పాలిచ్చే విషయంలో.. అలా మరెవరూ బాధపడకూడదని..!

తల్లిపాలు తాగడం బిడ్డ హక్కు.. బిడ్డకు పాలివ్వడం తల్లి హక్కు.. అయితే కొన్ని అపోహలు-మూఢనమ్మకాల పేరుతో ఈ హక్కుల్ని కాలరాస్తోంది నేటి సమాజం. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడం, పోత పాలు పట్టడాన్నీ తప్పు పడుతోంది. ఇవన్నీ

Published : 07 Aug 2022 18:28 IST

తల్లిపాలు తాగడం బిడ్డ హక్కు.. బిడ్డకు పాలివ్వడం తల్లి హక్కు.. అయితే కొన్ని అపోహలు-మూఢనమ్మకాల పేరుతో ఈ హక్కుల్ని కాలరాస్తోంది నేటి సమాజం. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడం, పోత పాలు పట్టడాన్నీ తప్పు పడుతోంది. ఇవన్నీ కొత్తగా తల్లైన మహిళల మనసుల్లో బలంగా నాటుకుపోతున్నాయి. తద్వారా పాలివ్వడం అనే సహజ ప్రక్రియ కాస్తా క్లిష్టంగా మారుతోంది. పుణేకు చెందిన అధునికా ప్రకాశ్‌కు ఇది మింగుడు పడలేదు. తల్లిపాలు పట్టే క్రమంలో స్వీయానుభవంతో పలు సమస్యలు ఎదుర్కొన్న ఆమె.. తనలా మరెవరూ బాధపడకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ఏర్పాటుచేసి.. ఆ వేదికగా అమ్మ పాల ఆవశ్యకతను చాటుతోంది. ‘ఫ్రీడమ్‌ టు నర్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో ఉద్యమిస్తోంది. ఇలా తొమ్మిదేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది తల్లుల బ్రెస్ట్‌ ఫీడింగ్‌ జర్నీలో భాగమైన ఆమె.. తన ఇనీషియేటివ్‌ గురించి ఏం చెబుతోందో విందాం రండి..

అధునికా ప్రకాశ్‌.. పుణేకు చెందిన ఆమె సింబయాసిస్‌లో ఎంబీఏ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక ఐర్లాండ్‌ వెళ్లిపోయిన ఆమె అక్కడే ఓ బిడ్డకు తల్లైంది. అయితే ఓవైపు చిన్నారి ఆలనా పాలనా చూసుకోవడం, ఇంట్లో పనులు, నిద్రలేమి.. ఇవన్నీ ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసేవి. వీటి నుంచి బయటపడడానికి అక్కడే ఓ కమ్యూనిటీలో చేరింది అధునిక. తల్లి పాల ప్రాముఖ్యం తెలియజేయడంతో పాటు.. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడంలో ఈ వేదిక తనకు బాగా ఉపయోగపడిందని చెబుతోందామె.

అక్కడి ఐడియా ఇక్కడికి..!

సాధారణంగా మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పు పడుతుంటారు. పలు వ్యక్తిగత కారణాల వల్ల పోత పాలు పట్టినా.. అందం తగ్గిపోతుందని అలా చేస్తోందంటూ నిందలేస్తుంటారు. అయితే వీటన్నింటికీ కారణం అవగాహన లోపమే అంటోంది అధునిక.

‘ఐర్లాండ్‌లో ఉన్నప్పుడు అమ్మల కమ్యూనిటీలో చేరడం నాకెంతో ఉపయోగపడింది. అందుకే ఈ ఆలోచనను భారత్‌లో అమలు చేద్దామని అప్పుడే అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ బ్రెస్ట్‌ఫీడింగ్‌పై అపోహలు-మూఢ నమ్మకాలు ఎక్కువ! మాట వరసకే కాదు.. నా ఫ్రెండ్‌కి ఎదురైన ఓ చేదు అనుభవమే ఈ విషయం కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కోల్‌కతాకు చెందిన తను ఓ రోజు తన చిన్నారిని తీసుకొని షాపింగ్‌కి వెళ్లింది. అక్కడ పాలివ్వడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అత్యవసరమైతే టాయిలెట్‌లోకి వెళ్లి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదే అనుభవాన్ని తను తన ఫేస్‌బుక్‌ వాల్‌పై రాసింది. అది చూశాక ఊరుకోలేకపోయా.. అందుకే అందరి మనసుల్లో నుంచి ఇలాంటి అపోహల్ని తొలగించాలన్న ఆలోచనతోనే 2013లో ‘బ్రెస్ట్‌ఫీడింగ్‌ సపోర్ట్‌ ఫర్‌ ఇండియన్‌ మదర్స్‌ (BSIM)’ అనే ఫేస్‌బుక్‌ కమ్యూనిటీని ప్రారంభించా. దేశవ్యాప్తంగా ఉన్న అమ్మల్లో తల్లిపాల ప్రాముఖ్యాన్ని చాటే వేదిక ఇది.. మరోవైపు ‘ఫ్రీడమ్‌ టు నర్స్‌’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఉద్యమాన్నీ ప్రారంభించా.. అప్పట్నుంచి ఇప్పటి వరకు మా పేజీలో లక్షన్నర మంది తల్లులు సభ్యులుగా ఉన్నారంటే ఇదెంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు..’ అంటూ తన కార్యక్రమం గురించి పంచుకుంది అధునిక.

అమ్మ వేసే ప్రతి అడుగులోనూ..!

ఒక తల్లి తన బిడ్డకు సౌకర్యవంతంగా పాలివ్వడం దగ్గర్నుంచి.. వివిధ కారణాల రీత్యా పోత పాలు పట్టినా తగిన పోషకాలు అందేలా జాగ్రత్తపడడం.. ఇలా కొత్తగా తల్లైన మహిళలు తమ చిన్నారికి అందించే చనుబాల విషయంలో వేసే ప్రతి అడుగులోనూ భాగమవుతోంది అధునిక రూపొందించిన ఆన్‌లైన్‌ వేదిక. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు నిర్మొహమాటంగా పాలివ్వడం, కొత్తగా తల్లైన వారు ఎదుర్కొనే సమస్యలు-వాటికి పరిష్కార మార్గాలు, బ్రెస్ట్‌ఫీడింగ్‌పై తల్లుల్లో నెలకొన్న అపోహలు.. ఇలాంటి ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు తల్లులందరినీ తల్లిపాలు పట్టడంలో ప్రోత్సహించడానికి నిపుణులు, సెలబ్రిటీలతో.. కౌన్సెలింగ్‌, ప్రత్యేక సెషన్స్‌, వెబినార్స్‌ నిర్వహిస్తోంది. ఈ గ్రూపులో భాగమైన నిపుణులు 24 గంటలూ తల్లులకు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏ సమయంలోనైనా తల్లులు తమ ఇబ్బందుల్ని వీరితో పంచుకొని సలహాలు పొందే ఏర్పాటు చేసిందామె. అంతేకాదు.. కొత్తగా తల్లైన మహిళలకు సంబంధించిన బ్రెస్ట్‌ఫీడింగ్‌ స్టోరీస్‌నీ ఈ సోషల్‌ మీడియా వేదికగా పంచుకునే ఏర్పాటు చేస్తోంది అధునిక.

ఆ విషయంలో సిగ్గెందుకు?!

‘తల్లి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతూ బిడ్డకు పాలివ్వడం వల్ల దాని ప్రభావం తల్లీబిడ్డలిద్దరిపై పడుతుంది. అయినా పాలివ్వడం, ఇవ్వకపోవడం, ఎన్నేళ్ల పాటు ఇవ్వాలనే విషయాలు తల్లి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మరో వ్యక్తి ప్రమేయం, ఉచిత సలహాలు అనవసరమనేది నా భావన. ఇక చాలామంది బిడ్డ ఏడవగానే అది ఆకలి వల్లేనేమో అనుకుంటారు. అక్కడా కొత్తగా తల్లైన వారినే ‘ఏడ్చినా పాలివ్వట్లేదం’టూ తప్పు పడుతుంటారు. కానీ అందుకు వివిధ కారణాలుండచ్చు. ఇక మరికొంతమంది.. వక్షోజాల ఆకృతి, పరిమాణాన్ని బట్టి పాల ఉత్పత్తిని అంచనా వేస్తుంటారు. ఇన్ని పరిమితులు, విమర్శలు, అపోహల మధ్య ఒక తల్లి తన బిడ్డకు సౌకర్యవంతంగా ఎలా పాలు పట్టగలుగుతుంది?! ఇక చాలామంది ఇది తమ ఒక్కరి సమస్యేనేమోనని మథనపడుతుంటారు. కానీ ఈ జర్నీలో తాము ఒంటరి కాదు అని నిరూపించడానికే దేశవ్యాప్తంగా పలువురు మహిళల బ్రెస్ట్‌ఫీడింగ్‌ కథల్ని మా కమ్యూనిటీ వేదికగా పంచుకునే ఏర్పాటు చేస్తున్నా.. ఈ ప్రయత్నం లక్షలాది మంది మహిళల్లో చైతన్యం కలిగిస్తోంది..’ అంటోంది అధునిక. ఇలా కేవలం చెప్పడమే కాదు.. తన ఇద్దరు చిన్నారులకూ పాలిస్తోన్న ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తోందీ సూపర్‌ మామ్‌.

‘ఉత్తమ కమ్యూనిటీ’గా కితాబు!

అధునిక ఏర్పాటుచేసిన ఈ ఫేస్‌బుక్‌ వేదికను ‘ఆసియాలోనే ఉత్తమ కమ్యూనిటీ’గా ఆ సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ సేవల్ని విస్తరించినందుకు మిలియన్‌ డాలర్‌ నిధుల్ని సైతం అందించింది. ఇలా కేవలం కమ్యూనిటీ వేదికగానే కాదు.. ఆఫ్‌లైన్‌లోనూ మహిళల్లో చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందీ పుణే సోషల్‌ప్రెన్యూర్‌. అంతేకాదు.. తల్లిపాలపై పూర్తి అవగాహన పెంచేందుకు ‘బ్రెస్ట్‌ పోషణ్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసిందామె. ఇలా ఈ సూపర్‌ మామ్‌ చేస్తోన్న సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర శిశు సంక్షేమ శాఖ నుంచి ‘వెబ్‌ వండర్‌ విమెన్‌’ అవార్డును, అదే ఏడాది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ‘అవుట్‌లుక్‌ పోషణ్‌’ అవార్డునూ అందుకుంది అధునిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్