Published : 27/03/2023 00:04 IST

Psychologist: ఏ పనీ చేయదు!

మా చెల్లెలు భర్తతో విడిపోయింది. తనకు పదేళ్ల కూతురుంది. నాన్న ఈమధ్యే చనిపోయారు. అమ్మకు వచ్చే పెన్షన్‌తోనే నెట్టుకొస్తున్నారు. పాప కోసమైనా చెల్లెలు ఉద్యోగం చేయాలి కదా! అమ్మా, నేనూ చెప్పబోతే ఏడుస్తుంది. తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

ఆర్థిక ఇబ్బందుల గురించి తనకు తెలియాలి. చెప్పినా వినడం లేదంటే బాధ్యతల పట్ల శ్రద్ధాసక్తులు లేవు. కారణం బద్ధకమో, మానసిక వ్యాధో అయ్యుండొచ్చు. లేదా భర్తతో విడిపోవడం వల్ల కలిగిన ఆందోళన కావచ్చు. ఆమె పెళ్లి చేసుకునే సమయంలో ఎలా ఉంది, ఏ కారణాలతో భర్త నుంచి విడిపోయింది అనేదాన్ని బట్టి ఆమె ప్రవర్తనను అంచనా వేయగలం. అంటే పెళ్లికి ముందు ఆమెది మొండివైఖరి, దెబ్బలాడే తత్వమా? సహజంగానే సోమరితనం, పనులంటే అయిష్టత, నిర్లక్ష్య ధోరణి ఉన్నాయా? పెళ్లి చేసుకున్నప్పటికీ అదే వ్యక్తిత్వం ఉండటంతో ఇద్దరికీ పొసగక వచ్చేసిందా? లేదా అతడి స్వభావం మంచిది కాక డిప్రెస్‌ అయ్యిందా? విడిపోయినందున బాధ తీవ్రమై అయోమయంగా, బాధ్యతారహితంగా ఉంటోందా? సైకోసిస్‌ లాంటి సమస్య తలెత్తితే ఉద్యోగం చేయాలనే ఉత్సాహం ఉండదు.

ఏదేమైనా డిప్రెషన్‌తో బాధపడేవారు దేనిమీదా ఆసక్తి చూపరు. ఇంకొకరి మీద ఆధారపడి జీవిస్తూ దుఃఖంలోనే ఉంటారు. మీరు సైకియాట్రిస్టును సంప్రదించండి. ఏ కారణం వల్ల అనేది తెలుసుకుని మందులు, కౌన్సెలింగ్‌ ఇస్తారు. మానసిక స్థితిలో మార్పు వచ్చాక పనిలో చేరేట్టు చేయొచ్చు. ఒకవేళ సోమరితనమే కారణమైతే మోటివేషన్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌తో వాళ్లకు ఇష్టమైన పనులు చేయమని ఉత్సాహపరుస్తూ, వాటికి తగిన ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నించవచ్చు. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలకు పనులు అలవాటు చేయకున్నా, చేస్తున్నప్పుడు వంకలుపెడుతూ నిందించినా పని చేయాలన్న ఉత్సాహం కొరవడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని