Updated : 30/01/2023 01:01 IST

తెలిసీ రెండో పెళ్లి!

నా స్నేహితురాలు ఆర్థిక సమస్యల వల్ల రెండో భార్యగా వెళ్లింది. తన ఇద్దరు పిల్లలనే తప్ప మొదటి భార్య కొడుకుని పట్టించుకోదు. తిండి కూడా సరిగా పెట్టదు. తెలిసే చేసుకుని ఇలా ప్రవర్తించడం అన్యాయం కదా! ఆమె మారాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

కొందరంతే.. నియమబద్ధంగా ఉండరు. స్వార్థంగా ఆలోచిస్తారు. ఆమె తప్పనిసరై పిల్లలున్న వ్యక్తిని ఒప్పుకొని ఉంటుంది. అలాంటప్పుడు పిల్లాడి మీద సానుభూతి ఉండదుగా! సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చేసుకున్నా.. మనసులో రెండో సంబంధమనే అయిష్టత, అసంతృప్తి ఉండి ఉంటాయి. ఆమె ఉద్దేశాలూ, లక్ష్యాలూ వేరుగా ఉండొచ్చు. రక్తసంబంధం కనుక తన పిల్లల మీదే ప్రేమ చూపుతోంది. సవతి కొడుకు మీద ఖర్చుపెట్టడం నచ్చక దూరంపెడుతూ అనాథలా చూస్తుండొచ్చు. నైతికంగా ఇది సరికాదు. కానీ ఆమెనెటూ మార్చలేరు కనుక తప్పుపట్టీ ప్రయోజనం లేదు. దానికి బదులు ఆ పిల్లాణ్ణి దగ్గరకు తీయండి. చదువుకోమని ప్రోత్సహిస్తూ, మంచి మార్కులొస్తే మెచ్చుకుంటూ ఒంటరితనం లేకుండా చూడండి. మీ పిల్లలు లేదా చుట్టుపక్కల పిల్లలతో అతడికి స్నేహం ఏర్పరిస్తే మానసిక ధైర్యం చేకూరుతుంది. అతడు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి కోసం ప్రయత్నించేలా ఊతమివ్వండి. అప్పుడు నిబ్బరంగా ఉంటాడు. ఇలా ఆమెకి అనుమానం రాకుండా మీరు చేయగలిగిన సాయం చేయండి. ఆమె వైఖరి భర్తకి తెలిసినా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. అందువల్ల ఈ విషయాలు బయటవాళ్లు ప్రస్తావించడం మంచిది కాదు. ఆమె ఇంకా కోపం పెంచుకుంటే పిల్లాడు మరింత అన్యాయమవుతాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం