ఒకేసారి రెండు ఉద్యోగాలు.. మంచిదా? కాదా?!
‘రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదకరం’ అంటుంటారు. వృత్తి ఉద్యోగాల్లోనూ ఈ నియమం వర్తిస్తుంది. అంటే.. ఒ
‘రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదకరం’ అంటుంటారు. వృత్తి ఉద్యోగాల్లోనూ ఈ నియమం వర్తిస్తుంది. అంటే.. ఒకేసారి రెండు ఉద్యోగాలు.. అది కూడా రహస్యంగా చేయడం అన్నమాట! అయితే కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి పని విధానం పెరిగినప్పట్నుంచి ఈ ట్రెండ్ మళ్లీ తెరపైకి వచ్చిందంటున్నారు నిపుణులు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ ఉపాధి మార్గాన్ని అనుసరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి, ఇంతకీ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం మంచిదా? కాదా? దీనివల్ల కలిగే లాభనష్టాలేంటి? ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..
మరిన్ని డబ్బులు సంపాదించాలనో, ఒక ఉద్యోగం పోయినా మరో ఉద్యోగం ఉంటుందన్న భరోసాతోనో, అదనపు నైపుణ్యాలు అందిపుచ్చుకోవచ్చనో.. ఇలా కారణమేదైనా కొంతమంది ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తుంటారు. అది కూడా ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ పాలసీలకు విరుద్ధంగా, రహస్యంగా మరో కంపెనీలో విధులు నిర్వర్తిస్తుంటారు. కరోనా ముందు వరకు ఈ ట్రెండ్ అడపాదడపా కనిపించినా.. లాక్‌డౌన్‌లో ఎక్కువమంది ఇంటి నుంచే పనిచేయడంతో ఇది మరింత అధికమైందంటున్నారు నిపుణులు.
మొదటికే మోసం రావచ్చు!
* పార్ట్‌టైమ్ అయినా, ఫుల్‌టైమ్ అయినా.. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడమంటే వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ రిస్కే! డబ్బు సంపాదన వరకు బాగానే ఉన్నా.. గంటల తరబడి పనితో మమేకమవడమంటే.. ఒత్తిడితో సావాసం చేసినట్లే అంటున్నారు నిపుణులు. తద్వారా శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గానూ పలు సమస్యలు తప్పవంటున్నారు.
* రెండు ఉద్యోగాలు చేసే క్రమంలో.. కొంతమంది రోజంతా పనిచేసి, మరో ఉద్యోగాన్ని నైట్‌షిఫ్ట్‌లో చేస్తుంటారు. వీటికి తోడు ఇంటి పని.. ఇలాంటి తీరికలేని జీవనశైలి దీర్ఘకాలం పాటు కొనసాగితే శారీరక అలసట, నిద్రలేమి.. వంటి సమస్యలొస్తాయి. వీటి ప్రభావం అంతిమంగా పడేది పని పైనే!
* శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ పనైనా చురుగ్గా చేయగలం.. మెదడూ అంతే ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం వల్ల ఇవి లోపిస్తాయి. ఫలితంగా ఏ పని పైనా శ్రద్ధ పెట్టలేం అంటున్నారు నిపుణులు.
* తెలిసి తెలిసి తప్పు చేస్తే.. దాని ప్రభావం మనం వేసే ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. అదే మనం పని చేస్తోన్న కంపెనీ నియమాలకు వ్యతిరేకంగా మరో ఉద్యోగాన్ని ఎంచుకుంటే.. దాన్ని ఎవరు పసిగడతారోనన్న భయంతో ఏ పని పైనా శ్రద్ధ పెట్టలేం. ఈ భయమే నిజమైతే మొదటికే మోసం రావచ్చు. అంటే మొదటి కంపెనీలో మీ ఉద్యోగానికే ముప్పు రావచ్చన్నమాట!
* రెండు ఉద్యోగాలు ఇంటి నుంచైతే ఎలాగోలా మేనేజ్ చేయచ్చనుకుంటారు చాలామంది. అదే ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయి.. రెండోది కార్యాలయానికి వెళ్లాల్సొచ్చినా.. రెండూ వేర్వేరు కార్యాలయాల్లో చేయాల్సి వచ్చినా.. ప్రయాణ పరంగా కూడా పలు ఇబ్బందులు ఎదురుకావచ్చు.
వాళ్లకు చెప్పి చూడాలి..
తమ కంపెనీలో ఫుల్‌టైమ్ ఉద్యోగిగా కొనసాగుతూ.. మరో కంపెనీలో ఉద్యోగం చేస్తానంటే సాధారణంగా ఏ కంపెనీ ఒప్పుకోదు. ఇందుకు అనుగుణంగానే ప్రతి కంపెనీ నియమ నిబంధనలు రూపొందించుకుని, సదరు ఉద్యోగి సంస్థలో చేరేటప్పుడే దానికి సంబంధించిన బాండ్ రాయించుకుంటుంది లేదా సంతకాలు పెట్టించుకుంటుంది. అయితే వ్యక్తిగత కారణాలు, ఆర్థిక సమస్యల రీత్యా కచ్చితంగా రెండు ఉద్యోగాలు చేయాల్సొచ్చినప్పుడు.. మొదటి ఉద్యోగానికి ముప్పు రాకుండా ఉండాలంటే ఓ మార్గం ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. మీ మొదటి ఉద్యోగానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే.. రెండో ఉద్యోగాన్ని పార్ట్‌టైమ్‌గా, అదీ వారాంతాల్లో చేసేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అందుకు కూడా మీ హెచ్‌ఆర్ హెడ్‌తో ఓసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మొదటి కంపెనీలో చేసే పనికి ఎలాంటి అంతరాయం కలగదన్న భరోసా, హామీ రాతపూర్వకంగా మీరు వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఎందుకంటే మీ రహస్య ఉద్యోగం గురించి మూడో వ్యక్తి ద్వారా తెలియడం కంటే ఇలా ముందు మీరే నేరుగా ఓ మాట చెప్పి ఉంచడం ఉత్తమం కదా!
ప్రయోజనాలేమిటి?
* ఎప్పుడూ ఏదో ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలన్న ఆరాటం ఉంటుంది కొందరికి. ఈ క్రమంలో రెండో ఆప్షన్‌గా ఫుల్‌టైమ్ కాకపోయినా పార్ట్‌టైమ్ ఉద్యోగమైనా వెతుక్కుంటుంటారు. ఇలా దీనివల్ల పొందిన నైపుణ్యాలు ఫుల్‌టైమ్ ఉద్యోగంలో ఉపయోగించుకుంటే కెరీర్‌కి ప్లస్ అవుతుందంటున్నారు నిపుణులు.
* ఇష్టపడి రెండు రకాల పనులు చేయడం వల్ల ఉద్యోగ సంతృప్తి ఎక్కువవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. ఒక ఉద్యోగం పోయినా.. మరొకటి ఉంటుందన్న భరోసాతో ఒత్తిడి దరిచేరే అవకాశాలు తక్కువగా ఉంటాయట. ఇది మానసికంగా సానుకూల పరిణామమే అంటున్నారు నిపుణులు.
* ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల కష్టపడే తత్వం అలవడుతుందంటున్నారు నిపుణులు. అలాగే స్వీయ ప్రోత్సాహం రెట్టింపై.. ఏ కంపెనీలోనైనా, ఎలాంటి పని వాతావరణంలోనైనా సులభంగా ఇమడగలుగుతారు.
ఈ క్రమంలో- ఆర్ధిక అవసరాల నిమిత్తమో, మరో కారణం చేతనో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పని చేయాలనుకున్నప్పుడు- ఫుల్ టైం ఉద్యోగానికి బదులు సాధ్యమైనంత వరకు పార్ట్‌టైమ్/ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.
మరి, ఈ విషయంలో మీరేమంటారు? మీ అభిప్రాయాలు, సలహాలు Contactus@vasundhara.net ద్వారా పంచుకోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.