Published : 12/12/2022 14:15 IST

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు..

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను నిందించడంతో నాకు ఇష్టం లేకున్నా మా బావతో పెళ్లి చేశారు. అయితే మా ప్రేమ విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా మా బావకు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఆఫీసు పని మీద నా భర్తకు దూరంగా వేరే ఊరిలో ఉంటున్నా. బావంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కేవలం నా పెళ్లి గురించే అమ్మ అలా చేసిందని తెలిసింది. మరోపక్క నేను ప్రేమించిన అబ్బాయి ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, రమ్మని అంటున్నాడు. అతని ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఇది ముగ్గురి జీవితాలను, మూడు కుటుంబాలను ప్రభావితం చేసే నిర్ణయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్న విషయం మర్చిపోకండి. పెళ్లి విషయంలో కేవలం అమ్మ ఆరోగ్యం మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఏ నిర్ణయమైనా తొందరపాటుతో తీసుకునేది కాదు.. జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందని అర్థం చేసుకోండి. మరొక నిర్ణయం తీసుకునే ముందు మీరు, మీరు ప్రేమించిన అబ్బాయే కాకుండా మీ అందరి కుటుంబాలు ఇందులో భాగస్వాములే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీ మనసులో ఉన్న విషయాన్ని మీ భర్తతో ఇంతకు ముందే చెప్పారు కాబట్టి మొదట మీ ప్రస్తుత పరిస్థితిని, మీ భవిష్యత్తు ఆలోచనల గురించి అతనితో మాట్లాడండి.

అలాగే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి తన కుటుంబం మిమ్మల్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నాడు. అది ఎంతవరకు నిజం అనేది కూడా కచ్చితంగా తెలుసుకోండి. తర్వాత ఏ విషయంలోనూ బాధపడాల్సి రాకుండా లోతుగా ఆలోచించి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని