‘ఆ మార్పుల’ గురించి మీ అమ్మాయికి చెప్పారా?

రుతుక్రమం.. ఆడపిల్లలు బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగిడే దశకు ఆరంభం ఇది. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో 10 నుంచి 13 ఏళ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఇంతకంటే ముందుగానే.. అంటే దాదాపు 8 ఏళ్ల వయసులోనే లేదంటే 13 ఏళ్ల....

Published : 15 Apr 2023 13:25 IST

రుతుక్రమం.. ఆడపిల్లలు బాల్యం నుంచి యుక్తవయసులోకి అడుగిడే దశకు ఆరంభం ఇది. సాధారణంగా చాలామంది ఆడపిల్లల్లో 10 నుంచి 13 ఏళ్ల మధ్య రుతుచక్రం ప్రారంభమవుతుంది. అయితే కొంతమందికి ఇంతకంటే ముందుగానే.. అంటే దాదాపు 8 ఏళ్ల వయసులోనే లేదంటే 13 ఏళ్ల తర్వాతనైనా.. నెలసరి మొదలవ్వచ్చు. ఏదేమైనా పిరియడ్ మొదలయ్యే క్రమంలో ఆడపిల్లల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సహజం. అయితే తల్లులు ఆ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వాటి గురించి వారికి వివరించడం ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆయా సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి ముందు నుంచే సవివరంగా తెలియజేయాలంటున్నారు.

కొవ్వు స్థాయులు పెరుగుతాయి...

రుతుక్రమం మొదలయ్యే క్రమంలో అమ్మాయిల్లో జరిగే శారీరక మార్పుల్లో వారి శరీరంలో కొవ్వు పెరగడం కూడా ఓ భాగమే. పొట్ట, పిరుదులు, కాళ్లు.. వంటి భాగాల్లో కొవ్వు చేరి.. శరీరానికి చక్కటి ఆకృతి వస్తుంది. అంతేకాదు.. ఈ క్రమంలో ఆడపిల్లల ఛాతీలో కూడా ఎదుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా చనుమొనలు కాస్త పెద్దవై.. ఆ భాగంలో కొద్దిగా దురద, నొప్పిగా అనిపిస్తుంది. తల్లిగా ఇలాంటి మార్పుల గురించి వారికి ముందుగానే తెలియజేయడంతో పాటు నొప్పి, దురద వల్ల కంగారు పడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పాలి. అలాగే వక్షోజాల్లో ఎదుగుదల వల్ల వాటి బ్యాలన్స్ కోసం నాణ్యమైన, సౌకర్యవంతమైన బ్రా వేసుకోవాలని సూచించాలి. అయితే అది వారికి మరీ వదులుగా, బిగుతుగా ఉండకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. కొందరు పిల్లలు దీన్ని ధరించడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అయినప్పటికీ దీన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లులు వివరించి.. అమ్మాయిలు సరైన లోదుస్తులు ధరించేలా చూసుకోవాలి.

అవాంఛిత రోమాలు..

పిరియడ్స్ మొదలయ్యే క్రమంలో ఆడపిల్లల శరీరంలో కొన్ని భాగాల్లో అవాంఛిత రోమాల పెరుగుదలను కూడా గమనించవచ్చు. అయితే కొందరు పిల్లలు ఈ మార్పును చాలా చిరాగ్గా భావిస్తుంటారు. పెరిగిన వెంట్రుకలను తొలగించుకొనే విధానాల గురించి తల్లుల్ని అడగడానికి మొహమాటపడుతుంటారు. ఇందుకు స్నేహితుల ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకొని వారు చెప్పిన వివిధ పద్ధతుల్ని పాటిస్తుంటారు. కానీ ఇలాంటివన్నీ శరీరానికి పడకపోవచ్చు. కాబట్టి అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి మీకు తెలిసిన పద్ధతుల్ని అనుసరించడం కంటే ఓసారి డాక్టర్ వద్దకెళ్లి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

హార్మోన్లలో మార్పులు..

ఆడపిల్లల్లో నెలసరి ప్రారంభమయ్యే దశలో శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో మార్పుల వల్ల వారి చర్మం, జుట్టు విషయాల్లో కొన్ని మార్పులు రావడం, అమ్మాయిల ముఖంపై మొటిమలు రావడం.. వంటివి మనం ఎక్కువగా గమనిస్తుంటాం. రుతుచక్రం మొదలయ్యే క్రమంలో చర్మగ్రంథుల్లో చోటుచేసుకునే మార్పుల కారణంగా చర్మం నుంచి ఎక్కువ చెమట, నూనె బయటికి రావడమే అందుకు కారణం. మరి ఈ సమస్యలను అధిగమించాలంటే ఎప్పటికప్పుడు చర్మాన్ని, జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం బయట దొరికే ఉత్పత్తులు కాకుండా నిపుణులు సూచించినవి లేదంటే సహజసిద్ధమైన ఉత్పత్తులు ఉపయోగించడం ఉత్తమం.

లోపలి భాగాల్లోనూ..

అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే దశలో వారి యోని, గర్భసంచి.. వంటి లోపలి శరీర భాగాల్లోనూ మార్పులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో పిరియడ్ మొదలవ్వడానికి దాదాపు ఆరు నుంచి 18 నెలల ముందు నుంచే యోని నుంచి తెల్లటి లేదంటే పసుపు రంగు డిశ్చార్జి అవుతుంటుంది. అయితే ఈ మార్పులన్నింటి గురించి పిల్లలకు ముందే తెలియజేసి వారికి తగిన జాగ్రత్తలు కూడా తల్లులు సూచించాలి. అలాగే శానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగించే విధానం తెలిపి, వాటిని వారు రోజూ తీసుకెళ్లే స్కూల్ బ్యాగుల్లో పెట్టుకోమనాలి. అవసరమైనప్పుడు వాడుకోమని చెప్పాలి. తద్వారా మొదటిసారి పిరియడ్ గురించిన అవగాహన వారికి ఉండి ఆ సమయంలో కంగారు పడకుండా ఉంటారు. అలాగే నెలసరి మొదలైన తర్వాత పాటించాల్సిన పరిశుభ్రత, ఎదురయ్యే శారీరక మార్పులు, ఇబ్బందులు.. వంటి అంశాలపై కూడా వారికి ప్రాథమిక అవగాహన కల్పించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని