పిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే..
close
Updated : 30/11/2021 18:42 IST

పిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే..!

ఆరేళ్ల అధిరకు స్నాక్స్‌ అంటే పిచ్చి. ముఖ్యంగా నూనె సంబంధిత పదార్థాలను విచ్చలవిడిగా లాగించేస్తుంటుంది. ఇక బయటికెళ్తే చాలు.. సమోసా, పఫ్‌, పిజ్జా, బర్గర్‌ అంటూ ఏదో ఒకటి కొనిచ్చేదాకా తన పేరెంట్స్‌ని ఓ పట్టాన వదలదు.

పదమూడేళ్ల అమర్‌ చేతిలో ఎప్పుడు చూసినా మొబైల్‌ లేదంటే ల్యాప్‌టాప్‌ ఉండాల్సిందే! ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా వీటితోనే ఎక్కువగా గడపడంతో ఈ మధ్య చాలా బద్ధకంగా తయారయ్యాడు. ఇక ఈ అలవాటు క్రమంగా అతడిని బొద్దుగా మారుస్తోంది.

చెబితే ఓ పట్టాన వినరు కానీ పిల్లల్లో ఉండే ఇలాంటి అలవాట్లే వారిని ఊబకాయులుగా మార్చుతున్నాయని చెబుతోంది ఇటీవలే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHFS). గత ఐదేళ్ల కాలంలో ఈ రేటు 1.3 శాతం పెరిగినట్లు వెల్లడైంది. తద్వారా యుక్తవయసులోనే వారు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా.. వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే చిన్నతనం నుంచే వారికి సంపూర్ణ పోషకాహారం, చక్కటి వ్యాయామం అలవాటు చేయాలని సెంటర్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ సూచిస్తోంది. ఈ క్రమంలో చిన్నారుల బరువు అదుపులో ఉండేందుకు ఈ సంస్థ అందించిన కొన్ని చిట్కాలేంటో తెలుసుకుందాం.

‘ఏంటీ.. ఇంత చిన్న వయసులోనే అంత లావయ్యాడు.. దానికి తోడు ఈ అనారోగ్యాలేంటి..’ అని కొంతమందిని చూసి అనుకుంటాం. నిజానికి పిల్లలు ఎదిగే కొద్దీ వారికి సరైన ఆహారపుటలవాట్లను అలవర్చకపోవడమే వీటికి కారణం అంటున్నారు నిపుణులు. ఇలా చిన్నతనంలో గారాబంగా మనం చేసే కొన్ని అలవాట్లే పెద్దయ్యాక వారిలో స్థూలకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు. అందుకే చిన్నారులు ఏది అడిగితే అది కొనివ్వడం కాకుండా.. వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించాలని చెబుతున్నారు.

అవే కారణమా?!

* పిల్లల ఆహారపుటలవాట్లతో సంబంధం లేకుండా వంశపారంపర్యంగా కూడా వారిలో స్థూలకాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, పాస్తా-ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు అనారోగ్యకరంగా బరువు పెరిగేందుకు కారణమవుతాయట!

* శీతల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుందని.. అలాగే వీటిలో లోలోపలే బ్యాక్టీరియా తయారై అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు.

* వీటితో పాటు వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చొని టీవీ-కంప్యూటర్‌-మొబైల్‌తో గడపడం, ఒత్తిడి-ఆందోళనలు.. వంటివి కూడా వారిలో ఊబకాయానికి దారి తీస్తున్నాయని చెబుతున్నారు.

 

ఆహారంతో ఆరోగ్యం!

* పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే వారికి ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాయగూరలు, పండ్లు, వెన్న తొలగించిన పాలు, పెరుగు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చాలి.

* ఇక ప్రొటీన్‌ కోసం మాంసం, చేపలు, పప్పుధాన్యాలు, బీన్స్‌.. వంటివి ఉండనే ఉన్నాయి.

* బరువు అదుపులో ఉండాలంటే నీళ్లు సరిపడా తాగడం చాలా ముఖ్యం. అయితే ఎంత చెప్పినా ఈ విషయంలో పిల్లలు అస్సలు వినరు. అలాంటప్పుడు నీళ్లను రుచిగా అందించడం కోసం నిమ్మరసం-తేనె, పండ్ల ముక్కలు, తులసి-పుదీనా ఆకులు.. వంటివి కలిపిన నీళ్లు వారికి అందించాలి.. అలాగే కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, స్మూతీస్‌.. వంటివీ వారి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తోడ్పడతాయి.

* శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌.. వంటివి పిల్లలు ఇష్టంగా తింటుంటారు. వాటి విషయంలో ఆంక్షలు విధిస్తే పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి తరచూ కాకుండా ఎప్పుడో ఒకసారి వీటిని వారికి అందించి సంతృప్తిపరచచ్చు.

* ఇక స్నాక్స్‌ సమయంలో ఎప్పుడూ నూనెలో వేయించిన పకోడీ-బజ్జీలు, ఛాట్స్‌, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్‌.. వంటివి కాకుండా పండ్ల ముక్కలు అందించచ్చు. అయితే ఇవి కూడా వారికి ఇష్టమైన బొమ్మల రూపంలో కట్‌ చేసి ఇస్తే తప్పకుండా తింటారు.

* అలాగే నూనె తక్కువగా ఉపయోగించి చేసే పాప్‌కార్న్‌, వేయించిన నట్స్‌, ఓట్‌మీల్‌.. వంటి వాటినీ అప్పుడప్పుడూ స్నాక్స్‌గా, భోజనానికి మధ్యలో అందించచ్చు. తద్వారా వారికి ఆకలేసి ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడచ్చు.

* పిల్లలు ఫిట్‌గా, బరువు పెరగకుండా ఉండాలంటే వారికి వ్యాయామం కూడా అవసరమే. అందుకే మీతో పాటు వారినీ రోజువారీ వ్యాయామాల్లో భాగం చేయడం మర్చిపోవద్దు. తద్వారా ఆరోగ్యానికే కాదు.. మానసికంగానూ వారు యాక్టివ్‌గా ఉంటారు.

* గంటల తరబడి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల కూడా పిల్లల్లో బద్ధకం ఆవహిస్తుంది. కాబట్టి వారికి నచ్చిన ఆటలు, ఇతర వ్యాపకాల్లో వారిని భాగం చేయడం వల్ల వారు చురుగ్గా మారతారు. ఇదీ వారి బరువు అదుపులో ఉండేందుకు ఓ మార్గమే!

ఇలా వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రాత్రుళ్లు వారికి నిద్ర కూడా చక్కగా పడుతుంది. తద్వారా వారు ఆరోగ్యంగా, బరువు పెరగకుండా ఉంటారు. అయితే ఇవన్నీ పిల్లలతో నేరుగా అలవాటు చేయిస్తే వారు పాటించకపోవచ్చు. కాబట్టి అది ఆహారమైనా, వ్యాయామమైనా.. ఇటు మీరు చేస్తూనే.. అటు పిల్లలతో చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.. కావాలంటే ప్రయత్నించి చూడండి!


Advertisement

మరిన్ని