జిమ్నాస్టిక్స్‌లో... ‘బంగారు’ దీప!

దేశంలో జిమ్నాస్టిక్స్‌ రారాణి అంటే వినిపించేది దీపా కర్మాకర్‌ పేరే! ఆ రంగంలో ఎన్నో అంశాల్లో ‘తొలి’గా నిలిచింది. నిజానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్‌ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపిందామె. తాజాగా బంగారు పతకం సాధించి చరిత్రలో మరోసారి తన పేరు లిఖించుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన శ్రమెంతో... దాటిన సవాళ్లెెన్నో!

Updated : 03 Jun 2024 07:42 IST

దేశంలో జిమ్నాస్టిక్స్‌ రారాణి అంటే వినిపించేది దీపా కర్మాకర్‌ పేరే! ఆ రంగంలో ఎన్నో అంశాల్లో ‘తొలి’గా నిలిచింది. నిజానికి దేశంలో అమ్మాయిలను జిమ్నాస్టిక్స్‌ వైపుగా నడిచేలా స్ఫూర్తి నింపిందామె. తాజాగా బంగారు పతకం సాధించి చరిత్రలో మరోసారి తన పేరు లిఖించుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన శ్రమెంతో... దాటిన సవాళ్లెెన్నో!

శిక్షణ గది బయట ఎదురు చూస్తున్నాడు తండ్రి. గంటలు గడుస్తున్నాయి కానీ ఎంతసేపటికీ బయటికి రాదే! ఇంట్లోనేమో బంధువులు ఎదురుచూస్తున్నారు. ఆరోజు దీప కర్మాకర్‌ పుట్టినరోజు. కేక్‌ కోయడానికి రమ్మంటే ఈమెనేమో ‘ట్రైనింగ్‌ పూర్తవ్వాల్సిందే’నని పట్టుబట్టింది. అప్పటికామెకు పదేళ్లు కూడా లేవు. దీప పట్టుదలకు ఓ ఉదాహరణే ఇది. ఇప్పటికీ ఆమె తీరంతే. నిజానికి జిమ్నాస్టిక్స్‌లోకి దీప కావాలనేమీ రాలేదు. ఆరేళ్ల వయసులో ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది తనను ఎంపిక చేసి శిక్షణిచ్చారు. ఈమెది అగర్తల. నాన్న శాయ్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ కోచ్‌. అయినా దీప ప్రయాణం అంత సులువేమీ కాలేదు. అసలే ఎక్కడ పడిపోతానో, దెబ్బలు తగిలించుకుంటానో అని భయపడేది. దాన్ని దాటి నెమ్మదిగా ఇష్టం పెంచుకుంటోంటే ‘జిమ్నాస్టిక్స్‌కి పనికి రాద’న్నారు. కారణం ఈమె పాదం పూర్తిగా నేలను తాకేది. అలా ఉన్నవారికి విన్యాసాలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయట. పాదాల్లో ఆ వంపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది. రోజూ 8 గంటలు సాధన చేసేది. మంచి స్కూళ్లయితే శిక్షణకు ఇబ్బంది అని... ఉత్తీర్ణతను పెద్దగా పట్టించుకోని స్కూలునే ఎంచుకుంది.

సదుపాయాల్లేవు...

నిధులు, సరైన సదుపాయాల్లేవు. జిమ్‌లో వాడే పరుపులు, పాత స్కూటర్‌ భాగాలే శిక్షణ వస్తువులు. అయినా నిరూపించుకోవాలన్న కసి. అదే దీపను ప్రపంచానికి పరిచయం చేసింది. 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారం సాధించి, దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకుంది. 2014 ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కీ, ఒలింపిక్స్‌కీ అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో 77 పతకాలు సాధించింది. ‘పతకం కోసం ప్రాణం పోయినా పర్లేదంటుంది’... దీపతో పరిచయం ఉన్నవారెవరైనా చెప్పే మాటే ఇది. ‘ప్రొడునోవా’ మనవాళ్లకు దీని గురించి పరిచయం చేసింది దీపానే. ‘వాల్ట్‌ ఆఫ్‌ డెత్‌’గా పిలిచే ఈ విన్యాసాన్ని చేయడానికి మహామహులే భయపడతారు. పరుగెత్తుతూ వచ్చి, బల్ల సాయంతో గాల్లో రెండుసార్లు పల్టీలుకొట్టి, నేలపై నిలవాలి. ఈక్రమంలో ఏ పొరపాటు జరిగినా మెడ, వెన్ను విరగడమే కాదు, చావూ పలకరించొచ్చు. దాన్ని అలవోకగా చేసి, పాయింట్లు రాబడుతుంది. కాబట్టే, ఒలింపిక్స్‌లో పతకం రాకపోయినా... నాలుగోస్థానంలో నిలిచి, ప్రపంచ క్రీడాభిమానుల మనసులు గెలుచుకుంది.

ఓ వెలుగు వెలిగీ...

ఒలింపిక్స్‌ ముగిసి, దేశానికి తిరిగొచ్చాక దీపకి సాదర ఆహ్వానం లభించింది. ప్రశంసలు, పురస్కారాలు దక్కాయి. సచిన్‌ తెందూల్కర్‌ బీఎండబ్ల్యూ కారును బహూకరించాడు. ఆమె స్ఫూర్తిగా ఎంతోమంది అమ్మాయిలు జిమ్నాస్టిక్స్‌లో చేరారు. తన జీవితకథ పుస్తకంగా వచ్చింది. ఇదంతా కోణానికి ఒకవైపే. మరోవైపు గాయాలు దీపని వేధించాయి. మోకాలికి సర్జరీ అయ్యింది. ఆ తరవాత ఒక ఛాంపియన్‌షిప్‌లో బంగారం గెలిచినా మళ్లీ గాయం తిరగబెట్టింది. అన్నీ దాటుకొని వస్తే నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుందని 21 నెలలు ఆట నుంచి నిషేధించారు. ‘ఆటగాళ్లకు సస్పెన్షన్‌ పెద్ద శిక్ష. ఆ రోజుల్ని చీకటి రోజులుగానే చెబుతా. ఆ ఉత్ప్రేరకాలు నా శరీరంలోకి ఎలా వచ్చాయో కూడా తెలియదు. ఇదే చెబితే నా మాట వినలేదెవరూ. ఒకరకంగా కుంగిపోయా. కానీ తిరిగి పైకి దూసుకెళ్లాలనుకుని మరింత సాధన చేశా’ననే దీప అనుకున్నది సాధించింది. తాజాగా ఆసియన్‌ గేమ్స్‌లో బంగారు పతకం గెలిచి, అది సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డప్పుడూ, గెలిచి అగ్రస్థానాన నిలిచినప్పుడూ దీపది ఒకటే తీరు... సంయమనంతో వ్యవహరించడం. ఈ తీరే ఆమెను ఎంతోమంది ఆదర్శంగా తీసుకునేలా చేస్తోంది. ‘ఈసారి ఒలింపిక్స్‌ చేజారినా... దేశానికి మరిన్ని పతకాలు తేవడమే లక్ష్యం’ అంటోన్న ఆమె పట్టుదల, దీక్ష అందరిలో స్ఫూర్తిని నింపేవే కదూ! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్