Published : 20/01/2023 21:17 IST

Priyanka Chopra : అందుకే సరోగసీని ఎంచుకున్నా!

(Photos: Instagram)

అమ్మతనం మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. పిల్లల ఆలనా పాలన చూసుకోవడంతో పాటు మనకంటూ వ్యక్తిగతంగా కాస్త సమయం కేటాయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మాల్తీ పుట్టాక తన జీవితంలోనూ ఇలాంటి మార్పులెన్నో చోటుచేసుకున్నాయంటోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. గతేడాది జనవరిలో సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చిన నిక్‌-ప్రియాంక జంట.. మేలో ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు. అయితే ఈ మూడు నెలల వ్యవధిలో తన జీవితంలో అత్యంత ప్రతికూల సమయాన్ని ఎదుర్కొన్నానంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది పీసీ. ఇక తాను అమ్మనవడానికి అద్దెగర్భాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కూడా వెల్లడించి.. తనపై వస్తోన్న విమర్శల్ని సున్నితంగా తిప్పికొట్టిందీ అందాల తార.

ప్రియాంక చోప్రా-నిక్‌ జొనాస్‌ దంపతులకు గతేడాది జనవరిలో మాల్తీ మేరీ చోప్రా జొనాస్‌ అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే! అయితే తల్లైనప్పట్నుంచి ఎక్కువ సమయాన్ని తన పాపాయి సంరక్షణకే కేటాయిస్తోన్న పీసీ.. ఈ క్రమంలో తన చిన్నారితో దిగిన ప్రతి ఫొటోను, గడిపిన ప్రతి సందర్భాన్నీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోతుంది. ఇక ఇటీవలే తన ముద్దుల కూతురితో కలిసి ప్రముఖ పత్రిక ‘బ్రిటిష్‌ వోగ్‌’ ముఖ చిత్రంపైనా మెరిసిందీ అందాల తార. తద్వారా ఈ కవర్‌ పేజీపై మెరిసిన తొలి భారతీయ నటిగానూ గుర్తింపు సంపాదించుకుందీ గ్లోబల్‌ స్టార్‌.

అప్పుడే నాకు ఆనందం!

వృత్తికే అత్యంత ప్రాధాన్యమిచ్చి.. గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌, హాలీవుడ్‌లో బిజీగా గడుపుతూ వచ్చిన పీసీ.. అమ్మతనం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటోంది. వ్యక్తిగత జీవితంలో ఉన్న మాధుర్యాన్ని ఈ దశ తనకు చేరువ చేసిందని చెబుతోంది.

‘20 ఏళ్లుగా పని పని అంటూ పని వెంటే పరుగు పెట్టా. ఒక ప్రాజెక్ట్‌ పూర్తి కాగానే.. తర్వాతేం చేయాలి? అన్న ఆలోచనలోనే ఉండేదాన్ని. కానీ అమ్మనయ్యాక ఈ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితానికీ సమప్రాధాన్యమివ్వాలన్న విషయం మాల్తీ పుట్టాకే నాకు అర్థమైంది. అప్పట్నుంచి నేను ఆచితూచి అడుగేస్తున్నా.. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. తన విషయంలో అత్యంత జాగ్రత్తగా, శ్రద్ధగా నిర్ణయాలు తీసుకుంటున్నా. నేను ఏ పనిలో ఉన్నా తనను నిరంతరం పర్యవేక్షించడానికి వీలుగా తన గదిలో ఏడు కెమెరాలు అమర్చుకున్నా. అయినప్పటికీ.. నేరుగా తన కళ్లలోకి చూసినప్పుడు కలిగే ఆనందం, సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే..!’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ.

‘రెడీమేడ్‌ బేబీని తెచ్చుకుంద’న్నారు!

పలు సమస్యల కారణంగా స్వయంగా అమ్మతనాన్ని పొందలేని మహిళలకు అద్దెగర్భం వరంగా మారిందని చెప్పచ్చు. అయితే కొంతమంది సెలబ్రిటీలు దీన్ని ఎంచుకొని విమర్శల పాలవుతుంటారు. ఈ జాబితాలో ప్రియాంక కూడా ఒకరు. అయితే తాను సరోగసీని ఎంచుకోవడం వెనుక పలు కారణాలూ లేకపోలేదంటోందీ గ్లోబల్‌ బ్యూటీ.

‘పాప పుట్టిన విషయాన్ని అందరితో పంచుకుంటూ ఎంతగానో మురిసిపోయాం. కానీ ఆ తర్వాత కొంతమంది చేసిన విమర్శలు నన్ను బాధించాయి. రెడీమేడ్‌ బేబీని తెచ్చుకుందని మనసును గుచ్చుకునే మాటలు అన్న వారూ లేకపోలేదు. అయినా చాలా రోజులు ఈ బాధను లోలోపలే భరించా. కానీ ఇక దాచడం అనవసరమనిపించింది. ఎందుకంటే నా గురించి, అభం శుభం తెలియని నా పాప గురించి నలుగురూ ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయా. ఒక తల్లిగా ఇలాంటి విమర్శలు, గాసిప్స్‌ నుంచి తనను బయటపడేయాలనుకున్నా.. పైగా ఇది మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం! అందుకే నిజం చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది. అయితే పిల్లల కోసం ప్రయత్నించే క్రమంలో నాకు ఆరోగ్య పరంగా పలు సమస్యలు తలెత్తాయి. అందుకే అద్దెగర్భాన్ని ఆశ్రయించక తప్పలేదు. ఏదేమైనా.. ఇతరుల వ్యక్తిగత సమస్యలు తెలుసుకోకుండా.. నిరాధార వార్తలు పుట్టించడం, వారిని విమర్శించడం సరికాదు..’ అంది పీసీ.

వంద రోజులు ఎన్‌ఐసీయూలోనే..!

అయితే గతేడాది జనవరిలోనే తమకు పాప పుట్టినా.. పీసీ-నిక్‌ దంపతులు ఈ విషయాన్ని అధికారికంగా పంచుకుంది మాత్రం మేలోనే! అయితే తమ చిన్నారి నెలలు నిండకముందే జన్మించడంతో.. ఈ మూడు నెలలు తమ జీవితంలో అత్యంత ప్రతికూల సమయాన్ని ఎదుర్కొన్నామంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

‘మాల్తీ నెలలు నిండకముందే పుట్టింది. ఏడో నెలలోనే గర్భం నుంచి బయటికొచ్చింది. ఆ సమయంలో తానెంత చిన్నగా ఉందంటే.. నా అరచేతిలో తన శరీరం ఇమిడిపోయేంతగా..! దాంతో తనను వెంటనే ఇంక్యుబేటర్‌లో పెట్టి చికిత్స అందించారు. ఆ సమయంలో డాక్టర్లు, నర్సులు ఎంతగానో కష్టపడ్డారు. అలా తాను పుట్టాక వంద రోజులు ఆస్పత్రిలో ఎన్‌ఐసీయూలోనే ఉంది. ఆపై పూర్తి ఆరోగ్యంగా అయ్యాకే తనను ఇంటికి తీసుకొచ్చాం.. నిజానికి ఈ మూడు నెలలు మా జీవితాల్లోనే అత్యంత క్లిష్టమైన సమయం!’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని