close
Updated : 02/10/2021 11:35 IST

అమ్మ నడవడికను.. భార్య అహింసను నేర్పారు !

ఎంత గొప్పవాడైనా ఓ తల్లికి బిడ్డే ! అలానే ఆలి సహాయం లేనిది ఆకాశాన్ని తాకిన మహానుభావులు అరుదు ! ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లే మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మహాత్ముడిగా మారడం వెనుక ఇద్దరు స్త్రీలున్నారు. వారే గాంధీ మాతృశ్రీ పుత్లీబాయ్ గాంధీ, ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ. ఒక్క ప్రమాణం చేయించుకొని పుత్లీబాయ్ గాంధీని సన్మార్గంలో నడిపారు. తుది శ్వాస వరకూ గాంధీ వెన్నంటే ఉన్న కస్తూర్బా అహింసతో అనుకున్నది ఎలా సాధించుకోవాలో గాంధీకి నేర్పారు. గాంధీ జయంతి సందర్భంగా సాధారణ వ్యక్తిని మహాత్ముడిగా మలచిన ఈ మహిళామణుల గురించి తెలుసుకుందాం రండి !

అందరికీ మహాత్ముడే అయినా తల్లికి 'మోనియా'నే !

గాంధీ తండ్రి కరమ్‌చంద్ గాంధీకి పుత్లీబాయ్ నాల్గవ భార్య. మొదటి ముగ్గురు భార్యలు అకాల మరణం చెందారు. అప్పటికే ఇద్దరు కూతుళ్లు కలిగిన కరమ్‌చంద్ గాంధీ, కుటుంబ భారాన్ని చూసుకోవడానికి పుత్లీబాయ్‌ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కరమ్‌చంద్ గాంధీకి, పుత్లీబాయ్‌కి మధ్య దాదాపు ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినా అన్ని విషయాల్లో పరిణతితో ఆలోచించి కుటుంబ భారాన్ని సమర్ధంగా భుజాన వేసుకున్నారు పుత్లీబాయ్.

కొంతకాలానికి పుత్లీబాయ్‌కి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు జన్మించారు. వీరిలో గాంధీ చిన్నవారు కాగా ఆయన్ని గారాబంగా 'మోనియా' అని పిలుచుకునేవారు పుత్లీబాయ్. చదువుకోకపోయినా అన్ని విషయాల్లో తెలివిగా నడుచుకుంటూ అందరి ముందూ సహృదయతను చాటుకున్నారు. అందుకే అందరూ ఇష్టపడే పుత్లీబాయ్ అంటే గాంధీకి అమితమైన ప్రేమ. తాను సన్మార్గంలో పయనించడానికి తల్లి నేర్పిన నడవడిక చెరగని ముద్ర వేసిందని గాంధీ ఎప్పుడూ చెబుతారు. నిత్యం భగవతారాధన చేయనిది పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకునేవారు కాదట పుత్లీబాయ్. ప్రతి విషయంలో పుత్లీబాయ్ చూపే ఈ క్రమశిక్షణే తనకూ అలవడిందని గాంధీ అనేకమార్లు తెలిపారు.

ఉన్నత చదువులు చదవడానికి గాంధీ ఇంగ్లండ్ వెళ్తానంటే ఇంటిల్లిపాదితో కలిసి తన నగలను అమ్మేశారు పుత్లీబాయ్. పాశ్చాత్య దేశాల సంస్కృతి గురించి ఇరుగుపొరుగు వారు చెడుగా మాట్లాడినా తన పెంపకం మీద నమ్మకంతో మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లవద్దని గాంధీతో ప్రమాణం చేయించుకొని ఇంగ్లండ్ పంపారు పుత్లీబాయ్. తమిళనాడులోని మహాకవి భారతీయార్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 5న 'పుత్లీబాయ్ డే'ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈరోజు పాఠశాలలోని టీనేజ్ పిల్లలు తమ తల్లి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తారంటే ఆమె మాటకి మహాత్ముడు ఇచ్చిన విలువేంటో తెలుస్తుంది.

అహింసా వాదాన్ని ఆమే నేర్పింది !

ఇక గాంధీ సతీమణి కస్తూర్బాకు, గాంధీకి వయసులో పెద్దగా తేడా లేదు. పెళ్లి సమయానికి ఇద్దరికీ పదమూడేళ్లే ! గాంధీ కంటే కస్తూర్బానే ఆరు నెలలు పెద్ద కూడా ! బహుశా అందుకేనేమో గాంధీతో ఎంతో పరిణతిగా, హుందాగా నడుచుకునేవారు కస్తూర్బా. చాలామంది దంపతుల్లాగే ఇరువురి మధ్య కూడా మొదట్లో చిన్న చిన్న విభేదాలు వచ్చేవట. అయితే ఆయా విషయాల్లో గాంధీ కస్తూర్బాపై ఒత్తిడి తెచ్చేవారట కానీ కస్తూర్బా మటుకు చాలా నిదానంగా ఉంటూనే తన పని తాను చేసుకుంటూ పోయేదట. దీంతో గాంధీనే తర్వాత తన తప్పు తెలుసుకొని తన దుందుడుకు స్వభావానికి నొచ్చుకునేవారట. ఈ విషయాన్ని తన ఆత్మకథలో ప్రస్తావించిన గాంధీ తనకు అహింసా వాదాన్ని కస్తూర్బానే నేర్పిందని తెలిపారు.

అనుకున్నది సాధించడంలో పట్టుదల, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదురు నిలిచే ధైర్యం గాంధీ అస్త్రాలుగా మారడం వెనుక ఉన్నది కస్తూర్బానే ! ఇందుకు దక్షిణాఫ్రికాలో గాంధీతో కలిసి కస్తూర్బా చూపించిన తెగువే నిదర్శనం. వలసదారులకు సంబంధించి అప్పటి సౌతాఫ్రికా ప్రభుత్వం క్రైస్తవులకు తప్ప మిగతా దంపతులకు చట్టబద్ధత కల్పించనంది. దీంతో అక్కడి వారికి మద్దతుగా గాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అయినా కూడా అక్కడి వారు ధైర్యం చేయకపోవడంతో అప్పుడు మహాత్ముడి వెంట మొదటి అడుగు వేసింది కస్తూర్బానే. ఆ తర్వాత కూడా అనేక మార్లు గాంధీ జైల్లో ఉన్నప్పుడు ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు కస్తూర్బా. అలా అర్థాంగి అన్న పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తూ గాంధీ ప్రతి ఉద్యమంలో పాలుపంచుకొన్నారు.

1906లో సంసార బంధం నుండి సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నట్లు గాంధీ తెలుపడంతో ఒక్కమాట కూడా ఎదురు చెప్పకపోవడం కస్తూర్బా స్థితప్రజ్ఞతకు నిదర్శనం. చివరకు 1944లో అనారోగ్యంతో ఇక చనిపోతాను అనుకున్న కస్తూర్బా, తనను గాంధీ వద్దకు తీసుకెళ్లమని సహచరులను కోరారు. చివరి క్షణాల్లో తన మరణం గురించి దు:ఖించవద్దని గాంధీకి తెలిపి సంతోషంగా ఉండాలని కోరారు. అలా గాంధీ ఒళ్లోనే తలపెట్టి 1944 ఫిబ్రవరి 22న తనువు చాలించారు. కస్తూర్బా అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా కాటిని వదిలి వెళ్లలేదు గాంధీ. అక్కడి వారు రమ్మన్నా కూడా '62 ఏళ్ల పాటు జీవితాన్ని పంచుకున్నాం.. ఈ కొన్ని క్షణాలు తనతో ఉండనివ్వండి' అని పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు ఉన్నారు గాంధీ. అంతేకాదు తాను పలికిన ప్రతి మాటలోని సత్యం, తాను ప్రతి ఉద్యమంలో చూపిన ధైర్యం కస్తూర్బా అన్నారు. ఒక్క అక్షరం చదువుకోకపోయినా అనంతమైన జ్ఞానానికి కస్తూర్బా నిదర్శనం అన్నారు. ఆఖరుగా తన ప్రతి అడుగు వెనక వెన్నంటి ఉన్న కస్తూర్బా లేకపోతే.. తాను ఎప్పుడో పాతాళానికి పడిపోయేవాడినని గాంధీ అన్నారంటే కస్తూర్బా గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి