ఆటవిడుపుతో.. ఆనందంగా

జీవితం సుఖంగా, శాంతంగా గడిచేందుకు మన పెద్దవాళ్లని మార్గదర్శకంగా  తీసుకుంటాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటాం. అయినా ఒక్కోసారి అసహనంగా, నిర్వేదంగా అనిపిస్తుంది.

Published : 13 Feb 2023 00:45 IST

జీవితం సుఖంగా, శాంతంగా గడిచేందుకు మన పెద్దవాళ్లని మార్గదర్శకంగా  తీసుకుంటాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటాం. అయినా ఒక్కోసారి అసహనంగా, నిర్వేదంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కుంగిపోకుండా దిగులుకు కారణాలేంటో అన్వేషించాలి. వాటిని చక్కబెట్టుకోవడంతో బాటు తిరిగి యథాస్థితికి రావడానికి మనోవైజ్ఞానికులు సూచిస్తున్న ఈ సలహాలు పాటించి చూడండి..

* పరిస్థితులు సజావుగానే ఉన్నా అంతరంగంలో ఏదో తెలియని అలజడి కలుగుతోందంటే.. అది తప్పకుండా శారీరక, మానసిక అలసటే. మీకు మీరే విశ్రాంతి ప్రకటించుకోండి. కొన్ని రోజులు సేదతీరితే అంతా అదే చక్కబడుతుంది. ఇల్లాలు శ్రమించందే రోజు గడవదు కదా అనుకుని బాధ్యతలన్నీ అలాగే నిర్వహించారంటే ఆరోగ్యంపాడై, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

* ఎప్పుడూ పనులే కాదు.. ఆటవిడుపూ కావాలి. అందుకోసం మీ మనసుకు నచ్చే వ్యాపకాలను ఎంచుకోండి. నిజానికి అవి కూడా పనులే.. కానీ అవి బరువనిపించక హాయినిస్తాయి. అలా కాలక్షేపం చేయడం వల్ల యాంత్రికత పోయి ఉల్లాసంగా ఉంటుంది.

* తరచూ బంధుమిత్రులతో ఫోన్‌లో మాట్లాడుతుండండి. వీలైనప్పుడు కలవొచ్చని వాయిదాలు వేయకుండా అప్పుడప్పుడూ అవకాశం కల్పించుకుని వాళ్ల ఇళ్లకు వెళ్లడం, మీ ఇంటికి ఆహ్వానించడం చేయండి. మనసుకు దగ్గరైన వాళ్లతో కబుర్లు ఒత్తిడి తగ్గిస్తాయి. వారి మాటల్లో ఒక్కోసారి మీ సమస్యలకు పరిష్కారాలూ దొరుకుతాయి.

* మనసు చిరాగ్గా ఉన్నప్పుడు పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు శ్వాసనే గమనిస్తూ నిద్రకు ఉపక్రమించండి. గదిలో పరిమళాలు వెదజల్లే అగరొత్తులు వెలిగించారంటే మరింత త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

* జంతువులతో కాలక్షేపం ఆందోళనలను దూరం చేస్తుంది. కుక్కనో, పిల్లినో, పావురాన్నో, కుందేలునో పెంచుకోండి. అలా కుదరదనుకోండి.. వీధిలో కనిపించిన ఆవుకు నాలుగు అరటిపండ్లు తినిపించండి. లేదా కుక్కపిల్లకు బిస్కెట్లు పెట్టండి. విచారం మాయమై మాటలకందని అనుభూతి మీ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్