మటన్ త్వరగా ఉడకాలంటే...!
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్‌వెజ్ వంటకం ఏదైనా సరే.. వండాలంటే కాస్త కష్టపడాల్సిందే.. అందులోనూ మటన్ అయితే చెప్పే పనే లేదు.. ఒక్కోసారి త్వరగా అయిపోతే మరోసారి ఎన్ని విజిల్స్ వచ్చినా....
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్‌వెజ్ వంటకం ఏదైనా సరే.. వండాలంటే కాస్త కష్టపడాల్సిందే.. అందులోనూ మటన్ అయితే చెప్పే పనే లేదు.. ఒక్కోసారి త్వరగా అయిపోతే మరోసారి ఎన్ని విజిల్స్ వచ్చినా మటన్ ఉడకనే ఉడకదు. ఆ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ ఇబ్బందిని అధిగమించడమే కాదు.. గ్యాస్ కూడా పొదుపు చేయొచ్చు. అవేంటో తెలుసుకుందాం..!
రాళ్ల ఉప్పు
మాంసాన్ని కడిగి నీళ్లన్నీ పోయేలా బాగా గట్టిగా పిండాలి. ఆ తర్వాత ఆ మాంసంలో కొద్దిగా రాళ్ల ఉప్పు (మామూలు ఉప్పు వేయకూడదు) వేసి బాగా కలిపి ఒక గంట తర్వాత వండితే మాంసం త్వరగా ఉడికిపోతుంది. ఉడకలేదంటూ మళ్లీ స్టౌపై పెట్టాల్సిన అవసరమే ఉండదు. మాంసం ఉప్పును బాగా పీల్చుకుని మెత్తగా ఉడికిపోతుంది.
టీ
మాంసాన్ని వండే ముందు టీ డికాషన్ (చక్కెర వేయకుండా) వడబోసి, దాన్ని మాంసంలో పోసి ఒక అరగంట లేక గంట ఉంచాలి. ఆ తర్వాత వండితే మటన్ త్వరగా ఉడికిపోతుంది. టీలో ఉండే ట్యానిన్లు మాంసాన్ని త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయి.
వెనిగర్ / నిమ్మరసం..
వెనిగర్ లేదా నిమ్మ రసం కూడా మాంసం ఉడకడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఆమ్ల ద్రవాలు కాబట్టి మాంసాన్ని త్వరగా ఉడికేలా చేయడంతో పాటు కూర వండేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వచ్చేలా చేస్తాయి.
టమాటోలతో..
టమాటోలో కూడా ఆమ్ల గుణం ఉంటుంది. అందుకే వీటిని పేస్ట్ చేసి వేయడం లేదా టమాటో సాస్ వేయడం వల్ల ఫలితం కనబడుతుంది. చాలామంది నాన్‌వెజ్ వంటకాల్లో టమాటో ముక్కలను వేసుకుంటూ ఉంటారు. కొంతమంది సాస్‌ని కూడా ఉపయోగిస్తారు. కాకపోతే వీటిని కూర ఉడికిన తర్వాత వేసుకోవడం వారికి అలవాటు. అయితే తర్వాత వేయడం కన్నా పోపు సమయంలోనే వేసుకోవడం వల్ల మాంసం తొందరగా ఉడుకుతుంది.
బొప్పాయి ఆకు
మటన్ మెత్తగా ఉడకడానికి బొప్పాయి ఆకు లేదా పచ్చిబొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. ఇందులోని పెపైన్ అనే పదార్థం మాంసంలోని బంధాలు విడిపోవడానికి, తద్వారా అది మెత్తగా మారడానికి ఉపయోగపడుతుంది.
అల్లం తురుముతో..
అల్లంలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్‌ల కారణంగా మాంసం త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయి. సాధారణంగా మనం కూర వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తుంటాం. అలా కాకుండా అల్లం తురుమును ముందే వేసి మాంసం ఉడికిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మాంసం తొందరగా ఉడుకుతుంది.
పెరుగు
మటన్ వండటానికి ఒక గంటసేపు ముందు పెరుగులో నానబెట్టి ఆ తర్వాత వండితే సరి.. మటన్ తొందరగా ఉడికిపోతుంది. పెరుగుకు బదులు మజ్జిగ వాడినా ఫలితం ఉంటుంది. దీనివల్ల శరీరానికి క్యాల్షియం కూడా అందుతుంది.
పండ్లు కూడా..!
మటన్ మెత్తగా ఉడకడానికి మనకు అందుబాటులో ఉండే పండ్లను కూడా ఉపయోగించవచ్చు. కివీ, పైనాపిల్, బొప్పాయి లాంటి పండ్లలో ఉన్న ఎంజైమ్స్ మటన్ తొందరగా ఉడకడానికి ఉపకరిస్తాయి. వీటిలో ఏదో ఒక పండును తీసుకొని మెత్తగా చేసుకొని దాన్ని మాంసంలో వేస్తే సరిపోతుంది. అయితే మరీ ఎక్కువగా వేసేస్తే రుచి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది మొత్తాల్లో ఉపయోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.