ప్యూమిస్ స్టోన్ వాడుతున్నారా?

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్క్రబింగ్ చేయడం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు. తద్వారా బోలెడన్ని సౌందర్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

Published : 08 Jul 2024 12:13 IST

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్క్రబింగ్ చేయడం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు. తద్వారా బోలెడన్ని సౌందర్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

అయితే ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించే ముందు ఆయా శరీర భాగాల్ని గోరువెచ్చటి నీళ్లలో కాసేపు ఉంచాలి. అలాగే ప్యూమిస్ స్టోన్‌ని కూడా నానబెట్టాలి. ఆపై ఈ రాయితో ఆ ప్రదేశంలో గుండ్రంగా, మృదువుగా, సున్నితంగా రుద్దుకోవాలి.

తేమ కోల్పోకుండా..!

ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి చర్మం శుభ్రపరుచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే గరుకుగా ఉండే ఈ రాయి వల్ల చర్మం తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా, పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ! ఈ సమస్య రాకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ తప్పనిసరి!

గోళ్లకు కూడా..

చేతులు మృదువుగా మారాలన్నా, చేతి వేళ్లు, గోళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా మానిక్యూర్ చేయించుకుంటే చాలు. అలాగని బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి కూడా చేతులను శుభ్రపరచుకోవచ్చు.

అవాంఛిత రోమాలు తొలగించడానికి...

కేవలం పాదాలు, చేతులు, చర్మ సంరక్షణకే కాదు.. ప్యూమిస్ స్టోన్‌ని అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగించచ్చు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి ఆ భాగాన్ని నీటితో తడిపి తర్వాత సబ్బు రాయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో ఆ ప్రాంతంలో నెమ్మదిగా రుద్దితే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. తరచుగా ప్యూమిస్ స్టోన్‌ను ఉపయోగించడం వల్ల ఆయా భాగాల్లో వెంట్రుకలు పెరగడం కూడా తగ్గుతుంది.

పాదాలకు ఇలా!

గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. వీలైతే ఈ నీటిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్‌ని కలపండి. తద్వారా పాదాలు నీటిలో నాని, మెత్తబడ్డాక ప్యూమిస్ స్టోన్‌తో మడమలను, అరికాళ్లను మృదువుగా మర్దన చేస్తే మృతకణాలు, మురికి సులభంగా తొలగిపోతాయి.


వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు!

సౌందర్య పరంగా ఇన్ని ప్రయోజనాలున్న ప్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

* ఇతర శరీర భాగాల మాదిరిగా ముఖంపై ప్యూమిస్‌ స్టోన్‌ ఉపయోగించకూడదు.

* అలాగే పగిలిన చర్మంపై ప్యూమిస్ స్టోన్‌ని రుద్దకూడదు. ఎందుకంటే అసలే దెబ్బతిన్న చర్మంపై గరుకుగా ఉండే ఈ రాయితో రాపిడి చేస్తే చర్మగ్రంథులు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది.

* ఒకరు వాడిన ప్యూమిస్ స్టోన్ ఇంకొకరు వాడకూడదు. దీనివల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశాలుంటాయి.


శుభ్రం చేయడమూ ముఖ్యమే!

ప్యూమిస్ స్టోన్‌ని ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రం చేయడమూ ముఖ్యమే! ఈ క్రమంలో ఈ రాయిని వేడి నీటిలో కాసేపు మరగబెడితే సరిపోతుంది. దీనివల్ల ఈ స్టోన్‌కి ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో చేరిన మురికి పూర్తిగా తొలగిపోతుంది. తద్వారా దాన్ని మళ్లీ ఉపయోగించినప్పుడు ఇతర చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్