Updated : 21/07/2021 19:36 IST

టీకా ముందు, తర్వాత గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

కరోనాపై పోరులో భాగంగా గర్భిణులు కూడా టీకా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళలకు కరోనా సోకితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున, అందులోనూ ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ముప్పు ఎక్కువగా ఉన్నందున గర్భిణులు కూడా వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర, ఆరోగ్యశాఖ సూచించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

ఈ జాగ్రత్తలు పాటించండి!

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొందరిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు  తలెత్తడం సహజమే. గర్భిణులకు కూడా ఇది వర్తిస్తుంది. తేలికపాటి జ్వరం, టీకా తీసుకున్న చోట నొప్పి, నీరసంగా అనిపించడం వంటి సాధారణ లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, చేయి/కాళ్లలో వాపు రావడం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. అయితే టీకా ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సాధ్యమైనంతవరకు ఈ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు.

అలర్జీ సమస్యలుంటే ముందే చెప్పేయండి!

* వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఒకరోజు ముందు తగినన్ని నీళ్లు తాగండి. శరీరాన్ని పూర్తి హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి.

* టీకా ముందు రోజు రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుని 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.

* వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెళ్లినప్పుడు వదులుగా ఉన్న దుస్తులనే ధరించండి. ముఖ్యంగా భుజాల వద్ద దుస్తులు బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. దీని వల్ల సులభంగా టీకా తీసుకోవచ్చు.

* గతంలో మందులు, వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు ఏవైనా అలర్జీ సమస్యలు ఇబ్బంది పెట్టి ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సిబ్బందికి ముందుగానే తెలియజేయండి.

* టీకా కేంద్రంలో ఉన్నప్పుడు కరోనా నిబంధనలు పాటించాలి. ముందు జాగ్రత్తగా డబుల్‌ మాస్క్‌ ధరించడం ఎంతో మంచిది. అక్కడి గోడలు, ఉపరితలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు. భౌతిక దూరం పాటించండి.

* వ్యాక్సిన్‌ తీసుకున్న కనీసం 30 నిమిషాల వరకు టీకా కేంద్రంలోనే వేచి ఉండండి. టీకా వల్ల ఏవైనా దుష్ర్పభావాలు కనిపిస్తే మొదటి 30 నిమిషాల్లోనే తెలిసిపోతుంది.

* ఇంటికి చేరుకున్న తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి తగిన మందులు తీసుకోండి.

* టీకా తీసుకున్న రోజంతా విశ్రాంతి తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి.

* ఐరన్, క్యా‌ల్షియం, విటమిన్లు-ఇ, డి, బి 12 సప్లిమెంట్లను తీసుకోండి. దీని వల్ల టీకా వల్ల ఎదురయ్యే సైడ్‌ ఎఫెక్ట్స్‌ నుంచి త్వరగా కోలుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు కచ్చితంగా గైనకాలజిస్టు సలహా తీసుకోవాలి.

* టీకా వేయించుకున్న చోట నొప్పిగా, మంటగా ఉంటే హీట్‌ ప్యాక్‌ అప్లై చేయండి. ఉపశమనం కలుగుతుంది.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, చేయి/కాళ్లలో వాపు రావడం, నొప్పిగా అనిపించడం, టీకా తీసుకున్న చోట చర్మం ఎర్రగా మారడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు కావడం, కళ్లు మసకబారడం లాంటి లక్షణాలు సాధారణ గర్భిణుల్లోనూ ఉంటాయి. అయితే ఈ లక్షణాలు తీవ్రంగా, భరించలేనివిగా ఉంటే మాత్రం వెంటనే గైనకాలజిస్టును సంప్రదించడం మంచిది.

* చివరి త్రైమాసికంలో ఉన్నప్పుడు గర్భంలోని బేబీ కదలికలను గమనిస్తూ ఉండాలి. ఒకవేళ చిన్నారి కదలికల్లో ఏమైనా మార్పులొస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని