గర్భిణిగా ఉన్నప్పుడు స్పాటింగ్ కనిపిస్తోందా?
గర్భం ధరించాక ఎన్నెన్నో జాగ్రతలు తీసుకుంటాం. అయినా కూడా అప్పుడప్పుడూ చిన్నపాటి అనారోగ్యాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. గర్భధారణ సమయంలో అప్పుడప్పుడు కనిపించే స్పాటింగ్/ బ్లీడింగ్ కూడా....
గర్భం ధరించాక ఎన్నెన్నో జాగ్రతలు తీసుకుంటాం. అయినా కూడా అప్పుడప్పుడూ చిన్నపాటి అనారోగ్యాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. గర్భధారణ సమయంలో అప్పుడప్పుడు కనిపించే స్పాటింగ్/ బ్లీడింగ్ కూడా ఇలాంటిదే. అయితే దీనికి భయపడాల్సిన పని లేదని, గర్భిణిగా ఉన్నప్పుడు ఇది సహజమేనని చెబుతున్నారు నిపుణులు. అలాగని ఎక్కువ రక్తస్రావమైనా, కడుపు నొప్పి/నడుము నొప్పి/జ్వరం వంటివి దానికి తోడైనా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ గర్భిణిగా ఉన్నప్పుడు స్పాటింగ్/బ్లీడింగ్ ఎందుకవుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ని సంప్రదించాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
గర్భం ధరించిన తర్వాత ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా దాని ప్రభావం కడుపులోని బిడ్డపై పడుతుందేమోనని కంగారు పడిపోతాం. స్పాటింగ్/బ్లీడింగ్ కనిపిస్తే అబార్షన్ అవుతుందేమో లేదంటే ఇదేమైనా సమస్యేమో అని భయపడిపోతుంటాం. కానీ గర్భం ధరించిన మహిళల్లో దాదాపు 25 శాతం మందిలో తొలి 12 వారాల్లో కొద్దిపాటి బ్లీడింగ్/స్పాటింగ్ కనిపించడం సర్వసాధారణమైన విషయం అని ఓ అధ్యయనంలో తేలింది. అయితే దానివల్ల అబార్షన్ లేదంటే ఇతర ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు చాలా అరుదని వెల్లడించింది.
అసలు ఎందుకవుతుంది?
తొలి 12 వారాల్లోనే కాకుండా కొంతమంది గర్భిణుల్లో అప్పుడప్పుడూ స్పాటింగ్ కనిపించడం సహజమంటున్నారు నిపుణులు. అయితే ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటంటే..!
⚛ అండం వీర్యంతో ఫలదీకరణం చెందిన 6 నుంచి 12 రోజుల్లో కనిపించే స్పాటింగ్‌ను ఇంప్లాంటేషన్ బ్లీడింగ్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. దీన్ని గర్భం ధరించారనడానికి ఓ సంకేతంగా భావించచ్చట! అయితే అందరు మహిళల్లోనూ ఇది కనిపించదని, ఈ స్పాటింగ్ కొన్ని గంటల వ్యవధి నుంచి మూడు రోజుల్లోగా దానంతటదే ఆగిపోతుందని చెబుతున్నారు.
⚛ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (పిండం గర్భాశయం బయట ఏర్పడడం)లో తక్కువ బ్లీడింగ్ నుంచి ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇక దీంతో పాటు పొత్తి కడుపులో నొప్పి/వెజైనా దగ్గర నొప్పి, అలసట, నీరసం.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మేలని చెబుతున్నారు.
⚛ గర్భస్రావం అయినప్పుడు బ్లీడింగ్ అవడం సహజమే! అయితే ఒక్కోసారి ఎలాంటి నొప్పి లేకుండానే బ్రౌన్ లేదంటే ముదురు ఎరుపు రంగు లేదంటే లేత గులాబీ రంగులో బ్లీడింగ్ కావడం, విపరీతమైన వెన్ను నొప్పి, గడ్డల్లాగా బ్లీడింగ్ కావడం, ఒక్కసారిగా బరువు తగ్గడం.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది.
⚛ గర్భం ధరించిన తొలి రోజుల్లో శరీరంలో హార్మోన్లలో వచ్చిన మార్పులు కూడా స్పాటింగ్/తక్కువ బ్లీడింగ్‌కు కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
⚛ ప్రెగ్నెన్సీ సమయంలో లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల కూడా ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందట!
⚛ వెజైనా వద్ద వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా స్పాటింగ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు దురద, మంట.. వంటివి ఉంటే కచ్చితంగా డాక్టర్‌కి చూపించుకోవాలి.
⚛ వెజైనా దగ్గర్నుంచి చేసే పరీక్షల (పెల్విక్ పరీక్షల) వల్ల కూడా రక్తస్రావం కనిపించడం సహజమే అంటున్నారు నిపుణులు.
⚛ అయితే రెండో త్రైమాసికంలో ఇలాంటి రక్తస్రావం/స్పాటింగ్ వంటివి ప్రిమెచ్యూర్ డెలివరీ లేదంటే ఆలస్యంగా గర్భస్రావం కావడం.. వంటి సమస్యలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు నిపుణులు.
⚛ ఇక మూడో త్రైమాసికంలో బ్లీడింగ్ ప్రసవానికి ఓ సూచికగా పరిగణించచ్చంటున్నారు నిపుణులు. అయితే ఒక్కోసారి మాయ వెజైనాకు అడ్డుపడడం వల్ల కూడా ఇలా జరుగుతుందని.. దీన్ని ‘ప్లాసెంటా ప్రీవియా’గా పిలుస్తారని చెబుతున్నారు.
ఇలా అయితే డాక్టర్‌ని కలవాల్సిందే!
గర్భం ధరించిన సమయంలో స్పాటింగ్/కొద్దిపాటి బ్లీడింగ్ సహజమే అయినప్పటికీ ఓసారి నిపుణుల్ని సంప్రదించి అసలు కారణం తెలుసుకోమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే రక్తస్రావం ఎక్కువగా కావడం, గడ్డలు గడ్డలుగా కావడం, భరించలేని కడుపు/పొత్తి కడుపు నొప్పి, వికారం, అలసట, చలి, జ్వరం.. వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోమంటున్నారు నిపుణులు. తద్వారా దాని ప్రభావం ఇటు మీపై, అటు కడుపులోని బిడ్డపై పడకుండా ముందే జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
గర్భిణిగా ఉన్నప్పుడు బ్లీడింగ్/స్పాటింగ్ కనిపిస్తే డాక్టర్ సూచించిన మందులు వాడడం, వారు చెప్పిన సలహాలు పాటించడంతో పాటు ఎవరికి వారు స్వయంగా కొన్ని జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..!
⚛ వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది.
⚛ రక్తస్రావం కనిపించినప్పుడు కలయికలో పాల్గొనకపోవడమే మంచిది. ఇలాంటి సందర్భంలో నిపుణుల సలహా తీసుకొని వారు సూచించిన జాగ్రత్తలు పాటించడం అవసరం.
⚛ రక్తస్రావం అవుతున్నప్పుడు ట్యాంపన్లకు బదులుగా శ్యానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగించమంటున్నారు నిపుణులు.
⚛ గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇలా స్పాటింగ్/బ్లీడింగ్ అవుతున్నప్పుడు వర్కవుట్స్ చేయచ్చో, లేదో ఓసారి నిపుణుల సలహా తీసుకొని ఆపై కొనసాగించడం ఉత్తమం.
ఇవన్నీ గుర్తుపెట్టుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్స్, ఏ ఇతర అసౌకర్యం కలిగినా నిపుణుల సహాయం తీసుకోవడం, వారు సూచించిన సలహాలు పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చు.. ఆపై ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.