మా ఆయన ఎక్కువగా మాట్లాడడు.. ఒంటరిగా ఫీలవుతున్నా..!

నా వయసు 28 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం పెళ్లైంది.  నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నా భర్త చిన్న వయసు నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. మా తల్లిదండ్రులు, సోదరుడు మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని....

Published : 18 Oct 2022 12:40 IST

నా వయసు 28 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం పెళ్లైంది.  నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నా భర్త చిన్న వయసు నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. మా తల్లిదండ్రులు, సోదరుడు మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని చర్చిస్తారు. కానీ, నా భర్త ఇంటి గురించి కానీ, భవిష్యత్తు ప్రణాళికల గురించి కానీ నాతో ఏమీ మాట్లాడడు. అతను నా పేరుతో కూడా నన్ను పిలవడు. మేము స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాం.. కాబట్టి నాకు ప్రేమ, ఆప్యాయత ఎంతో అవసరం. ఈ విషయాన్ని నా భర్తకు చాలాసార్లు చెప్పాను. అతను ‘నిన్ను ప్రేమిస్తున్నాను కానీ వ్యక్తపరచలేను’ అని చెబుతున్నాడు. నాతో ఎలాంటి విషయాలు చర్చించకపోవడంతో ఒంటరిగా ఉన్నానన్న భావన కలుగుతోంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. అతని మనస్తత్వం, వ్యక్తిత్వ ధోరణి మీరు పెరిగిన వాతావరణానికి, మీ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అలాంటప్పుడు అతను మారడం, లేదా మీరు మీ ఆలోచనలు మార్చుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రాక్టికల్‌గా ఆలోచించి చూడండి.
అలాగే అతని నుంచి మీరు ఆశిస్తున్న మార్పు విషయంలో మీ అంచనాలను కొంత తగ్గించుకుని, అతను ఎలా ఉంటే మీరు సంతోషిస్తారో అతనికి వివరించి చూడండి. అలా కొద్దికొద్దిగా వచ్చిన మార్పులను ప్రోత్సహించడం ద్వారా క్రమంగా మీరనుకున్న మార్పు వస్తుందేమో చూడండి.

కారణమేమిటి?

అయితే ఇన్నేళ్ల నుంచి అలవాటు పడ్డ వ్యక్తిత్వాన్ని అతను ఒక్కసారిగా మార్చుకునే అవకాశం ఉందా? అనేది ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఇరవై ఏళ్ల వయసు నుంచే అతను పని చేయడం మొదలుపెట్టాడని చెబుతున్నారు. అయితే చిన్న వయసు నుంచే అతను ఉద్యోగం, సంపాదన వంటి అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల మానవ సంబంధాలపై పూర్తి అవగాహన లేదేమో? అన్న విషయాన్ని పరిశీలించండి. ఒకవేళ అలా కాని పక్షంలో దానికి గల కారణాలు ఏమై ఉండచ్చు? అనేది ఆలోచించండి.

పూర్తిగా వాళ్ల లాగే ఉండాలనుకోవద్దు!

అలాగే మీ పుట్టింట్లో మీకు అలవాటైన ధోరణిని అతనికి క్రమక్రమంగా అలవాటు చేసే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో ఎలాంటి మాటలు మాట్లాడితే అతని నుంచి ప్రతిస్పందన వస్తుందనేది జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తర్వాత తన ఆలోచనా ధోరణి మీవైపు వచ్చేలా ప్రోత్సహించి చూడండి. దానివల్ల అతను మరింతగా మాట్లాడే అవకాశం ఉందేమో గమనించండి. అదే సమయంలో మీ తల్లిదండ్రులు, సోదరుడి లాగా అతను కూడా అలాగే ఉండాలనేది వాస్తవ దూరమైన ఆంకాక్ష అవుతుందేమో ఆలోచించండి. కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ అతనిలో మీకు కావాల్సినటువంటి సానుకూల మార్పుని ఎలా తెచ్చుకోగలరు అనే దాని పైన దృష్టి పెట్టండి.

అభిరుచులను ఆచరణలో పెట్టండి!

అదేవిధంగా - మీరు కేవలం అతని మీదే ఆధారపడకుండా మీకంటూ కొన్ని వ్యాపకాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు గతంలో ఆచరణలో పెట్టలేని అభిరుచులను తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలించండి. ఈ రోజుల్లో ఎంత దూరంగా ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫలితంగా మీరు ఒంటరిగా ఉన్నానన్న భావనను దూరం చేసుకోగలరేమో చూడండి.
అయితే ఏ విషయంలో అయినా సరే - ఇతరుల నుంచి మనం మార్పులు ఆశించినప్పుడు, మన వైపు నుంచి మనం తెచ్చుకోగలిగిన మార్పులు ఏంటి? అనేది కూడా ఆలోచించక తప్పదు. కాబట్టి మీరు ఏ రకంగా సమయపాలన చేసుకోగలుగుతున్నారు? మీ అర్హతలను ఎలా పెంపొందించుకుంటున్నారు? కొత్త వ్యాపకాలను ఎలా అలవాటు చేసుకుంటున్నారు? మొదలైన విషయాలను కూడా చెక్‌ చేసుకోండి. తద్ద్వారా మీరనుకుంటున్న ఒంటరితనాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని