పెళ్లికి ముందే వీటికి సిద్ధమవ్వండి!
పురుషులతో పోలిస్తే మహిళలకు పెళ్లంటే కాస్త గాబరాగానే ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగిన అమ్మాయిలు కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తులతో ఇమడాల్సి ఉంటుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు వ్యక్తిగతంగా పలు....
పురుషులతో పోలిస్తే మహిళలకు పెళ్లంటే కాస్త గాబరాగానే ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరిగిన అమ్మాయిలు కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తులతో ఇమడాల్సి ఉంటుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు వ్యక్తిగతంగా పలు సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో మానసికంగా సిద్ధమవ్వాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇవి పెద్దలు కుదిర్చిన పెళ్లికి మాత్రమే కాదు.. ప్రేమ వివాహానికీ వర్తిస్తాయని అంటున్నారు. ఇంతకీ ఏంటవి?
ఈ పట్టుదలే వద్దు!
పెళ్లికి ముందు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత చాలా సందర్భాల్లో జీవిత భాగస్వామి నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో చాలామంది దంపతుల మధ్య వివిధ అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు సరైన నిర్ణయం తీసుకుంటే.. కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి నిర్ణయం సరైంది కావచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఎవరూ సరైన నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకరు తమ నిర్ణయంపై పట్టుబడితే సంసారంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పట్టుదల, మొండితనం వీడి పరిస్థితిని బట్టి సర్దుకుపోవడమే సరైన పద్ధతని సూచిస్తు్న్నారు నిపుణులు. ఇలా సర్దుకుపోయేతత్వం, ఓపిక వహించడం, భాగస్వామికి సర్ది చెప్పే తీరును ముందే అలవర్చుకోవడం మంచిదంటున్నారు.
ఆశలు వద్దు..
చాలామంది పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది సినిమాలు, సీరియళ్లలో వచ్చే సన్నివేశాలను తమకు ఆపాదించుకుంటారు. కానీ, నిజ జీవితంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండచ్చు. అలాగే అత్తమామలకు, మీకు మధ్య పెళ్లైన కొత్తలో ఉండే అనుబంధం తర్వాత్తర్వాత కొనసాగచ్చు.. కొనసాగకపోవచ్చు. ఇలా ఏదీ మన చేతిలో ఉండదు కాబట్టి.. పెళ్లి తర్వాత నా జీవితం ఇలాగే ఉండాలని లేనిపోని అంచనాలు పెట్టుకోకుండా.. వివాహం తర్వాత పరిస్థితుల్ని బట్టి మీ జీవితాన్ని అందంగా అల్లుకోవడం మేలంటున్నారు నిపుణులు. లేదంటే ముందు పెట్టుకున్న అంచనాలు అందుకోక మానసిక ఒత్తిళ్లు, అనుబంధంలో అగాథాలు ఏర్పడే అవకాశాలెక్కువంటున్నారు.
వీటిపై ఏకాభిప్రాయం ముఖ్యం...
దంపతుల ఆలోచనల కంటే.. అలవాట్లలో అభిప్రాయ భేదాలుంటేనే ఎక్కువ ప్రమాదమంటున్నారు నిపుణులు. చాలామంది దంపతుల మధ్య పరిశుభ్రత, ఆహారపుటలవాట్లు భిన్నంగా ఉంటాయి. కొందరు బయటి ఆహారాన్ని ఇష్టపడరు.. కొంతమంది శుభ్రత విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి అంశాల్లో చాలామంది భాగస్వామి కోసం తమ అలవాట్లను అంత సులభంగా మార్చుకోలేరు. ఇవి ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతుంటాయి. వీటి గురించి ఇద్దరు చర్చించుకొని ఒక అభిప్రాయానికి వస్తే కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి, పెళ్లికి ముందే ఈ విషయంలోనూ మానసికంగా సిద్ధమవ్వాలంటున్నారు నిపుణులు. వీలైతే పెళ్లికి ముందే మీ అలవాట్లు, అభిరుచుల గురించి కాబోయే భాగస్వామితో చర్చించాలని సూచిస్తున్నారు.
ఉద్యోగం సంగతేంటి?
ఈ రోజుల్లో ఆర్థిక స్వాతంత్రం కోసం పెళ్లి తర్వాత కూడా ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే కొంతమందికి ఈ విషయంలో తమ జీవిత భాగస్వామి, అత్తమామల నుంచి విమర్శలు ఎదురు కావచ్చు.. కాబట్టి వీటికీ ముందుగానే సిద్ధపడాలి. అలాగే ఉద్యోగం చేసే విషయంలో మీ అభిప్రాయాన్ని ముందే మీ అత్తింటి వారితో స్పష్టంగా చెప్పడం మంచిది. అలాగే కొంతమంది పెళ్లి తర్వాత తమ జీవిత భాగస్వామి కోసం తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. అయితే మీరు మీ భర్త/భార్యతో సమయం గడపడం ఎంత ముఖ్యమో.. మీకంటూ వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.