నౌవారీ చీరకట్టులో.. బైక్‌పై.. ప్రపంచయాత్ర!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రపంచ వేదికపై ప్రత్యేక స్థానం ఉంది. ఇక మన దేశ కట్టూ-బొట్టును పాటించడానికి విదేశీ మగువలూ ముచ్చటపడుతుంటారు. అలాంటి చీరకట్టు ప్రత్యేకతల్ని విశ్వవ్యాప్తం చేయడానికి, ఈ సంప్రదాయ వస్త్రధారణతోనూ మహిళలు ఏ పనైనా సునాయాసంగా చేయగల సమర్థులని నిరూపించడానికి ప్రపంచయాత్రకు పూనుకుంది మహారాష్ట్రకు చెందిన రమాబాయి లట్‌పటే.

Updated : 07 Sep 2023 18:28 IST

(Photos: Instagram)

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రపంచ వేదికపై ప్రత్యేక స్థానం ఉంది. ఇక మన దేశ కట్టూ-బొట్టును పాటించడానికి విదేశీ మగువలూ ముచ్చటపడుతుంటారు. అలాంటి చీరకట్టు ప్రత్యేకతల్ని విశ్వవ్యాప్తం చేయడానికి, ఈ సంప్రదాయ వస్త్రధారణతోనూ మహిళలు ఏ పనైనా సునాయాసంగా చేయగల సమర్థులని నిరూపించడానికి ప్రపంచయాత్రకు పూనుకుంది మహారాష్ట్రకు చెందిన రమాబాయి లట్‌పటే. ఏడాది పాటు తన సూపర్‌బైక్‌పై, సోలోగా 40కి పైగా దేశాలు తిరగాలని నిర్ణయించుకున్న ఆమె.. ఇటీవలే దుబాయ్‌ దాటి యూరప్‌లో అడుగుపెట్టింది. రాత్రనక, పగలనక.. జనావాసం ఉన్నా, లేకపోయినా.. ధైర్యంగా బైక్‌పై రయ్‌మంటూ దూసుకుపోతోన్న రమాబాయి వరల్డ్‌ టూర్‌ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

27 ఏళ్ల రమాబాయిది పుణే. ఆమెకు దేశభక్తి ఎక్కువ. ‘భరతమాత ముద్దుబిడ్డ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడే ఆమె.. తన ఇన్‌స్టా బయోలోనూ తన పేరుకు క్యాప్షన్‌గా ‘భారత్‌ కీ బేటీ’ అని రాసుకుంది. అంతేకాదు.. రమాబాయికి చీరకట్టంటే ప్రాణం. ప్రతి సందర్భంలోనూ మహారాష్ట్ర ట్రెడిషనల్‌ శారీ అయిన 9 గజాల నౌవారీ చీరకట్టులోనే దర్శనమిస్తుంటుందామె. అయితే ఈసారి ఇదే చీరకట్టులో ఓ సాహస యాత్ర చేయాలని సంకల్పించుకుంది రమాబాయి. తద్వారా చీరలోనూ అమ్మాయిలు ఏ పనైనా అలవోకగా చేయగలరని నిరూపించాలనుకుంది.

365 రోజులు.. 40కి పైగా దేశాలు!

ఈ ఆలోచనతోనే నౌవారీ చీరలో తన సూపర్‌ బైక్‌పై ప్రపంచమంతా చుట్టేయాలనుకుంది రమాబాయి. ఇందులో భాగంగానే ఏడాది కాలంలో, ఆరు ఖండాల్లోని సుమారు 40కి పైగా దేశాల్లో పర్యటించాలని సంకల్పించుకున్న ఆమె.. ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ మరుసటి రోజున ముంబయిలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి తన యాత్రను ప్రారంభించింది.

‘చీరకట్టు అమ్మాయిలకు అందం.. బైక్‌ రైడింగ్‌ అబ్బాయిలు మాత్రమే చేయగలరు అనుకుంటారు చాలామంది.. ఈ మూసధోరణిని మార్చాలనుకున్నా. చీరకట్టులోనూ మహిళలు సునాయాసంగా బైక్‌పై దూసుకుపోగలరని నిరూపించాలనుకున్నా. మరోవైపు మన దేశ సంప్రదాయ చీరకట్టు ప్రత్యేకతల్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఒంటరిగా ప్రపంచయాత్రను ప్రారంభించా. ఈ ఏడాది మార్చి 9న ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా.. ఆరు ఖండాల్లో దాదాపు 40కి పైగా దేశాల్ని చుట్టేయాలని, తద్వారా సుమారు 80 వేల కిలోమీటర్ల దూరం పర్యటించాలని ప్రణాళిక వేసుకున్నా. ఇప్పటికి భారత్‌, నేపాల్‌, భూటాన్‌, థాయ్‌ల్యాండ్‌, బ్యాంకాక్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌ దేశాల్లో మొత్తంగా 23 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకున్నా..’ అంటోన్న రమాబాయి ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తోంది.

అక్కడ బైక్‌ రైడింగ్ సవాలే!

దేశాలు దాటడానికి రోడ్డు మార్గం లేని చోట విమాన ప్రయాణం చేస్తోన్న రమాబాయి.. తన సాహసయాత్రలో భాగంగా ఎత్తైన పర్వతాలు, మంచు దుప్పటి కప్పుకున్న రోడ్ల పైనా రయ్‌మంటూ దూసుకుపోతోంది. అయితే తన ప్రయాణంలో భాగంగా పలు సవాళ్లూ ఎదుర్కొన్నానంటోందీ సోలో ట్రావెలర్.

‘ఒంటరి ప్రయాణమంటే నాకు భయం లేదు. ఓ పైలట్‌గా వాతావరణ పరిస్థితుల్నీ అంచనా వేయగలను. అయితే ఎత్తైన పర్వతాలు, రాళ్లు రప్పలతో కూడిన మట్టి రోడ్లు, మంచు దుప్పటి కప్పుకున్న రోడ్లపై బైక్‌ నడపడం కాస్త సవాలుగానే అనిపించింది. ఇక ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి సిడ్నీకి మధ్య దూరం సుమారు 1600 కిలోమీటర్లు. ఈ మార్గంలో జనసందోహం తక్కువ.. పైగా మొబైల్‌ కనెక్టివిటీ అసలే ఉండదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ బైక్‌పై దూసుకుపోవడం విభిన్న అనుభూతినిచ్చింది. ఇక నా ప్రయాణంలో భాగంగా.. నా వెంట అన్నీ నౌవారీ చీరలే తీసుకెళ్లా. అది కూడా 8 జతలే! జతల కొద్దీ దుస్తులతో వార్డ్‌రోబ్‌ నింపేయడం నాకు ఇష్టముండదు. దుస్తుల విషయంలో రీసైక్లింగ్‌/సస్టైనబిలిటీని పాటించడానికే ఆసక్తి చూపుతా. రోజుకు 16 గంటల చొప్పున ప్రయాణం చేస్తున్నా.. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఓ టెంట్‌, ఇతర సామగ్రిని, బైక్‌ రిపేరింగ్‌కు సంబంధించిన టూల్‌ కిట్‌నీ వెంట ఉంచుకున్నా..’ అంటోన్న రమాబాయి.. తన యూరప్‌ ట్రిప్‌ ముగించుకొని త్వరలోనే ఆఫ్రికాలో ఆడుగు పెడతానంటోంది. ఆపై పోర్చుగల్‌, మొరాకో, ట్యునీషియా, జోర్డాన్‌, ఒమన్‌ మీదుగా వచ్చే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ నాటికి ముంబయిలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ వద్దకు చేరుకొని తన యాత్రను ముగించనున్నానని చెబుతోందీ యువ బైక్‌ రైడర్.

ప్రధాని మాటలు స్ఫూర్తినిచ్చాయి!

చిన్న వయసు నుంచీ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకు ఆసక్తి ఉన్న అంశాల పైనే దృష్టి పెడుతూ వస్తోంది రమాబాయి. పైలట్‌ కావాలన్న కోరికతో 24 ఏళ్ల వయసులోనే కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ అందుకున్న ఆమె.. ప్రస్తుతం బైక్‌ రైడర్‌గా, వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. సంప్రదాయ వస్త్రాభరణాల్ని రూపొందిస్తూ ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్‌గా తనను తాను నిరూపించుకుంటోంది. ఇక ప్రస్తుతం తన సోలో వరల్డ్‌ టూర్‌కీ ప్రముఖుల మద్దతు లభించిందంటోంది రమాబాయి.

‘ఈ ప్రపంచయాత్ర కోసం నాకు సుమారు రూ. 3 కోట్లు అవసరమయ్యాయి. ఈ క్రమంలో నా ఆభరణాలు, కారు అమ్మేశా. దేశవ్యాప్తంగా ఒక్కొక్కరూ రూ. 1 చొప్పున సహకారం అందించాల్సిందిగా కోరాను. ఇందులో భాగంగానే జర్నీ ప్రారంభ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నుంచి నాకు మద్దతు లభించింది. ఇక దిల్లీలో ప్రధాని మోదీజీనీ కలుసుకున్నా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశ మహిళలు సాధిస్తోన్న ప్రగతిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. మరోవైపు ఈ యాత్రలో భాగంగా సద్గురు ‘Save Soil’ నినాదాన్నీ ప్రపంచ దేశాల్లోకి తీసుకెళ్తున్నా.. నా దృష్టిలో మహిళలు ఏదైనా సాధించగల సమర్థులు. ఇది చాటడానికే ప్రపంచయాత్ర చేస్తోన్న నాకు విదేశీ మహిళల నుంచి సాదర స్వాగతం లభిస్తోంది. అక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా పలకరించడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ యాత్ర నా జీవితంలో ఓ మధురానుభూతిగా గుర్తుండిపోతుంది..’ అంటోంది రమాబాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని