Open Plan Office : ఆఫీసు రూపురేఖలు మారిపోతున్నాయ్!
సాధారణంగా ఆఫీస్‌లో ఎవరి క్యాబిన్ వారికే ఉంటుంది. సమయానికి వచ్చామా, పని పూర్తిచేసుకున్నామా, ఇంటికెళ్లామా.. చాలామంది ఉద్యోగులు ఇదే పంథాను అనుసరిస్తుంటారు. కొంతమంది ‘మా పని మాది.. సహోద్యోగులతో సంబంధం లేద’న్నట్లుగా.....
సాధారణంగా ఆఫీస్‌లో ఎవరి క్యాబిన్ వారికే ఉంటుంది. సమయానికి వచ్చామా, పని పూర్తిచేసుకున్నామా, ఇంటికెళ్లామా.. చాలామంది ఉద్యోగులు ఇదే పంథాను అనుసరిస్తుంటారు. కొంతమంది ‘మా పని మాది.. సహోద్యోగులతో సంబంధం లేద’న్నట్లుగా వ్యవహరిస్తారు. అయితే దీనివల్ల ఇటు వ్యక్తిగత కెరీర్‌కు, అటు కంపెనీ ఉత్పాదకతకు.. రెండింటికీ నష్టమేనంటున్నారు నిపుణులు. అందుకే ఇలా జరగకుండా ఉండేందుకే చాలా కంపెనీలు ఈ రోజుల్లో ‘ఓపెన్ ప్లాన్ ఆఫీస్’ పద్ధతిని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. సూక్ష్మ, మధ్య తరహా సంస్థల్లో ఎక్కువగా ఈ తరహా పని పద్ధతిని మనం చూడచ్చు. మరి, ఇంతకీ ఏంటీ ‘ఓపెన్ ప్లాన్ ఆఫీస్’? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..
కెరీర్ అంటే చేసే పని ఒక్కటే కాదు.. సహోద్యోగులతో కమ్యూనికేషన్ పెంచుకోవడం, కొత్త కొత్త ఐడియాలు అందరూ కలిసి పంచుకోవడం, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే! ఇవన్నీ ఏకకాలంలో జరిగినప్పుడే ఓ బాధ్యత గల ఉద్యోగిగా సంస్థ ఉత్పాదకతను పెంచచ్చు. ఇదే పరోక్షంగా మీ కెరీర్ ఉన్నతికీ దోహదం చేస్తుంది. ఇందుకోసమే ఇప్పుడు చాలా సంస్థలు తమ రూపురేఖలు మార్చుకొని ఓపెన్ ప్లాన్ ఆఫీస్‌కు తెరతీస్తున్నాయి.
ఇంతకీ ఏంటీ పని విధానం?
వ్యక్తిగత క్యాబిన్లకు బదులుగా అందరూ ఒక్క చోట కూర్చొని పనిచేయడమే దీని ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఎలాంటి అడ్డుతెరలతో పని లేకుండా ఒక విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఇక్కడే ఉద్యోగులంతా కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒకరికొకరు కనిపిస్తారు.. ఒకరు చేసే పని మరొకరికి తెలుస్తుంది.. అవసరమైనప్పుడు చర్చలూ జరుగుతాయి. సూటిగా చెప్పాలంటే.. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ ఒక్కచోట చేరి ఎలాగైతే మీటింగ్ పెట్టుకుంటారో.. ఇక్కడా అలాగే కూర్చొని పనిచేస్తారన్నమాట!
ఎలాంటి ప్రయోజనాలున్నాయ్?!
❖ ఇలా అందరూ ఒకే చోట కలిసి కూర్చోవడం వల్ల పనిలో ఏవైనా సందేహాలుంటే అక్కడిక్కడే నివృత్తి చేసుకోవచ్చు. అలాగే సమావేశం కోసం బృందమంతా ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పని ఉండదు. ఏవైనా కొత్త ఆలోచనలుంటే.. అటు పనిచేస్తూనే ఇటు టీమ్‌తో పంచుకోవచ్చు. దీనివల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది.
❖ ఓపెన్ ప్లాన్ ఆఫీస్‌లో భాగంగా.. బాస్ దగ్గర్నుంచి సాధారణ ఉద్యోగి దాకా అందరూ కలిసే కూర్చుంటారు. ఇది వాళ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎలాంటి ఆలోచననైనా నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. దీనివల్ల పనితీరు, ఉత్పాదకత కూడా మెరుగవుతాయి.
❖ అవి ఆలోచనలైనా, తీసుకునే నిర్ణయాలైనా.. అందరూ కలిసి పంచుకోవడం వల్ల ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. కెరీర్‌లో ఉన్నతి సాధించడానికి ఇదీ ముఖ్యమేనంటున్నారు నిపుణులు.
❖ ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీమ్ అంతా ఒకే చోట కలిసి కూర్చొని పనిచేయడం వల్ల.. దానిలో ఉన్న లోపాలు, మధ్యమధ్యలో తలెత్తే సమస్యలు-సవాళ్లు.. వంటివన్నీ మరింత వేగంగా పరిష్కారమవుతాయంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించిన పూర్తి అవగాహన ఆ బృంద సభ్యులకు ఉండడమే కారణమంటున్నారు.
❖ వ్యక్తిగత క్యాబిన్లలో కూర్చొని పనిచేయడం కంటే.. ఇలా కలిసి కూర్చొని పనిచేయడం వల్ల పనిపై ఆసక్తి పెరుగుతుంది.. బోర్ ఫీలింగ్ అసలే రాదు.. తద్వారా ఇతరులకంటే మరింత మెరుగ్గా రాణించాలన్న తపన మన ఐడియాలజీని పెంచుతుంది. ఇది వ్యక్తిగతంగా, కంపెనీకి.. ఇలా రెండు విధాలుగా మేలు చేస్తుంది.
❖ ఏ రంగంలోనైనా, ఏ పనిలోనైనా ఒత్తిడిని ఎదుర్కోవడం కామనైపోయింది. అయితే విడివిడిగా పనిచేయడానికి బదులు.. ఇలా అందరితో కలిసి పనిచేయడం వల్ల ఈ ఒత్తిడి ప్రభావం మనపై అంతగా ఉండదంటున్నారు నిపుణులు. ఫలితంగా సమయమే తెలియకుండా పనిలో ముందుకు దూసుకుపోవచ్చు. ఇలా ఈ పని విధానంతో మానసికంగా, ఆరోగ్యపరంగా.. రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
❖ కొంతమంది ఉద్యోగులు అందరితో సులభంగా కలిసిపోలేరు.. ఐడియాస్‌ని ఓపెన్‌గా పంచుకోలేరు. అలాంటి వారికి ఈ పనివిధానం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా వారు వ్యక్తిగతంగా మెరుగవ్వచ్చు.. పనిలో నైపుణ్యాల్నీ పెంచుకోవచ్చు. అంతిమంగా ఇది వారి ఉన్నతికి బాటలు వేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
కంపెనీకీ మేలు!
ఓపెన్ ప్లాన్ ఆఫీస్ వల్ల ఉద్యోగులకే కాదు.. కంపెనీకీ మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. అందరూ కలిసి కూర్చోవడం వల్ల వ్యక్తిగత క్యాబిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం అదనంగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అలాగే అందరూ కలిసి కూర్చోవడం వల్ల ఉద్యోగులు మరింత ఆసక్తితో పనిచేయగలుగుతారు.. సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయాల్ని పంచుకోగలుగుతారు. ఫలితంగా సంస్థ ఉత్పాదకత మెరుగవుతుంది. ఇదీ సంస్థ ఉన్నతికి కలిసొచ్చే అంశమే!
ఇలా అయితే కొంత నష్టమే.. కానీ!
అయితే ఈ ఓపెన్ ప్లాన్ ఆఫీస్ పని విధానం వల్ల పలు నష్టాలూ లేకపోలేదంటున్నారు నిపుణులు.
❖ ముఖ్యంగా దీనివల్ల ఇతరుల పనికి అంతరాయం కలగచ్చు. అంటే.. ఇద్దరు ఉద్యోగులు ఓపెన్‌గా పని గురించి చర్చించుకోవడం వల్ల.. మూడో వ్యక్తి పని డిస్టర్బ్ అవుతుంటుంది. తద్వారా సమయం వృథా! అయితే ఇలాంటప్పుడు నాయిస్-ఫ్రీ హెడ్‌ఫోన్స్ కొంత వరకు మేలు చేస్తాయి.
❖ సహోద్యోగులు తమ పనిని గమనిస్తుంటే కొంతమందికి నచ్చదు. దీనివల్ల పదే పదే అసౌకర్యానికి లోనవుతుంటారు. అందరూ కలిసి కూర్చొని పని చేసే చోట ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంటుంది. అయితే అన్ని చోట్లా ఇలా పనిచేస్తానంటే కుదరకపోవచ్చు. కాబట్టి ఆఫీస్ పని వాతావరణానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుంటే ఇదేం పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.