ఆ కొంగలకు అక్క, చెల్లి తనే..!

హర్‌గిలా.. ఇది అసోం, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. సరిగ్గా పదిహేనేళ్లు వెనక్కి వెళ్తే.. పలు కారణాల వల్ల ఈ పక్షి జాతి క్రమంగా అంతరించిపోవడం దగ్గర్నుంచి గమనించింది పూర్ణిమా దేవి బర్మన్. ఈ అరుదైన జాతి అంతరించిపోవడం జీర్ణించుకోలేకపోయిన....

Published : 24 Nov 2022 13:13 IST

(Photo: Twitter)

హర్‌గిలా.. ఇది అసోం, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. సరిగ్గా పదిహేనేళ్లు వెనక్కి వెళ్తే.. పలు కారణాల వల్ల ఈ పక్షి జాతి క్రమంగా అంతరించిపోవడం దగ్గర్నుంచి గమనించింది పూర్ణిమా దేవి బర్మన్. ఈ అరుదైన జాతి అంతరించిపోవడం జీర్ణించుకోలేకపోయిన పూర్ణిమ.. తన పరిశోధనను సైతం మధ్యలోనే ఆపేసి.. ఈ కొంగల సంరక్షణకు నడుం బిగించింది. సుమారు 15 ఏళ్లుగా ఈ పక్షుల పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న ఆమె.. దాదాపు పది వేల మంది మహిళలతో ఏకంగా ఓ సైన్యాన్నే తయారుచేసింది. ఇలా ఓవైపు అరుదైన పక్షి జాతిని, మరోవైపు పర్యావరణాన్నీ కాపాడుతోన్న భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డా.పూర్ణిమాదేవి బర్మన్ తన సేవలకు గుర్తింపుగా తాజాగా ఐక్యరాజ్యసమితి నుంచి ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డు గెలుచుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ గ్రీన్‌ ఆస్కార్‌ను తిరిగి భూమాతకే అంకితం చేస్తానంటోన్న ఈ ‘హర్‌గిలా బైదు’ (కొంగల సహోదరి) స్ఫూర్తిగాథ ఇది!

పక్షుల పాటలు వింటూ..

అసోంకు చెందిన పూర్ణిమ ఐదు సంవత్సరాల వయసు నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగారు. ఆ ప్రాంతం బ్రహ్మపుత్రా నది పరీవాహక ప్రాంతంలో ఉంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు దూరంగా ఉండడంతో పూర్ణిమ దిగాలుగా ఉండేవారు. అది గమనించిన పూర్ణిమ అమ్మమ్మ తనతో పాటు పంటపొలాలకు తీసుకెళ్లేవారు. అక్కడి పక్షులను చూపిస్తూ వాటికి సంబంధించిన పాటలు పాడేవారు. అలాగే పూర్ణిమతో కూడా ఆ పాటలు పాడమని ప్రోత్సహించేవారు. అలా పూర్ణిమకు చిన్నప్పటి నుంచే ప్రకృతిపై, పక్షులపై ప్రేమ కలిగింది.

కొంగలపై పరిశోధన..

సాధారణంగా పిల్లలు పైతరగతులకు వెళ్లే కొద్దీ తమ లక్ష్యాలను మార్చుకుంటారు. డబ్బు, మంచి గుర్తింపు లభించే కోర్సులను ఎంచుకుంటారు. కానీ, పూర్ణిమ మాత్రం చిన్నప్పుడు ప్రకృతి, పక్షులపై పెంచుకున్న ప్రేమను మరవలేదు. జువాలజీలో మాస్టర్స్‌ చేసిన ఆమె స్థానికంగా ఉండే ‘గ్రేటర్ అడ్జటంట్’ అనే కొంగలపై పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. అయితే ఆ కొంగల సంఖ్య చిన్నప్పడు తను చూసిన వాటితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని ఆమె గమనించారు. ఇందుకు గల కారణాలు తెలుసుకోవాలని ఆమె భావించారు. పట్టణీకరణ పెరగడం, చెట్లను నరికివేయడంతో ఆ కొంగలు స్థానిక గ్రామాల్లోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. అయితే కొంగలు తమ పిల్లల ఆహారం కోసం జంతువుల అవశేషాలతో పాటు చెత్తను మోసుకొస్తుండడంతో గ్రామస్తులు తమ ఇళ్లలోని చెట్లను నరకడం మొదలుపెట్టారు. దాంతో అవి ఎటూ వెళ్లలేక వాటి సంఖ్య తగ్గిపోతున్నాయని పూర్ణిమ తెలుసుకున్నారు. దాంతో తన థీసిస్‌కు విరామం ఇచ్చి కొంగల పరిరక్షణకు నడుం బిగించారు.

‘నువ్వు శుభ్రం చేస్తావా’..?

గ్రేటర్ అడ్జటంట్ కొంగలను స్థానికంగా హర్‌గిలా అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ హర్‌గిలాలను రక్షించే క్రమంలో పూర్ణిమకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి కొంగలు రాకుండా ఉండడం కోసం తన ఇంట్లోని చెట్టును నరకడంతో చెట్టుపై ఉన్న తొమ్మిది హర్‌గిలా పిల్లలకు గాయాలయ్యాయి. అది చూసిన పూర్ణిమ ఆ కొంగలు పర్యావరణానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అతనికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి కోపంతో ‘కొంగలు వేసే చెత్తను పనిమనిషిలాగా నువ్వు శుభ్రం చేస్తావా’ అనడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కనీసం ఆ పిల్లలనైనా రక్షిద్దామని భావించారు. వాటిని స్థానిక జూకి తీసుకెళ్లడానికి గ్రామస్తుల సహాయం కోరగా వారు కూడా హేళన చేశారు. అప్పుడు పూర్ణిమ ‘ఇది వారి తప్పు కాదు. ముందు వారిలో వీటిపై ఉన్న వ్యతిరేక అభిప్రాయాన్ని మార్చాలని’ నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో 2007లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

‘హర్‌గిలా’ అలా ప్రారంభమైంది...

హర్‌గిలా కొంగలను పరిరక్షించే క్రమంలో గ్రామస్తులు వాటిని తమకు గౌరవ సూచకంగా భావించేలా చేయాలనుకున్నారు. ఇందుకోసం అక్కడి మహిళలే సరైన మార్గం అనుకున్నారు. ఈ క్రమంలో కొంగలు మానవాళికి చేస్తోన్న మేలు గురించి వారికి వివరించాలనుకున్నారు. ఇందుకోసం నిర్వహించే కార్యక్రమాలకు మహిళలను ఆకర్షించడానికి వంటల పోటీలు పెట్టడం మొదలుపెట్టారు. అవి విజయవంతం కావడంతో ఈ కార్యక్రమాలకు వచ్చే మహిళల సంఖ్య క్రమంగా పెరిగింది. అలా వారికి కొంగల పట్ల అవగాహన కల్పించడంలో విజయవంతమయ్యారు. ఈ క్రమంలో వారితో కలిసి కొంగల కోసం ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేయడం, గాయపడిన కొంగపిల్లలకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఈ బృందానికి ‘హర్‌గిలా ఆర్మీ’ అనే పేరుంది. ఈ ఆర్మీలో దాదాపు 10 వేల మంది మహిళలు ఉన్నారు. ‘హర్‌గిలా’ అంటే ఎముకలు తినే పక్షి అని అర్థం.

కొంగలను సంరక్షించడంలో భాగంగా పూర్ణిమ అక్కడి మహిళల  కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. కొంగల సంతానోత్పత్తి సమయంలో ‘పంచామృత్‌ వేడుక’ను జరపడం ప్రారంభించారు. అలాగే అవి పిల్లలు కనే సమయాన్ని మరో ఉత్సవంగా జరిపించేవారు. ఇలా కొంతకాలానికి అక్కడి ప్రజలకు కూడా కొంగలపై అవగాహన కలగడం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలను గుర్తించిన ప్రభుత్వం కూడా వారికి సహకరించడం మొదలుపెట్టింది. దాంతో 2007లో కేవలం 28 కొంగ గూళ్లు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 250కి చేరుకుంది. అందుకే పూర్ణిమను అక్కడి ప్రజలు ‘హర్‌గిలా బైదు’ (కొంగల సహోదరి) అని అభిమానంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం- పూర్ణిమ అవిఫానా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు.

ఆదాయ మార్గం కూడా...

పూర్ణిమ తన బృందంలోని మహిళలకు కొంగల పరిరక్షణపై అవగాహన కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు. అసోం సంప్రదాయ దుస్తులు, టవల్స్ తయారు చేయడానికి వారికి కావాల్సిన సామగ్రిని అందించారు. ఈ దుస్తుల పైన కొంగలకు సంబంధించిన బొమ్మలను చిత్రించేలా శిక్షణ ఇచ్చారు. ఈ దుస్తులు అక్కడికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడంతో అక్కడి మహిళలకు మంచి ఆదాయవనరుగా మారింది. దాంతో వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవకాశం ఏర్పడింది.

ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఎర్త్‌ అవార్డు ప్రకటించిన తర్వాత పూర్ణిమ ‘ఈ అవార్డుతో నా కల సాకారమైంది. దీనిని భూమాతకు, ప్రపంచంలోని తల్లులందరికీ అంకితమిస్తున్నాను. ఎందుకంటే అమ్మ ఒడి నుంచే అసలు చదువు మొదలవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

హర్‌గిలా కొంగలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటాయి. వాటి రెక్కలు దాదాపు 8 అడుగుల వెడల్పు ఉంటాయి. ఇవి ఆహారపు గొలుసును కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ కొంగలు కేవలం 1200 మాత్రమే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అధిక శాతం అసోంలో ఉండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్