Published : 04/08/2022 21:40 IST

మా ఆయన కోపాన్ని భరించలేకపోతున్నా.. విడిపోవాలనుంది..!

హాయ్‌ మేడమ్‌... నాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. పాప, బాబు ఉన్నారు. నా భర్తకి చిన్న విషయానికే కోపం వచ్చేస్తుంటుంది. మొదటి నుంచి అంతే. కోపంలో బూతులు తిడతాడు. ఎక్కడున్నా సరే నన్ను, మా కుటుంబ సభ్యులను చులకన చేసి మాట్లాడతాడు. ఎన్ని విధాలుగా చెప్పినా అలాగే చేస్తాడు. ఒక్కోసారి నాకు తన నుంచి విడిపోవాలనిపిస్తుంది. కానీ నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో? అని ఆగిపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నన్ను హేళనగా మాట్లాడని రోజు లేదు. అతన్ని ఎలా మార్చుకోవాలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. అతని కోపం, ఆవేశం, నోటి దురుసు వంటి విషయాల గురించి ఈపాటికి మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి అతను మాములుగా ఉన్నప్పుడు దానివల్ల కలిగే నష్టం గురించి వివరించే ప్రయత్నం చేయండి. తనకు కోపం వచ్చినప్పుడు దూకుడుగా వ్యవహరించకుండా.. సాధారణంగా ఉన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు అలా ప్రవర్తించాడు అనేది కూడా విశ్లేషించండి. దానికి ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే కోపం వచ్చినా సౌమ్యంగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయండి.

మీ భర్త కోపాన్ని నియంత్రించడానికి మానసిక నిపుణుల సహాయం తీసుకొని, తనకు తాను నియంత్రించుకునే పద్ధతుల గురించి విడమరిచి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. అతని కోపం, నోటి దురుసుతనం వల్ల పిల్లలకు కలిగే నష్టాలు, దుష్పరిణామాల గురించి కూడా వివరించే ప్రయత్నం చేయండి. నిరంతరం చేసే ధ్యానం, యోగా వంటివి కూడా కోపాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని అలవాటు చేసే ప్రయత్నం చేయండి.

ఏ విషయంలోనైనా స్వీయ అనుభవాలే సమస్యకు పరిష్కారం వెతకడంలో ఉపయోగపడతాయి. కాబట్టి తనంతట తానుగా తన మానసిక స్థితిని విశ్లేషించుకుంటే సరైన పరిష్కారం దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతను ఆ స్థితికి చేరుకునే విధంగా మీ వంతు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. అలాగే ఒకవేళ తనకు తాను మానసిక నిపుణులను సంప్రదిస్తే.. వారు కొన్ని పద్ధతులు చెప్పే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అతనికి మీ తోడ్పాటుని అందించండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని