఉన్నప్పుడే క్రీమ్ లేదా లోషన్స్ చర్మంలోకి సులభంగా ఇంకిపోయి, వాటి పనితనాన్ని చూపించగలుగుతాయి. క్రీమ్ లేదా లోషన్ రాసుకునే ముందు ఎప్పుడన్నా చర్మం చల్లగా అనిపిస్తే వెంటనే గోరువెచ్చని నీళ్లలో ముంచిన టవల్‌తో ముఖం తుడుచుకోవాలి. చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే క్రీమ్ లేదా లోషన్ చర్మానికి అప్త్లె చేసుకోవాలి.

ఎన్నో ప్రయోజనాలు..

* పొడిబారి నిర్జీవంగా మారిపోయిన చర్మానికి క్రీమ్ లేదా లోషన్ రాసుకోవడం వల్ల తిరిగి జీవం పోసుకుంటుంది. తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

* చర్మం మీద ఎప్పట్నుంచో ఉన్న మచ్చల్ని కూడా మెల్లగా తగ్గించడానికి ఉపయోగపడతాయి.

* చర్మానికి రాసుకునే క్రీమ్ లేదా బాడీలోషన్స్‌లో ఉండే సువాసన వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది. ఒక చక్కటి అనుభూతి కూడా కలుగుతుంది.

* అంత తొందరగా అలసటను దరిచేరనీయదు. పైగా క్రీమ్ నుంచి వచ్చే సువాసన ద్వారా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

* అంతేకాదు.. గట్టిగా, రఫ్‌గా ఉండే భాగాల పైన కూడా తరచుగా క్రీమ్ లేదా లోషన్స్ అప్త్లె చేయడం వల్ల మృదువుగా మారి మెత్తబడతాయి.

* ఇక అన్నిటికంటే ముఖ్యంగా చర్మంలోని తేమని నిలిపి ఉంచి, చర్మకాంతిని మరింత ఇనుమడించేలా చేస్తాయి.

సో.. ఇవండీ.. బాడీలోషన్స్ లేదా క్రీమ్స్ రాసుకోవడం వల్ల కలిగే లాభాలు.. రాసుకునే విధానం.. సమయం.. సందర్భం.. అన్నీ తెలిశాయిగా.. ఈసారి మీరు కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీ చర్మాన్ని చక్కగా సంరక్షించుకోండి మరి..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని