Published : 03/10/2022 17:18 IST

అనుకుంటే చాలు.. ఆదిపరాశక్తులే!

ఆ అమ్మ వారు ఒక్కరే అయినా.. ఎన్నో రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటుంది.. తనను కొలిచిన వారి కోర్కెలు తీర్చడానికి విభిన్న రూపాల్లో సాక్షాత్కరిస్తుంది. అందుకే దసరా అంటే ఒక రోజుకే పరిమితమైన పండగ కాదు.. పది రోజుల పాటు ఆ అమ్మను విభిన్న రూపాల్లో కొలిచి సేవించే అతి పెద్ద పండగ. భక్తుల కడుపు నింపే అన్నపూర్ణాదేవిగా ఒక రోజు, సిరులు ప్రసాదించే మహాలక్ష్మీ దేవిగా మరో రోజు, విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ దేవిగా ఇంకో రోజు.. ఇలా పాడ్యమి మొదలుకొని దశమి వరకు పది అవతారాల్లో అమ్మ మనకు దర్శనమిస్తుంటుంది.

ఎన్నో అవతారాలు!

ఇలా అమ్మవారి అవతారాల్లాగే ప్రతి ఆడపిల్లలోనూ ఎన్నో రూపాలుంటాయి. ప్రతి అమ్మాయీ జీవన గమనంలో ఎన్నో అవతారాలెత్తాల్సి వస్తుంది. వివిధ రంగాల్లో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని మనం మన పిల్లలకు వివరించాలి. అయితే ఆ దశలన్నింటిలోనూ విజయవంతంగా ముందుకు దూసుకుపోవాలంటే చిన్నతనం నుంచే వారికి మంచి విద్యను అందించడంతో పాటు; ఓ ఆడపిల్లగా అడుగడుగునా ఎదురయ్యే అరాచకాలను, వేధింపులను ఎదిరించే ధైర్య సాహసాలు, జీవన నైపుణ్యాలను కూడా అలవర్చాలి.

వారికి కేవలం మనం చెబితే అర్థం కాదు.. చిన్నతనం నుంచీ వారు మనల్ని గమనిస్తూ ఎదుగుతారు.. కాబట్టి మన ప్రవర్తన వారిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇవన్నీ మనం పాటిస్తూ చెబితే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు.

నిర్భయంగా ఎదిగేలా..!

దుర్గమ్మ అంటేనే శక్తికి మారు రూపం. తన అపారమైన శక్తితో ఎందరో రాక్షసుల్ని దునుమాడి ఈ లోకాన్ని సురక్షితంగా కాపాడుతుందా చల్లని తల్లి. అందుకే ఆ అమ్మలోని శక్తియుక్తుల్ని పుణికిపుచ్చుకునేలా మన అమ్మాయిల్ని ప్రేరేపించాలి. ఎన్నో రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెడుతున్నా ఈ రోజుల్లో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలకు అంతూ-పొంతూ లేకుండా పోతోంది. మరి, వీటికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం చట్టంపై ఆధారపడడం కాకుండా ఆడపిల్లలంతా ఎవరికి వారే తమ శక్తిసామర్ధ్యాలను పెంచుకోవాలి. ఈ క్రమంలో- శారీరకంగా దృఢంగా తయారు కావడానికి కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకునేలా వారిని ప్రేరేపించాలి. తద్వారా ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే స్వయంగా పరిష్కరించుకునే శక్తి, బలం వారి సొంతమవుతాయి. కేవలం తామే కాదు.. తమ చుట్టూ ఉన్న వారిని రక్షించేంత ధైర్యవంతులవుతారు కూడా!

అన్నిట్లోనూ ఆరితేరేలా...

రూపం ఒక్కటే అయినా.. ఎనిమిది చేతులతో ఈ లోకాన్ని రక్షిస్తుందా చల్లని తల్లి. ఓ చేత్తో చల్లగా ఉండమని దీవిస్తూ, మరో చేత్తో దుష్టులను శిక్షిస్తుంటుంది.. ఇలా ఏకకాలంలో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ.. మల్టీటాస్కింగ్‌కి మహిళలు మరో పేరని నిరూపిస్తోందీ అమ్మల గన్న అమ్మ. ఇదే విషయాన్ని మనం మన పిల్లలకు బోధించాలి. చిన్నప్పటి నుంచే  వారికి అన్ని పనులూ నేర్పించాలి. ఏ విషయంలో అయినా సరే ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా శిక్షణ ఇవ్వాలి.

దూరదృష్టితో.. లక్ష్య సాధన!

అమ్మవారి కళ్లను పద్మాలతో పోల్చుతుంటారు. ప్రతి అమ్మాయీ దూరదృష్టిని కలిగి ఉండాలని తన విశాలమైన నేత్రాలతో చెప్పకనే చెబుతుందా చల్లని తల్లి. ఇదే విషయాన్ని మనం కూడా మన పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగాలంటే చిన్నప్పటి నుంచే దూరదృష్టితో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. తమ పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకొని వారు ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా, దాన్ని సాధించేలా చేసే బాధ్యత తల్లిదండ్రులదే! ఈ క్రమంలో వారి అవసరాలను తీర్చుతూ, వారిని ప్రశాంతమైన, పాజిటివ్ వాతావరణంలో పెరగనిస్తూ, మీ వంతు ప్రోత్సాహాన్ని వారికి అందిస్తూ వారి లక్ష్య సాధనకు సహకరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని